Kannada Actor Darshan: పులిగోరు వివాదంలో కన్నడ హీరో దర్శన్.. ఇంట్లో సోదాలు
ABN, First Publish Date - 2023-10-25T23:00:46+05:30
కర్ణాటకలో ప్రస్తుతం ‘పులిగోరు’ వివాదం నడుస్తోంది. ఎప్పుడైతే బిగ్‌బాస్ కంటెస్టంట్ వర్తుర్ సంతోష్ పులిగోరు ధరించి కనిపించాడో.. అప్పటి నుంచి ఈ వివాదం తెరమీదకు వచ్చింది. ఈ వివాదంలో కన్నడ ప్రముఖులు...
కర్ణాటకలో ప్రస్తుతం ‘పులిగోరు’ వివాదం నడుస్తోంది. ఎప్పుడైతే బిగ్‌బాస్ కంటెస్టంట్ వర్తుర్ సంతోష్ పులిగోరు ధరించి కనిపించాడో.. అప్పటి నుంచి ఈ వివాదం తెరమీదకు వచ్చింది. ఈ వివాదంలో కన్నడ ప్రముఖులు ఒకరి తర్వాత మరొకరు చిక్కుకుంటున్నారు. గతంలో వీళ్లు పులిగోరు ధరించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో అటవీ అధికారులు రంగంలోకి దిగారు.
ఇప్పుడు ఈ వ్యవహారంలో కన్నడ స్టార్ నటుడు దర్శన్ కూడా ఇరుక్కున్నాడు. ఇటీవల ఒక ఆలయాన్ని సందర్శించినప్పుడు దర్శన్ పులిగోరు ధరించి కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో.. దర్శన్‌పై శ్రీనివాస్ అనే కార్యకర్త అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. దర్శన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కేవలం దర్శన్ ఇంట్లోనే కాదు.. పులిగోరు ధరించినట్టు సమాచారం అందిన ప్రతి ఒక్కరి ఇళ్లల్లోనే అధికారులు తనఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని శ్రీనివాస్ నివాసంలో సోదాలు జరపగా, పులిగోరు లాంటి మెటీరియల్ దొరికింది. దాన్ని తనిఖీ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు.
కేవలం దర్శన్ మాత్రమే కాదు.. జేడీఎస్ నేత & నటుడు నిఖిల్ కుమారస్వామి, బీజేపీ రాజ్యసభ ఎంపీ జగ్గేశ్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్, జ్యోతిష్యుడు వినయ్ గురూజీలు సైతం ఈ వివాదంలో చిక్కుకున్నారు. అయితే.. తాను ధరించింది నకిలీ పులిగోరు అని, వివాహ సమయంలో తనకు ఎవరో బహుమతిగా ఇచ్చారని, కావాలంటే అధికారులు తనిఖీ చేసుకోవచ్చని నిఖిల్ తెలిపాడు. అటు.. ఎంపీ జగ్గేశ్‌కి సంబంధించి రెండేళ్ల క్రితం నాటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో తనకు పులిగోరు తన 20వ పుట్టినరోజు సందర్భంగా తల్లి తనకు గిఫ్టుగా ఇచ్చారని తెలిపారు. అయితే.. దీనిపై ఆయన ఇంకా స్పందించలేదు. దర్శన్‌తో పాటు ఇతర ప్రముఖులు సైతం ఈ వివాదంలో ఇంతవరకూ నోరు మెదపలేదు.
కాగా.. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణుల్ని చంపడం, వాటి గోళ్లు, చర్మాలు, కొమ్ములు మొదలైన వాటిని కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. ఈ చట్టం ప్రకారం.. పులిగోరు ధరించడం కూడా చట్టవ్యతిరేకమే. అందుకే.. అటవీ అధికారులు పులిగోరు ధరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నేరానికి పాల్పడితే.. ఎంతటి వారిపైనా ఉపేక్షించేది లేదని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖంద్రే తెలిపారు.
Updated Date - 2023-10-25T23:00:46+05:30 IST