Hunger Index:ఆకలిగా ఉన్నారా అని హంగర్ ఇండెక్స్ తయారు చేస్తున్నారు.. నివేదికపై మండిపడ్డ స్మృతి ఇరానీ
ABN, First Publish Date - 2023-10-21T10:26:36+05:30
'మీకు ఆకలిగా ఉందా?' అని ప్రజలను అడిగి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ తయారుచేస్తోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో జరిగిన సమావేశంలో 'భారతదేశంలో మహిళల భవిష్యత్ పాత్ర' అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఇరానీ మాట్లాడారు. ఇటీవల హంగర్ ఇండెక్స్ - 2023 నివేదిక విడుదలైన క్రమంలో ఇరానీ స్పందించారు.
హైదరాబాద్: 'మీకు ఆకలిగా ఉందా?' అని ప్రజలను అడిగి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ తయారుచేస్తోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో జరిగిన సమావేశంలో 'భారతదేశంలో మహిళల భవిష్యత్ పాత్ర' అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఇరానీ మాట్లాడారు. ఇటీవల హంగర్ ఇండెక్స్ - 2023 నివేదిక విడుదలైన క్రమంలో ఇరానీ స్పందించారు. ఆకలి చావుల్ని తగ్గించేందుకు బీజేపీ ఎంతో కృషి చేసిందని.. కాంగ్రెస్ పార్టీకి ఈ అంశంపై కనీస అవగాహన లేదని ఆమె విమర్శించారు. హంగర్ ఇండెక్స్ లో భారత్ చాలా వెనకబడిందన్న రిపోర్టుపై ఆమె మండిపడ్డారు. ప్రజలను పిలిచి, ఆకలితో ఉన్నారా అని అడిగి ఆ నివేదిక తయారు చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజల ఆకలి బాధలు తగ్గాయనే విషయాన్ని హంగర్ ఇండెక్స్ సూచీలు ఉద్దేశపూర్వకంగా తెలపట్లేదని ఇరానీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే ఖండించారు. ఆమె మాట్లాడుతూ.. "ప్రధాని మోదీ హయాంలో దేశంలో ఆకలి చావులు పెరిగిపోయాయి. అందుకు ఉదాహరణే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మీరు శిశు మరణాలపై మాట్లాడకపోవడం హేయనీయం. గ్లోబర్ హంగర్ ఇండెక్స్ నివేదికలో భారత్ ర్యాంక్ చూసి బీజేపీ సర్కార్ తలదించుకోవాలి. ఆ నివేదికనే ఇరానీ తప్పుబట్టడం హాస్యాస్పదం. దేశ ప్రజల ఆకలిని చిన్న చూపు చూడటం తగదు" అని అన్నారు.
భారత్ ర్యాంక్..
గ్లోబల్ హంగర్ ఇండెక్స్-2023లో 125 దేశాలలో ఇండియా 111వ స్థానంలో ఉంది. ఈ నివేదిక తప్పులతడకగా ఉందని అధికార బీజేపీ ఆరోపించింది. ఇండియాలో ప్రపంచంలోనే అత్యధికంగా 18.7 శాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు నివేదికలో ఉంది. 28.7 స్కోర్‌తో భారత్ లో చాలా మంది ఇప్పటికీ ఆకలితో అలమటిస్తున్నారని రిపోర్ట్ తెలిపింది. భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్ (102వ స్థానం), బంగ్లాదేశ్ (81వ స్థానం), నేపాల్ (69వ స్థానం), శ్రీలంక (60వ స్థానం) ఆకలి సూచీలో భారత్ కంటే మెరుగ్గా ఉండటం గమనార్హం.
Updated Date - 2023-10-21T10:26:36+05:30 IST