Singara Chennai 2.0: రూ.98.59 కోట్లతో సింగార చెన్నై 2.0 పథకాలు
ABN, First Publish Date - 2023-02-12T07:53:05+05:30
సింగార చెన్నై 2.0(Singara Chennai 2.0) ప్రాజెక్టు కింద 42 నిర్మాణ పనులు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉత్తర్వు జారీ చేశారు.
చెన్నై, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): సింగార చెన్నై 2.0(Singara Chennai 2.0) ప్రాజెక్టు కింద 42 నిర్మాణ పనులు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉత్తర్వు జారీ చేశారు. ఆ మేరకు రూ.98.59 కోట్ల నిధులను కూడా కేటాయించారు. ఆ నిధులతో సెంట్రల్ రైల్వే స్టేషన్(Central Railway Station) సమీపంలో ఉన్న విక్టోరియా హాలు, నగరంలో వివిధ ప్రాంతాల్లోని ఉద్యానవనాలు, క్రీడా మైదానాలకు మరమ్మతు పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు. సింగార చెన్నై 2.0 ప్రాజెక్టు కింద నగరంలోని 11 ఉద్యానవనాలు, రెండు క్రీడా మైదానాలు, 10 సముద్రపు నాచు పార్కులు, 16 పాఠశాలలు, విక్టోరియా హాలును మరమ్మతు చేయాలని ఆయన తెలిపారు. వృద్ధులు, చిన్నారులకు ఆహ్లాదం కలిగించే రీతిలో ఉద్యానవనాలను తీర్చిదిద్దాలని, ప్రతి ఉద్యానవనంలో ఎనిమిది అంకె రూపంలో కాలిబాటను నిర్మించాలని, క్రీడామైదానాలలో ఫుట్‌బాల్, బేస్కట్ బాల్, వాలీబాల్ క్రీడలు జరిపేందుకు అనువైనవిగా మార్చాలన్నారు. ప్రాచీన వారసత్వ సంపద భవనంగా పేరుగడించిన విక్టోరియా హాలుకు పూర్వవైభవం కల్పించే విధంగా తీర్చిదిద్దాలన్నారు.
Updated Date - 2023-02-12T07:53:07+05:30 IST