Shashi Tharoor: ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తూనే.. విమర్శల దాడి చేసిన శశి థరూర్
ABN, First Publish Date - 2023-09-11T19:39:53+05:30
ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా.. ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్య దేశాల ఏకాభిప్రాయం తీసుకురావడం నిజంగా గొప్ప విషయమని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఇదివరకే..
ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా.. ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్య దేశాల ఏకాభిప్రాయం తీసుకురావడం నిజంగా గొప్ప విషయమని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఇదివరకే ప్రశంసలు కురిపించారు. ఇందులో కీలక పాత్ర పోషించిన జీ20 షెర్పాను ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా మరోసారి ఈ అంశంపై స్పందించిన ఆయన.. ప్రధానమంత్రి మోదీని పొగుడ్తూనే, విమర్శలు గుప్పించారు. 18వ జీ20 సమ్మిట్‌లో న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ప్రకటన నిజంగా భారత్ దౌత్య విజయమని, దీనిపై సభ్య దేశాల్ని ఏకాభిప్రాయానికి తీసుకొచ్చినందుకు మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అయితే.. ఈ జీ20 సదస్సుని మోదీ ప్రభుత్వం తనకు అనుకూలమైన అస్త్రంగా మార్చుకుందంటూ పెదవి విరిచారు.
‘‘ఢిల్లీ డిక్లరేషన్ నిస్సందేహంగా భారతదేశానికి దౌత్యపరమైన గొప్ప విజయం. ఎందుకంటే.. G20 శిఖరాగ్ర సమావేశం జరిగే వరకు ఎలాంటి ఒప్పందాలు కుదరకపోవచ్చని అనుమానాలు ఉండేవి. ఉమ్మడి కమ్యునికేషన్ సాధ్యం కాకపోవచ్చని భావించాం. కానీ.. ఆ అంచనాలకి భిన్నంగా ఢిల్లీ డిక్లరేషన్‌పై భారత్ ఏకాభిప్రాయం సాధించింది. మరో విశేషం ఏమిటంటే.. గతంలో ఏ జీ20 ప్రెసిడెన్సీ (ఈ సదస్సుకి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన గత దేశాలు) చేయని పనిని భారత ప్రభుత్వం చేసింది. ఈ సమావేశాల్ని ప్రభుత్వం జాతీయ వేడుకలా నిర్వహించింది. 58 నగరాల్లో 200 మీటింగులు నిర్వహించారు. మా ప్రెసిడెన్సీలోనూ పబ్లిక్ ఈవెంట్స్, యూనివర్సిటీల అనుసంధాన కార్యక్రమాలు, సివిల్ సొసైటీ వంటి కార్యక్రమాలు జరిగాయి. కానీ.. ప్రస్తుత అధికార బీజేపీ పార్టీ ఈ జీ20 సదస్సుని తమకు ఆస్తిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది’’ అని శశి థరూర్ చెప్పుకొచ్చారు.
శశి థరూర్ ఇంకా మాట్లాడుతూ.. ‘‘G20 సమావేశాల్ని చాలా దేశాలు నిర్వహించాయి. కానీ.. ఏ అధికారపక్షం కూడా తన నాయకత్వాన్ని ఈ విధంగా జరుపుకోలేదు. ఢిల్లీలో ప్రతి 50 మీటర్లకు చొప్పున మోదీ పోస్టర్లు అంటించారు. ఇదేదో తమ వ్యక్తిగత విజయంలా.. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ ప్రచారం చేసుకుంటున్నారు’’ అని చెప్పారు. తనని తాను ప్రజాస్వామ్య మాతగా పిలుచుకునే దేశం.. ఒక ఈవెంట్‌ని అందుకు భిన్నంగా ప్రదర్శించుకుంటోందని, ఇది నిజంగా చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే.. ప్రతి పక్షాలను జీ20 సదస్సుకు ఆహ్వానించకపోవడంపై కూడా ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలకు చోటు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చురకలంటించారు. డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్రం ఏదైతే సామరస్య స్ఫూర్తి కనబర్చిందో.. దేశీయ వ్యవహారంలో మాత్రం కనబర్చలేకపోయిందని ఎద్దేవా చేశారు.
Updated Date - 2023-09-11T19:39:53+05:30 IST