PM Narendra Modi: జనాభాకు తగ్గట్టే హక్కులన్న కాంగ్రెస్ నినాదంపై ప్రధాని మోదీ ‘కొత్త స్వరం’.. ఇదెక్కడి లాజిక్కు?
ABN, First Publish Date - 2023-10-03T22:58:18+05:30
తమ హయాంలో జరుగుతున్న అరాచకాల గురించి పల్లెత్తి మాట కూడా మాట్లాడని ప్రధాని మోదీ.. తన మాటల గారడీతో మాత్రం ప్రతిపక్షాలపై ఏవేవో నిందలు వేస్తుంటారు. లాజికల్‌గా పాశం విసిరేందుకు ప్రయత్నిస్తుంటారు.
తమ హయాంలో జరుగుతున్న అరాచకాల గురించి పల్లెత్తి మాట కూడా మాట్లాడని ప్రధాని మోదీ.. తన మాటల గారడీతో మాత్రం ప్రతిపక్షాలపై ఏవేవో నిందలు వేస్తుంటారు. లాజికల్‌గా పాశం విసిరేందుకు ప్రయత్నిస్తుంటారు. అసలు సంబంధం లేని టాపిక్‌ని సైతం తెరమీదకి తీసుకొచ్చి, ప్రతిపక్షాలపై విమర్శలు సంధించడమే పనిగా పెట్టుకుంటారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ మోదీ అదే స్ట్రాటజీని బాగానే ఫాలో అవుతున్నారు. తాజాగా ‘జనాభాకు తగ్గట్టే హక్కులు ఉంటాయి’ అనే కాంగ్రెస్ నినాదంపై ఆయన కొత్త స్వరం స్టార్ట్ చేశారు.
అక్టోబర్ 3వ తేదీన తెలంగాణలోని నిజామాబాద్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త భాష మాట్లాడటం ప్రారంభించిందని అన్నారు. ఎంత జనాభానో, అంతే హక్కులని కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదాన్ని అందుకుందని పేర్కొన్నారు. ఎవరైతే ఈ నినాదం రాశారో.. వాళ్లు కాంగ్రెస్ ప్రాథమిక విధానాలపై ప్రశ్నలు సంధిస్తున్నారా? అని తాను అడగాలనుకుంటున్నారని చెప్పారు. జనాభాకి తగ్గట్టే హక్కులని చెప్తున్న కాంగ్రెస్.. తాము మైనారిటీలకు వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. మీరు దక్షిణ భారతదేశానికి వ్యతిరేకమని కాంగ్రెస్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వారి ఈ ఆలోచన వల్ల దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తాను బల్లగుద్ది చెప్తున్నానని ఉద్ఘాటించారు. ఈ కొత్త ఆలోచన మైనార్టీలకు వెన్నుపోటు పొడిచేదే అని ఆరోపణలు చేశారు.
ఈ రోజుల్లో దేశంలో డీలిమిటేషన్ గురించి చర్చ జరుగుతోందని.. జనాభా తక్కువగా ఉన్న చోట సీట్లు తగ్గుతాయని, అలాగే జనాభా ఎక్కువగా ఉన్న చోట్ల సీట్లు పెరుగతాయని మాట్లాడుకుంటున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే.. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు జనాభా పెరుగుదలను ఆపడంలో దేశానికి సహాయం చేశాయంటూ సీట్ల టాపిక్‌ని మోదీ ఒక్కసారిగా తిప్పేశారు. అంతేకాదు.. ఈ అంశాన్ని కాంగ్రెస్‌కు అంటగట్టాలని చూశారు. జనాభాకి తగ్గట్టే హక్కులుంటాయన్న నినాదంతో.. దక్షిణ భారతదేశంలో పార్లమెంటు సభ్యుల సంఖ్యను తగ్గించినట్లు కాంగ్రెస్ సరికొత్త నాటకానికి తెరలేపిందని ఆరోపించారు. ఈ కాంగ్రెస్ చర్యను దక్షిణ భారతదేశం అంగీకరిస్తుందా? దక్షిణ భారతదేశం కాంగ్రెస్‌ను క్షమిస్తుందా? అని కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెంచేందుకు మోదీ తనదైన ప్రశ్నలు సంధించారు.
దేశాన్ని మోసం చేయవద్దని కాంగ్రెస్ నేతలకు తాను స్పష్టం చేస్తున్నానని, దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలతో ఎందుకు అన్యాయ ఆటలు ఆడుతున్నారో వివరించాలని ప్రధాని మోదీ కోరారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ దారిలో నడుస్తోందో.. కూటమిలోని ఇతర పార్టీలకు ధైర్యం ఉంటే అడగాలని అన్నారు. తమిళనాడులోని దేవాలయాలపై ప్రభుత్వానికి హక్కు ఉందా? అని ఇదే సమయంలో మరో ప్రశ్న వేశారు. అక్కడి దేవాలయాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, ప్రభుత్వ అండదండలతో ఆలయాల ఆస్తులు లాక్కుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దేవాలయాలు దోచుకుంటున్నారు కానీ.. మైనారిటీల ప్రార్థనా స్థలాలను మాత్రం ముట్టుకోవడం లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తలపెట్టిన కొత్త నినాదం ప్రకారం.. మైనార్టీల ప్రార్థనా స్థలాలన్నీ జప్తు చేస్తారా? అని మోదీ చెప్పారు.
ఈ విధంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ చేసిన నినాదానికి, మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఎక్కడ పొంతన ఉందని ప్రశ్నిస్తున్నారు. అసలు డీలిమిటేషన్ ప్రక్రియను తెరమీదకి తీసుకొచ్చిందే బీజేపీ అని, అలాంటప్పుడు తమ తప్పుని కాంగ్రెస్‌పై రుద్దడం ఏంటని నిలదీస్తున్నారు. అందరికీ సమాన హక్కులు దొరకాలన్న ఉద్దేశంతో ‘జనాభాకి తగ్గట్టే హక్కులు ఉంటాయని’ కాంగ్రెస్ కొత్త నినాదాన్ని అందుకుందని.. కానీ మోదీ దాన్ని తప్పుగా చిత్రీకరించేందుకు గట్టిగానే కసరత్తులు చేస్తున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డీలిమిటేషన్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే.. కాంగ్రెస్ నినాదాన్ని మోదీ విమర్శలు ఎక్కుపెట్టినట్టు స్పష్టమవుతోందని చెప్తున్నారు.
Updated Date - 2023-10-03T22:58:18+05:30 IST