Karnataka Assembly Elections: కాంగ్రెస్‌లో చేరిన కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి... చివరి క్షణంలో బీజేపీకి ఊహించని ట్విస్ట్
ABN, First Publish Date - 2023-04-14T21:26:54+05:30
భారతీయ జనతా పార్టీకి(BJP) ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణసవది (Laxman Savadi) గుడ్‌బై చెప్పారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ అధికార భారతీయ జనతా పార్టీకి(BJP) ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణసవది (Laxman Savadi) గుడ్‌బై చెప్పారు. బెళగావి జిల్లా అథణి టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో (Congress) చేరిపోయారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో పార్టీ ఇన్‌చార్జ్ రణదీప్‌సింగ్ సుర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రతిపక్షనేత సిద్ధరామయ్య నివాసానికి వెళ్లారు. చర్చలు ఫలించడంతో విధానపరిషత్ సభాపతి బసవరాజ హొరట్టి నివాసానికి వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరారు. 2004, 2013లో అథణి నుంచి లక్ష్మణసవది ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో ఓడిపోయారు. అయినా లక్ష్మణ సవదికి నాటి ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రత్యేక అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీని చేసి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే తాజా ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన కమలానికి టాటా చెప్పేశారు.
లక్ష్మణ సవది పార్టీని వీడటంపై కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ టికెట్లు ఇవ్వలేకపోతున్నామన్నారు. కాంగ్రెస్‌లో ఆయన తన భవిష్యత్‌ను చూసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. 60కి పైగా స్థానాల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులే లేరని బొమ్మై ఎద్దేవా చేశారు. శనివారం తాను నామినేషన్ వేస్తానని బొమ్మై చెప్పారు.
మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చే వారందరికీ అవకాశాలివ్వలేమని డీకే(DK) కూడా చెప్పుకొచ్చారు.
అటు జేడీఎస్ (JDU) 49 మంది అభ్యర్థులతో మరో జాబితా విడుదల చేసింది.
Updated Date - 2023-04-14T21:30:28+05:30 IST