Rahul Gandhi in Manipur: రాహుల్ గాంధీ కాన్వాయ్‌ని అడ్డుకున్న మణిపూర్ పోలీసులు... హెలికాప్టర్ ద్వారా వెళ్లేందుకు నిర్ణయం
ABN, First Publish Date - 2023-06-29T15:47:11+05:30
హింసాత్మక పరిస్థితులతో అట్టుడికిపోతున్న మణిపూర్ సందర్శనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం అక్కడికి చేరుకున్నారు. 2 రోజులపాటు హింసాత్మక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అయితే రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నుంచి ఉద్రిక్త పరిస్థితులు అధికంగా ఉన్న చురచంద్‌పుర్‌కి బయలుదేరిన రాహుల్ కాన్వాయ్‌ని రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు.
ఇంఫాల్: హింసాత్మక పరిస్థితులతో అట్టుడికిపోతున్న మణిపూర్ సందర్శనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం అక్కడికి చేరుకున్నారు. 2 రోజులపాటు హింసాత్మక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అయితే రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నుంచి ఉద్రిక్త పరిస్థితులు అధికంగా ఉన్న చురచంద్‌పుర్‌కి బయలుదేరిన రాహుల్ కాన్వాయ్‌ని రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్ వద్ద ఆపివేశారు. భద్రతపై ఆందోళనలు నెలకొనడంతోనే కాన్వాయ్‌ని నిలిపివేసినట్టు వివరించారు. రాహుల్ గాంధీ కాన్వాయ్‌ని అడ్డుకునే అవకాశాలున్నాయని, పొరపాటు దాడి జరిగే అవకాశాలు లేకపోలేదని, భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతోనే కాన్వాయ్‌ని నిలిపివేశామని బిష్ణుపూర్ ఎస్పీ చెప్పారు. అక్కడి పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని, గత రాత్రి కూడా ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని వివరించారు. రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం లేకపోవడంతో హెలికాప్టర్ ద్వారా వాయుమార్గంలో చురచంద్‌పుర్‌కి చేరుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. మరికొద్దిసేపట్లో చేరుకునే అవకాశాలున్నాయి.
రాహుల్ తన 2 రోజుల మణిపూర్ పర్యటనలో భాగంగా రిలీఫ్ క్యాంప్‌లను సందర్శించాలనుకున్నారు. అక్కడి పౌర సమాజ ప్రతినిధులతో చర్చించాలని భావించారు. ఇందులో భాగంగానే చురచంద్‌పూర్ వెళ్లాలనుకుంటున్నారు. కాగా మే 3న హింస మొదలైన నాటి నుంచి రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. దాదాపు రెండు నెలలుగా అక్కడ హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. 300లకుపైగా రిలీఫ్ కేంద్రాల్లో 50 వేలకుపైగా మంది తల దాచుకుంటున్నారు. ఇప్పటివరకు మైటీ, కుకీ వర్గాలకు చెందిన దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారంటే అక్కడి పరిస్థితి ఏవిధంగా ఉందో చెప్పొచ్చు.
కాగా మణిపూర్‌లో మైదాన ప్రాంతాలకు చెందిన మైటీలు తమను గిరిజనులుగా గుర్తించాలని కేసు వేయడం.. ఆ దిశగా చర్యలకు హైకోర్టు ఆదేశాలివ్వడంతో రాష్ట్రంలో మే నెల 3 నుంచి కొండ ప్రాంతాలకు చెందిన కుకీ తెగ గిరిజనులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుంటున్నాయి. ఆందోళనల్లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది.
Updated Date - 2023-06-29T15:52:26+05:30 IST