Shivraj Singh Chauhan: కాళ్లు కడిగి, క్షమాపణ చెప్పిన సీఎం.. అసలేం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-07-06T11:52:25+05:30
మధ్య ప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా అవమానించిన గిరిజనుడికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan) క్షమాపణ చెప్పారు. బాధితుని పాదాలను కడిగి, శాలువతో సత్కరించారు. నిందితుడిని బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేయడంతోపాటు, అతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసిన సంగతి తెలిసిందే.
భోపాల్ : మధ్య ప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా అవమానించిన గిరిజనుడికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan) క్షమాపణ చెప్పారు. బాధితుని పాదాలను కడిగి, శాలువతో సత్కరించారు. నిందితుడిని బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేయడంతోపాటు, అతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసిన సంగతి తెలిసిందే.
దశమత్ రావత్ అనే గిరిజన కూలీపై ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో ఇటీవల బయటపడింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యమంత్రి శివరాజ్ వెంటనే స్పందించి, నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుడిని తాను భోపాల్‌లో కలుస్తానని, క్షమాపణ చెబుతానని ప్రకటించారు. నిందితుడిని పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 294 (అసభ్యకర చర్యలకు పాల్పడటం), 504 (శాంతికి భంగం కలిగేవిధంగా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), ఎస్సీ, ఎస్టీ చట్టం, జాతీయ భద్రత చట్టం ప్రకారం నిందితునిపై ఆరోపణలను నమోదు చేశారు. బుధవారం సాయంత్రం నిందితుని అక్రమ ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు. ఆ సమయంలో ఆయన తల్లి స్పృహ కోల్పోయారు. మధ్య ప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ, నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సీఎం చౌహాన్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో సిద్ధి జిల్లాలో ఓ వ్యక్తి మరొక వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోందని, ఆ విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి, జాతీయ భద్రత చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. బాధితుడిని, ఆయన కుటుంబ సభ్యులను తాను భోపాల్‌లో కలుస్తానని చెప్పారు.
బాధితుడు దశమత్ రావత్‌ను శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం కలిశారు. రావత్‌ను కుర్చీలో కూర్చోబెట్టి, ఆయన పాదాలను శివరాజ్ కడిగారు. ఆయనకు శాలువ కప్పి సత్కరించి, క్షమాపణ చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. తన మనసు ఎంతో బాధతో నిండిపోయిందని, ప్రజలే తనకు దేవుళ్లని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Canada : ‘ఖలిస్థాన్’పై కెనడా నేతలు మౌనం.. భారత దౌత్యవేత్తలకు భద్రత ఏర్పాట్లు..
Kapil Sibal : ఇది ప్రజాస్వామ్యం కాదు : కపిల్ సిబల్
Updated Date - 2023-07-06T11:57:58+05:30 IST