Udhayanidhi Stalin: ఉదయనిధి తలకు రివార్డు పెంచిన అయోధ్య స్వామీజీ
ABN, First Publish Date - 2023-09-05T15:40:26+05:30
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు బెదిరింపు హెచ్చరిక చేసిన అయోధ్య సాధువు పరమహంస ఆచార్య మరో ప్రకటన చేశారు. ఉదయనిధి తలకు ప్రకటించిన రూ.10 కోట్ల రివార్డు మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు.
లక్నో: సనాతన ధర్మం (Sanatana Dharma)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు బెదిరింపు హెచ్చరిక చేసిన అయోధ్య సాధువు పరమహంస ఆచార్య (Paramhans Acharya) మరో ప్రకటన చేశారు. ఉదయనిధి తలకు ప్రకటించిన రివార్డు మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు. ఉదయనిధి తల నరికి తెచ్చినవారికి రూ.10 కోట్ల రివార్డు ఇస్తామని ఇప్పటికే ఆయన ప్రకటించారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగీతో పోలుస్తూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో పరమహంస ఆచార్య ఈ రివార్డు ప్రకటించారు.
''ఆయన (ఉదయనిధి) తలకు రూ.10 కోట్లు సరిపోవని అనుకుంటే రివార్డు పెంచుతాను. సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని మాత్రం సహించను'' అని అని అయోధ్య స్వా్మీజీ అన్నారు. ఉదయనిధి తన వ్యాఖ్యలతో దేశంలోని 100 కోట్ల మంది ప్రజానీకం మనోభావాలను దెబ్బతీశారని ఆయన చెప్పారు. దేశంలో ఎలాంటి అభివృద్ధి జరిగినా సనాతన ధర్మం వల్లే జరిగిందని, ఉదయనిధి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పరమహంస ఆచార్య దిష్టిబొమ్మలు దగ్ధం
కాగా, ఉదయనిధి తలకు పరమహంస ఆచార్య రివార్డు ప్రకటించడంపై డీఎంకే మద్దతుదారులు మంగళవారంనాడు తమిళనాడులోని వెల్లూరులో నిరసనలకు దిగారు. స్వామీజీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. దీనికి ముందు, పరమహంస ఆచార్య గత ఆదివారంనాడు ఒక వీడియోను విడుదల చేశారు. ఉదయనిధి పోస్టర్‌ను ఒక చేత్తో, పొడవాడి కత్తిని మరో చేత్తో ఆయన పట్టుకున్నట్టు ఆ వీడియోలో ఉంది.
Updated Date - 2023-09-05T15:45:52+05:30 IST