DK Shivakumar: మంత్రివర్గ కూర్పుపై సిద్ధూ, డీకే కసరత్తు
ABN, First Publish Date - 2023-05-19T14:54:18+05:30
బెంగళూరు: కర్ణాటక సీఎం పంచాయితీకి ఎట్టకేలకు తెరబడి.. సిద్ధరామయ్యను సీఎంగా, డీకే శివకుమార్‌నును ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించడంతో అగ్రనేతలిరువురూ ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారించారు. రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలాతో కలిసి ఉభయులూ శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారు.
బెంగళూరు: కర్ణాటక సీఎం పంచాయితీకి ఎట్టకేలకు తెరబడి.. సిద్ధరామయ్యను (Siddaramaiah) సీఎంగా, డీకే శివకుమార్‌ను (DK Shivakumar)ను ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించడంతో అగ్రనేతలిరువురూ ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై (Cabinet Formation) దృష్టిసారించారు. రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలాతో కలిసి ఉభయులూ శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారు. మల్లికార్జున్ ఖర్గేను కలిసి తొలి విడత మంత్రివర్గ విస్తరణపై చర్చిస్తారు. అనంతరం శనివారం మధ్యాహ్నం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో 12.30 గంటలకు కొద్ది మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకే తాము తొలి ప్రాధాన్యత ఇస్తామని ఢిల్లీ ప్రయాణానికి మందు మీడియాకు డీకే తెలిపారు.
జి.పరమేశ్వర అసంతృప్తి?
కాగా, డీకేకు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, ఇంకెవరకూ డిప్యూటీ సీఎంలు ఉండరంటూ పార్టీ అధిష్ఠానం సంకేతాలివ్వడంతో ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సీనియర్ దళిత నేత జి.పరమేశ్వరకు నిరాశ ఎదురైంది. సీఎం, డిప్యూటీ సీఎం పదవులలో ఏదో ఒకటి తనను వరిస్తుందని ఆయన ఆశించారు. దీనిపై మీడియా ప్రశ్నించినప్పుడు, అంతా ఏదో ఒక దశలో త్యాగాలు చేయాల్సి ఉంటుందంటూ ఆయన ముక్తసరిగా సమాధానమిచ్చారు.
కాంగ్రెస్ హామీలివే...
కాగా, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని డీకే శివకుమార్ శుక్రవారం ఉదయం శ్రీ కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లను సమీక్షించేందుకు వెళ్తూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ఐదు హామీలు ఇచ్చింది. 'గృహజ్యోతి పథకం' కింద గృహాసరాలకు ఉపయోగించే విద్యుత్ 200 యూనిట్ల వరకూ ఉచితంగా అందించడం, 'గృహ లక్ష్మి' పథకం కింద ప్రతి కుటుంబంలో పెద్ద అయిన మహిళకు రూ.2,000 చొప్పున నెలసరి సాయం, 'అన్న భాగ్య' పథకం కింద బీపీఎల్ హౌస్‌హోల్ట్ మెంబర్లకు పది కిలోల ఉచిత బియ్యం, 'యువ నిధి పథకం' కింద డిప్లమో హోల్డర్లకు రూ.1,500, గ్రాడ్యుయేట్లకు రూ.3,000 నెలవారీ భృతి, 'శక్తి' పథకం కింద రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం హామీలను కాంగ్రెస్ ఇచ్చింది.
Updated Date - 2023-05-19T14:56:11+05:30 IST