Udhayanidhi Stalin: సనాతన ధర్మం వివాదంపై ఉదయనిధి మరో బాంబ్.. ప్రధాని మోదీనే తప్పుగా చెప్పారు
ABN, First Publish Date - 2023-12-04T22:00:06+05:30
గతంలో సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. అప్పట్లో ఈ అంశమే హాట్ టాపిక్‌గా ఉండేది. ఇప్పుడు ఈ వ్యవహారంపై ఉదయనిధి మరోసారి స్పందించారు.
Sanatan Dharma Row: గతంలో సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. అప్పట్లో ఈ అంశమే హాట్ టాపిక్‌గా ఉండేది. ఇప్పుడు ఈ వ్యవహారంపై ఉదయనిధి మరోసారి స్పందించారు. తన వ్యాఖ్యల్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పార్టీ వక్రీకరించారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ప్రధాని మోదీనే తాను చెప్పని మాటలు చెప్పున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తప్పుదారి పట్టించారని ధ్వజమెత్తారు.
ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘నేను మారణహోమానికి పిలుపునిచ్చానని ప్రధాని మోదీ అన్నారు. కానీ.. నేనలా అనలేదు. నేను చెప్పని విషయాలను ఆయన చెప్పారు. నేను ఒక సమావేశంలో పాల్గొని మూడు నిమిషాలపాటు మాట్లాడాను. ఎలాంటి వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడాలని నేను చెప్పాను. వివక్షను రూపుమాపాలని అన్నాను. కానీ.. దాన్ని వక్రీకరించి, దాన్ని ఒక పెద్ద సమస్యగా మార్చి, యావత్ భారతదేశం నా గురించి మాట్లాడుకునేలా చేశారు’’ అని చెప్పుకొచ్చారు.
ఉదయనిధి స్టాలిన్ ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఎవరో గాడ్‌మ్యాన్ నా తలపై రూ.5-10 కోట్ల బహుమతిని ప్రకటించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. నాకు కోర్టుపై నమ్మకం ఉంది. నేను చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని నన్ను అడిగారు. కానీ.. నేను క్షమాపణ చెప్పనని తేల్చి చెప్పాను. నేను స్టాలిన్ కొడుకునని, కరుణానిధి (కలైంజ్ఞర్) మనవడినని.. వారి భావాజాలాన్ని మాత్రమే సమర్థిస్తున్నానని, క్షమాపణ చెప్పనని చెప్పాను’’ అంటూ ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు.
కాగా.. సెప్టెంబరులో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారు. ఇది సామాజిక న్యాయం. సమానత్వానికి విరుద్ధమని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. మద్రాస్ హైకోర్టు కూడా ఉదయనిధిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ విషయంలో పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించింది. విభజన ఆలోచనలను ప్రోత్సహించడానికి. ఏదైనా భావజాలాన్ని రద్దు చేయడానికి ఏ వ్యక్తికి హక్కు లేదని హైకోర్టు పేర్కొంది.
Updated Date - 2023-12-04T22:00:07+05:30 IST