Akshata Sunak: బ్రిటన్ ప్రధాని భార్యకు ఇన్ఫోసిస్ నుంచి భారీ ఆదాయం... వెంటాడుతున్న ఆ వివాదం
ABN, First Publish Date - 2023-04-15T11:05:46+05:30
ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైనయిన ఇన్ఫోసిస్ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ 6వేల 134 కోట్ల రూపాయల లాభాలను నమోదు చేసింది.
దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడైన ఆర్ నారాయణమూర్తి కుమార్తె, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అయిన అక్షత ఆ సంస్థలో వాటాదారుగా భారీ ఆదాయాన్ని పొందుతుండగా... దీని వెంబడి ఓ వివాదం కూడా ఆమెను వెంటాడుతోంది. వివాదంలోకి వెళ్లేముందు తాజా పరిణామం గురించి తెలుసుకోవాలి...
ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైనయిన ఇన్ఫోసిస్(Infosys) తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ త్రైమాసికం(quarter)లో కంపెనీ 6వేల 134 కోట్ల రూపాయల లాభాలను నమోదు చేసింది. ఈ నేపధ్యంలో ఒక్కో షేరుపై రూ.17.50 డివిడెండ్(Dividend) చెల్లించాలని నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. కాగా కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సతీమణి అక్షత మూర్తి (Akshata Murthy)కి భారీగా ఆదాయాన్ని సమకూర్చనుంది. అక్షత ఇన్ఫోసిస్ సంస్థలో 3.89 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. కంపెనీ ఈ డివిడెండ్ చెల్లింపునకు జూన్ 2, 2023ను రికార్డు తేదీగా ప్రకటించింది.
ఈ నేపధ్యంలో కంపెనీ నుంచి అక్షత 68.17 కోట్ల రూపాయలను ఆదాయంగా పొందనున్నారు. ఒక్కో షేరుపై 16న్నర రూపాయలు మధ్యంతర డివిడెండ్(Interim Dividend)తో పాటు మొత్తం 132.4 కోట్ల రూపాయలను ఆమె డివిడెండ్ ఆదాయంగా అందుకోనున్నారు.
గత ఆర్థిక సంవత్సరంలోనూ..
అంతకుముందు 2022 సంవత్సరంలోనూ అక్షత తన వాటాలపై డివిడెండ్ రూపంలో రూ.126.61కోట్ల ఆదాయం అందుకున్నారు. మే 31న 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్(Infosys) ఒక్కో షేరుపై రూ.16 చొప్పున డివిడెండ్ చెల్లించింది. మే నుంచి అక్టోబరు వరకు రూ.16.5 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఫలితంగా ఒక్కో షేరుపై మొత్తం డివిడెండ్ రూ.32.5 అయ్యింది.
దీంతో అక్షత మూర్తికి తన వాటాలపై డివిడెండ్ రూపంలో రూ.126.61కోట్ల ఆదాయం వచ్చింది. కాగా అక్షత మూర్తి కర్ణాటక(Karnataka)లోని హుబ్బళ్లిలో జన్మించి, బెంగళూరులో పాఠశాల విద్యను అభ్యసించించారు. కాలిఫోర్నియాలోని క్లేర్‌మాంట్ మెక్‌కెన్నా కాలేజీలో ఎకనామిక్స్(Economics) పూర్తి చేశారు. అనంతరం లాస్ ఏంజిల్స్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీని పొందారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతున్న సమయంలో ఆమె రిషిసునక్‌ను కలుసుకున్నారు.
వీరికి 2009లో వివాహం జరిగింది. వీరికి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు పిల్లలున్నారు. రిషి సునాక్ దంపతులు రియల్ ఎస్టేట్(Real estate)లో పెట్టుబడులు పెడుతుంటారు. కెన్సింగ్టన్‌లో వీరికి ఇల్లు ఉంది. దీని విలువ రూ.71 కోట్లు. వీరికి కాలిఫోర్నియాలో ఒక పెంట్‌హౌస్, యార్క్‌షైర్(Yorkshire)లో ఒక భవనం కూడా ఉన్నాయి. అక్షత తల్లి సుధా మూర్తి(Sudha Murthy) రచయిత్రి. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంటారు.
అక్షతను చుట్టుముట్టిన 'నాన్-డొమిసిల్డ్' వివాదం
2009లో అక్షత మూర్తి సొంతంగా 'అక్షతా డిజైన్స్' పేరుతో ఒక ఫ్యాషన్ బ్రాండ్‌ను స్థాపించారు. ఇన్ఫోసిస్‌లో ఆమెకు 0.9శాతం వాటా ఉంది. ఆమె సంపదలో అధిక భాగం ఈ వాటా ద్వారానే లభిస్తుంది. దీని ద్వారా లభించిన సంపద 400 మిలియన్ పౌండ్ల (రూ. 3,981 కోట్లు)కంటే ఎక్కువే అని అంచనా. 2010లో నారాయణమూర్తి బ్రిటన్‌లో ప్రారంభించిన వెంచర్ క్యాపిటల్ బిజినెస్ క్యాటమరాన్ వెంచర్స్‌కు ఆమె డైరెక్టర్ కూడా. దీంతో పాటు ఆమెకు కనీసం ఆరు ఇతర యూకే కంపెనీలలో షేర్లు ఉన్నాయి. కాగా ఆమె 'నాన్-డొమిసిల్డ్' యూకే నివాసి కేటగిరీలో ఉండటంతో బ్రిటన్ చట్ట ప్రకారం ఆమె ఈ ఆదాయానికి యూకేలో ఆమె పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. ఈ నేపధ్యంలో బ్రిటన్‌లో చెల్లించాల్సిన మొత్తం పన్నును అక్షతామూర్తి చెల్లిస్తారని గతంలో ఆమె అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
అయితే ఓవర్సీస్ పన్నును ఆమె ఎక్కడ చెల్లిస్తున్నారనే అంశంపై పూర్తి పారదర్శకత కావాలని లేబర్ పార్టీ గతంలో కోరింది. లండన్‌కు చెందిన ఆమె ఐటీ మేనేజర్ అరవింద్ కుమార్ దీని గురించి మాట్లాడారు. ''అక్షతా మూర్తి ఏ తప్పూ చేయలేదు. ఆమె భారత పౌరురాలు. భారత పాస్‌పోర్ట్‌నే కలిగి ఉన్నారు. భారత్‌లో ఆమె సంపాదించే ఆస్తులకు సంబంధించిన పన్నులను ఆమె భారత ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఈ కారణంగా ఆమె యూకేలో పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు'' అని ఆయన స్పష్టం చేశారు. అయితే దీనిని చాలామంది ఏకీభవించడం లేదు.
Updated Date - 2023-04-15T14:22:10+05:30 IST