India and China : భారత్, చైనా రక్షణ మంత్రుల భేటీ
ABN, First Publish Date - 2023-04-27T20:23:49+05:30
భారత్, చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh), జనరల్ లీ షాంగ్ఫు (General Li Shangfu) గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ : భారత్, చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh), జనరల్ లీ షాంగ్ఫు (General Li Shangfu) గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2020లో గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత ఇటువంటి ఉన్నత స్థాయి సమావేశం జరగడం ఇదే మొదటిసారి. షాంఘై సహకార సంఘం (SCO) రక్షణ మంత్రుల సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.
రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో, ఎస్‌సీఓ సభ్య దేశాల రక్షణ మంత్రులతో రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 27, 28 తేదీల్లో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారని తెలిపింది. పరస్పర ప్రయోజనాలుగల అంశాలు, రక్షణ సంబంధిత సమస్యలపై చర్చిస్తారని తెలిపింది.
జనరల్ లీ షాంగ్ఫు ఎస్‌సీఓ సమావేశంలో ఏప్రిల్ 28న పాల్గొంటారు. ఈ సమావేశానికి ముందు లీ, రాజ్‌నాథ్ సమావేశం జరిగింది. ఇరు దేశాల సరిహద్దుల్లో పరిణామాలు, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు నెలకొనడంపైనే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, వాగ్దానాలకు అనుగుణంగా వాస్తవాధీన రేఖ వెంబడి సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవాలని చెప్పారని తెలిపింది. ప్రస్తుత ఒప్పందాలను ఉల్లంఘించడం వల్లనే ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని స్పష్టం చేశారని తెలిపింది. దళాల ఉపసంహరణతోనే ఉద్రిక్తతలు తగ్గుతాయని చెప్పినట్లు తెలిపింది.
ఇదిలావుండగా, భారత్, చైనా 18వ విడత కార్ప్స్ కమాండర్ లెవెల్ మీటింగ్ ఆదివారం చైనావైపునగల చూసుల్-మోల్డో సరిహద్దులో జరిగింది. వాస్తవాధీన రేఖ వెంబడి పశ్చిమ సెక్టర్‌లో క్షేత్ర స్థాయిలో భద్రత, సుస్థిరతలను కొనసాగించాలని ఇరు దేశాల కమాండర్లు అంగీకరించారు.
న్యూఢిల్లీలో శుక్రవారం జరిగే ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో చైనా, కిర్గిజ్‌స్థాన్, కజక్‌స్థాన్, రష్యా, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల రక్షణ మంత్రులు పాల్గొంటారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ ఈ సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి :
దలైలామా చేతికి రామన్ మెగసెసె అవార్డు
Modi Vs Jairam Ramesh : కాంగ్రెస్‌పై మోదీ వ్యాఖ్యలు.. ఘాటుగా బదులిచ్చిన జైరామ్ రమేశ్..
Updated Date - 2023-04-27T21:12:39+05:30 IST