Rajnath Singh: రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించినది వారే..
ABN, First Publish Date - 2023-10-29T20:41:21+05:30
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన ఘనత ఈ దేశంలోని సిక్కు కమ్యూనిటీదేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని గురుద్వారా ఆలంబాఘ్‌లో గురుగ్రంధ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో ఆదివారంనాడు ఆయన పాల్గొన్నారు.
లక్నో: అయోధ్య(Ayodhya)లో రామాలయ (Ram Temple) నిర్మాణం కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన ఘనత ఈ దేశంలోని సిక్కు కమ్యూనిటీదేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) అన్నారు. లక్నోలోని గురుద్వారా ఆలంబాఘ్‌లో గురుగ్రంధ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో ఆదివారంనాడు ఆయన పాల్గొన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు సిక్కు కమ్యూనిటీ ఎంతో చేసిందని కొనియాడారు.
''సిక్కులే రామజన్మ భూమి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. వారందించిన సహకారాన్ని ఏ ఒక్క భారతీయుడు మరిచిపోలేడు. సనాతన ధర్మ పరిరక్షణకు సిక్కు కమ్యూనిటీ ఎంతో చేసింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఒక కీలకమైన వాస్తవాన్ని అందరి ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. 1858 డిసెంబర్ 1న నమోదైన ఒక ఎఫ్ఐఆర్ ప్రకారం, గురుగోవింద్ సింగ్ గురుద్వారా ఆవరణలో కొందరు సిక్కులు నినాదాలు చేశారు. గోడల నిండా 'రామ్ రామ్' అని రాశారు'' అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. భారతదేశాన్ని, భారతీయులను రక్షించాలనే స్ఫూర్తి గురు నానక్ దేవ్ ఇచ్చినదేనని రాజ్‌నాథ్ ప్రశంసించారు. దేశాన్ని, దేశ ప్రజలను కాపాడే గురుతర బాధ్యత మనందరిపైనా ఉందని, గురునానక్ దేవ్ ఈ స్ఫూర్తిని రగిలించారని గుర్తుచేశారు.
Updated Date - 2023-10-29T20:43:15+05:30 IST