Satya pal Malik: కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు
ABN, First Publish Date - 2023-04-21T19:37:29+05:30
జాతీయ భద్రత, అవినీతిపై నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వైఖరితో సహా పలు సంచలన విషయాలను వెల్లడించిన జమ్మూకశ్మీర్..
న్యూఢిల్లీ: జాతీయ భద్రత, అవినీతిపై నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వైఖరితో సహా పలు సంచలన విషయాలను వెల్లడించిన జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Malik)కు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) సమన్లు పంపింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించనుంది. జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా మాలిక్ ఉన్న సమయంలో రిలయన్ ఇన్సూరెన్స్ అంశానికి సంబంధించిన అంశంపై ఆయనను సీబీఐ ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.
రిలయెన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్‌ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందని సత్యపాల్ మాలిక్ ఏప్రిల్ 14న కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనికి ముందు, డీబీ లైవ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మాలిక్ ఈ ప్రస్తావన చేశారు. ఈ లైవ్ ప్రసారం కాగానే సత్యపాల్ మాలిక్‌కు రామ్ మాధవ్ పరువునష్టం నోటీసు పంపారు. జమ్మూకశ్మీర్ గవర్నర్‌గానే కాకుండా మరో నాలుగు రాష్ట్రాల్లోనూ గవర్నర్‌గా మాలిక్ పనిచేశారు.
ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ ఇంకేమన్నారు?
జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారక ముందు ఆ రాష్ట్రానికి చివరి గవర్నర్‌గా పనిచేసిన సత్యపాల్ మాలిక్ 'ది వైర్' సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి సమయంలో, సీఆర్‌పీఎఫ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి 5 హెలికాప్టర్లను కోరిందని, అవి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా పెను దుమారం రేగింది. కాంగ్రెస్ పార్టీ సత్యపాాలిక్ మాలిక్ ఇంటర్వ్యూను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేసింది. ఆ ఇంటర్వ్యూలో.. ''సిఆర్‌పిఎఫ్ తమ జవాన్లను రవాణా చేయడానికి 5 హెలికాప్టర్లను కోరింది, ఎందుకంటే ఇంత పెద్ద కాన్వాయ్ ఎప్పుడూ రోడ్డు మార్గంలో వెళ్లదు. హోం మంత్రిత్వ శాఖను అడిగితే వారు నిరాకరించారు. పుల్వామా దాడి అనంతరం ఇదంతా మన పొరపాటు వల్లే జరిగిందని ప్రధానితో చెప్పాను. హెలికాప్టర్లు ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదని చెప్పాను. ఆయన వెంటనే మౌనంగా ఉండమని నాతో చెప్పారు'' అని సత్యపాల్ మాలిక్ వెల్లడించారు.
ప్రధానమంత్రి మోదీకి అవినీతి అంటే అంతగా ద్వేషం లేదని కూడా ఈ ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. ప్రధాని అవినీతిని అంతగా ద్వేషించరని తాను నిశ్చయంగా చెప్పగలనని అన్నారు. మోదీకి అవినీతిపై చిత్తశుద్ధి లేదంటూ మాలిక్ చేసిన వ్యాఖ్యల ఇంటర్వ్యూ ప్రసారం కాగానే, కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాటలను తొక్కిపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే నిజాన్ని ఎప్పటికీ అణచివేయలేరని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు.
Updated Date - 2023-04-21T20:27:04+05:30 IST