Sharad Pawar: 2019 సీన్ రిపీట్.. లొంగేదే లేదంటూ వర్షంలో తడుస్తూ శరద్ పవార్ ప్రసంగం
ABN, First Publish Date - 2023-11-27T17:33:27+05:30
వర్షం పడితే మనమంతా ఏం చేస్తాం? వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగులు పట్టడమో లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడమో చేస్తాం. కానీ.. 82 ఏళ్ల వయసున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ మాత్రం..
Sharad Pawar Rain Speech: వర్షం పడితే మనమంతా ఏం చేస్తాం? వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగులు పట్టడమో లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడమో చేస్తాం. కానీ.. 82 ఏళ్ల వయసున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ మాత్రం వర్షాన్ని లెక్క చేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. కుండపోతగా వర్షం కురుస్తున్నా, తాను నిండా తడిచి ముద్దవుతున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజల కోసం ప్రసంగించారు. ఈ అరుదైన పరిణామం ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
ఆదివారం నవీ ముంబయిలో ఒక పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. ముఖ్య అతిథిగా శరద్ పవార్ హాజరయ్యారు. అంతకుముందు వాతావరణంలో ఎలాంటి మార్పు కనిపించలేదు కానీ, సరిగ్గా శరద్ పవార్ ప్రసంగించే సమయంలో ఒక్కసారిగా వర్షం కురిసింది. అలాంటి సమయంలో 82 ఏళ్ల వయసున్న శరద్ పవార్ తన ప్రసంగాన్ని ఆపేసి, సురక్షిత ప్రదేశానికి తరలి వెళ్తారని అంతా భావించారు. కానీ.. అందరి అంచనాలకు భిన్నంగా ఆయన వర్షంలో తడుస్తూనే ప్రసంగించారు. కనీసం గొడుకు కూడా పట్టలేదు. ఏది ఏమైనా లొంగేదే లేదంటూ ఆయన మాట్లాడుతూ.. అక్కడ తడుస్తున్న ప్రజల్లోనూ జోష్ నింపారు.
“ఈ వర్షం కురవడం వల్ల మా ప్రణాళికలు దెబ్బతిన్నాయి. కానీ.. మేము అంత తేలిగ్గా లొంగం, వెనకడుగు వేయం. భవిష్యత్తులో కూడా మన పోరాటాన్ని కొనసాగించాలి” అంటూ శరద్ పవార్ చెప్పుకొచ్చారు. ఎన్సీపీ పార్టీపై నియంత్రణ సాధించేందుకు తన మేనల్లుడు అజిత్ పవార్ ఎన్నో ప్రయత్నాలు చేశాడని కూడా తన ప్రసంగంలో ఆయన వివరించారు. ఏదేమైనా.. వర్షంలో తడుస్తూ శరద్ పవార్ ఇచ్చిన ఈ ప్రసంగానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 82 ఏళ్ల వయసులోనూ వర్షాన్ని లెక్క చేయకుండా ఆయన ప్రసంగం ఇవ్వడంపై చాలామంది ప్రశంసిస్తున్నారు.
శరద్ పవార్ ఇలా వర్షంలో తడుస్తూ ప్రసంగించడం ఇదే మొదటిసారి కాదు. 2019లోనూ ఇలాగే జరిగింది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సతారాలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించగా.. భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో కూడా పవార్ వెనక్కు తగ్గకుండా వర్షంలో తడుస్తూనే.. వాన దేవుడు ఆశీర్వదించాడని ప్రసంగించారు. ఒక కార్యకర్త గొడుగు అందించడానికి ముందుకొస్తే.. దాన్ని ఆయన మర్యాదపూర్వకంగా తిరస్కరించారు. ఆ ప్రసంగం పార్టీ అదృష్టాన్నే మార్చేసింది. అప్పట్లో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ మూడో స్థానానికి ఎగబాకింది.
Updated Date - 2023-11-27T17:33:28+05:30 IST