Sri Lanka : బ్యాలట్ పేపర్ల ముద్రణకు డబ్బుల్లేక, ఎన్నికలు వాయిదా
ABN, First Publish Date - 2023-02-21T19:39:55+05:30
దివాలా తీసిన శ్రీలంక వచ్చే నెలలో జరగవలసిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటోంది. ఈ ఎన్నికలు జరిగితే దేశాధ్యక్షుడు
కొలంబో : దివాలా తీసిన శ్రీలంక వచ్చే నెలలో జరగవలసిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటోంది. ఈ ఎన్నికలు జరిగితే దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe)కు ప్రజల మద్దతు ఏ మేరకు ఉందో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే బ్యాలట్ పేపర్ల ముద్రణకు, పోలింగ్ బూత్‌ల వద్ద భద్రత కల్పించేందుకు తగినన్ని నిధులు లేకపోవడంతో ఈ ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటోంది.
శ్రీలంకలో స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి 9న జరగవలసి ఉంది. ఈ ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటున్నట్లు తెలియడంతో ప్రతిపక్షాలు మంగళవారం పార్లమెంటులో నిరసన వ్యక్తం చేశాయి. దీంతో పార్లమెంటు వాయిదా పడింది. ఈ ఎన్నికలు దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు గీటురాయి వంటివని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన గత ఏడాది జూలైలో దేశాధ్యక్ష పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే.
శ్రీలంక ఎన్నికల కమిషన్ చీఫ్ నిమల్ పుంచిహెవ సుప్రీంకోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, బ్యాలట్ పేపర్ల ముద్రణ, ఇంధనం, పోలింగ్ బూత్‌ల వద్ద భద్రత కోసం నిధులు ఇచ్చేందుకు ఖజానా శాఖ నిరాకరించింది. అయితే ఓ వార్తా సంస్థతో నిమల్ మాట్లాడుతూ సకాలంలో ఎన్నికలు జరుపుతామని సుప్రీంకోర్టుకు చెప్పామని, కానీ ఖజానా శాఖ నిధులను విడుదల చేసేందుకు నిరాకరిస్తోందని, అందువల్ల ఎన్నికలను నిర్వహించలేమని ఇప్పుడు చెప్తున్నట్లు తెలిపారు.
రణిల్ విక్రమసింఘే అంతకుముందు మాట్లాడుతూ, తగినంత ఆదాయం లేనందువల్ల ఎన్నికల నిర్వహణ అసాధ్యమని తెలిపారు. జీతాలు, పింఛన్లు, ముఖ్యమైన సేవల నిర్వహణకు తగినన్ని నిధులు అందుబాటులో లేవన్నారు.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను మన దేశం అన్ని విధాలుగా ఆదుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Agnipath scheme : అగ్నివీరుల నియామక ప్రక్రియలో సరికొత్త నిర్ణయం
Jaishankar : ఆ పని చేసినది రాహుల్ గాంధీ కాదు : విదేశాంగ మంత్రి
Updated Date - 2023-02-21T19:39:58+05:30 IST