America : రెహోబోత్ బీచ్‌లో జో బైడెన్.. వైరల్ అవుతున్న ఫొటో..
ABN, First Publish Date - 2023-08-01T12:20:19+05:30
వివిధ దేశాధినేతలతో మంతనాలు, ఉన్నతాధికారులతో చర్చలు వంటివాటితో క్షణం తీరిక లేకుండా గడిపే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కాసేపు సరదాగా బీచ్‌లో గడిపారు. సూటు, బూటు, టై వంటి జంఝాటాలను వదిలేసి, ఏసీ గదుల జీవితాన్ని వీడి, సూర్య కిరణాల నునులేత వెచ్చదనాన్ని ఆస్వాదించారు.
వాషింగ్టన్ : వివిధ దేశాధినేతలతో మంతనాలు, ఉన్నతాధికారులతో చర్చలు వంటివాటితో క్షణం తీరిక లేకుండా గడిపే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కాసేపు సరదాగా బీచ్‌లో గడిపారు. సూటు, బూటు, టై వంటి జంఝాటాలను వదిలేసి, ఏసీ గదుల జీవితాన్ని వీడి, సూర్య కిరణాల నునులేత వెచ్చదనాన్ని ఆస్వాదించారు. శరీరం పై భాగంలో వస్త్రాలేవీ లేకుండా, చలువ కళ్లద్దాలు ధరించి, ఇసుక తిన్నెలపై కలియదిరిగారు. 80 ఏళ్ల వయసులో ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపించడంతో ఓ జర్నలిస్ట్ ఆయనను కెమెరాలో బంధించి, ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
గతంలో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ఓ గుఱ్ఱంపై సవారీ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఆయన కూడా శరీరం పై భాగంలో వస్త్రాలేవీ ధరించకుండా ఈ సవారీ చేసి, తాను శారీరకంగా దృఢంగా ఉన్నానని చాటి చెప్పారు. అదే విధంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన శారీరక దృఢత్వాన్ని నిరూపించుకోవడం కోసం సిల్వస్టర్ స్టాలోన్ కండలు తిరిగిన శరీరానికి తన తలను తగిలించిన ఫొటోను షేర్ చేశారు. తాను బలంగా ఉన్నానని చెప్పుకున్నారు.
జో బైడెన్ బీచ్ డే సందర్భంగా లాంగ్ బ్లూ స్విమ్మింగ్ ట్రంక్స్, బ్లూ టెన్నిస్ షూస్, బ్యాక్‌వార్డ్స్ బేస్‌బాల్ టోపీ, సన్ గ్లాసెస్ ధరించి ఆదివారం డెలావారేలోని రెహోబోత్ బీచ్‌లో కలియదిరిగారు. నునులేత సూర్య కిరణాలు శరీరాన్ని తాకుతుండగా, ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ, బీచ్‌లో కలియదిరిగారు. ఆయన ఉత్సాహాన్ని చూసిన జర్నలిస్టు ఎరిక్ గెల్లెర్ ఆయనను కెమెరాలో బంధించి, ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘‘ప్రెసిడెంట్ బైడెన్ అద్భుతమైన బీచ్ డేను రెహోబోత్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు’’ అని ఆ జర్నలిస్ట్ పేర్కొన్నారు. ఎరిక్ గెల్లెర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, తాను బీచ్‌లో నడుస్తూ వెళ్తున్నపుడు బైడెన్‌ను గమనించి, తన సెల్‌ఫోన్‌తో మూడు ఫొటోలు తీశానని చెప్పారు. ఆ సమయంలో ఆయన కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్నారని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయాణాలు చేసేటపుడు శ్వేత సౌధం రిపోర్టర్లు ఆయనను అనుసరిస్తారు. రెహోబోత్ బీచ్‌లో గొడుగు క్రింద బైడెన్ దంపతులు కూర్చున్న ఫొటోను తీశారు. ఆ సమయంలో ఆయన బ్లూ పోలో షర్ట్ ధరించారు.
చరిత్రలో అత్యంత వృద్ధుడైన అధ్యక్షుడిగా జో బైడెన్ రికార్డు సృష్టించారు. 2024లో మళ్లీ గెలిచి, నాలుగోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని ఆయన కలలు కంటున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై చర్చ జరుగుతోంది. అమెరికన్లు ఆయన ఆరోగ్యాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Nuh violence : హర్యానాలో మత ఘర్షణలు.. ఇద్దరు హోం గార్డులు సహా ముగ్గురి మృతి..
Karnataka : టీటీడీకి కర్ణాటక డెయిరీ ‘నందిని’ షాక్
Updated Date - 2023-08-01T12:20:19+05:30 IST