Sachin Pilot: నిరాహార దీక్షకు అల్టిమేటం..!
ABN, First Publish Date - 2023-04-09T14:47:28+05:30
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మళ్లీ చిక్కుల్లో పడిన సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి..
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) మళ్లీ చిక్కుల్లో పడిన సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే (Vasundhara Raje) అవినీతిపై చర్యలు తీసుకోవడంలో గెహ్లాట్ నిష్ర్కియాపరత్వానికి (Inaction) నిరసనగా ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ (Sachin Pilot) ప్రకటించారు. గత బీజీపీ ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం (Gehlot Government) ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దీనికి నిరసనగా ఈనెల 11న ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదనే అభిప్రాయం ప్రజల్లో కలగకూడదని, అవినీతిపై చర్యలు తీసుకోని పక్షంలో ప్రభుత్వం ఏ పనీ చేయడం లేదని, హామీలను నిలబెట్టుకోవడం లేదనే అభిప్రాయానికి రాజస్థాన్ ప్రజలు వస్తారని అన్నారు. వసుంధరారాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగానే తాను ఈనెల 11న ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.
సీఎం నుంచి స్పందన లేదు..
రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలుకు సంబంధించి అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాసానని, అయితే ఎలాంటి సమాధానం రాలేదని పైలట్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, పనులు ఒకేలా ఉండాలనీ, ఇందులో ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదని, ఇదే విషయాన్ని సీఎంకు రాసిన లేఖలో తాను పేర్కొన్నప్పటకీ ఇంతవరకూ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు.
కేంద్రానికి, రాజస్థాన్ సీఎంకు చురకలు...
సచిన్ పైలట్ అటు కేంద్రంపైన, ఇటు గెహ్లాట్ సర్కార్‌పైన నిశిత విమర్శలు చేస్తూ...''దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు కేంద్రం కాంగ్రెస్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుంటే, ఇక్కడ రాజస్థాన్‌లో మాత్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోవడం కానీ, దుర్వినియోగం చేయడం కానీ చేయడం లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదనే అభిప్రాయానికి రాజస్థాన్ ప్రజలు రాకూడదు'' అని పైలట్ అన్నారు.
Updated Date - 2023-04-09T18:25:08+05:30 IST