Siddharamaih: సీఎం పదవి కోసం మేమిద్దరం పోటీపడితే తప్పేంటి?
ABN, First Publish Date - 2023-04-24T17:58:36+05:30
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆసక్తికరమైన..
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తనకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు (DK Shivakumar)కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.
''ఆరోగ్యకరమైన పోటీ ఉండటం తప్పేమీ కాదు. డీకే శివకుమార్ సీఎం కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. నేను ముఖ్యమంత్రి పదవిని ఆశించినా తప్పు కాదు. అంతిమంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది'' అని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య పేర్కొన్నారు. మరో ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఎన్నికల్లో కులం ఒక్కటే ప్రధానం కాదని, ఇతర అంశాలు కూడా ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం అవినీతి అంశాలు, రైతు వ్యతిరేక అంశాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలు కూడా ఉన్నాయని, కర్ణాటక ప్రజలు కులాన్ని ఒక ప్రధానమైన అంశంగా తీసుకోరని, దీనిని ఎవరైనా ఒక ప్రధానాంశంగా చేపట్టినా ప్రజలు పట్టించుకోరని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి 2013లో చాలా స్పష్టమైన తీర్పు వచ్చిందని, తమ హయాంలో 2013 నుంచి 20118 వరకూ ఎన్నో మంచి పనులు చేపట్టామని చెప్పారు. అగ్రవర్ణాలకు తాను వ్యతిరేకినని, హిందుత్వ, హిందు ధర్మానికి వ్యతిరేకినని బీజేపీ చాలా ఆరోపణలు చేసిందని, అవేమీ నిజం కావని అన్నారు. వాళ్ల ఆరోపణల్లో నిజం లేదనే విషయం ప్రజలకు తెలినందుకు ఈసారి కూడా బీజేపీ ప్రచారం ఏమాత్రం నిలవదని ధీమా వ్యక్తం చేశారు.
మా మధ్య ఫైట్ ఏమిటి?
ఈ ఎన్నికలు తనకు, నరేంద్ర మోదీకి మధ్య పోటీ ఎంత మాత్రం కాదని సిద్ధరామయ్య అన్నారు. ఆ విధంగా చూడకూడదని చెప్పారు. ఇవి రాష్ట్ర ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలే కానీ, పార్లమెంటు సభ్యులను ఎన్నుకునే ఎన్నికలు కావని, స్థానిక అంశాలే రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని చెప్పారు. కర్ణాటకలో ఏ కార్యాలయానికి వెళ్లినా అవినీతి అనుభవాలే ప్రజలకు ప్రతిరోజూ ఎదురవుతున్నాయని, ఈ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని సిద్ధరామయ్య చెప్పారు.
Updated Date - 2023-04-24T17:58:36+05:30 IST