Sunny Deol Bungalow Row: ఈ వేలంపై బ్యాంకు యూటర్న్
ABN, First Publish Date - 2023-08-21T12:37:42+05:30
గదర్-2 చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ దేవోల్ ఇప్పుడు మరో కారణంగా ప్రచారంలోకి వచ్చారు. ఇది కాస్తా రాజకీయరంగు కూడా పులుపుకుంది. ముంబైలోని జూహూ నివాసాన్ని వేలం వేయనున్నట్టు ఆదివారంనాడు ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ బరోడా అనూహ్యంగా 24 గంటలు కూడా తిరక్కుండానే వేలాన్ని ఉపసంహరించుకుంది.
ముంబై: గదర్-2 చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ దేవోల్ (Sunny deol) ఇప్పుడు మరో కారణంగా ప్రచారంలోకి వచ్చారు. ఇది కాస్తా రాజకీయరంగు కూడా పులుపుకుంది. ముంబైలోని జూహూ నివాసాన్ని వేలం (e-auction) వేయనున్నట్టు ఆదివారంనాడు ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) అనూహ్యంగా 24 గంటలు కూడా తిరక్కుండానే వేలాన్ని ఉపసంహరించుకుంది. దీంతో ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. అకస్మాత్తుగా ఎందుకు యూ-టర్న్ తీసుకోవాల్సి వచ్చిందంటూ ఆ పార్టీ నేత జైరామ్ రమేష్ నిలదీశారు.
''బ్యాంకుకు రూ.56 కోట్ల బకాయిపడటంతో ఆయన జుహూ నివాసాన్ని వేలం వేస్తు్న్నట్టు ఆదివారం సాయంత్రం అందరికీ తెలిసింది. అయితే 24 గంటలు కూడా తిరక్కుండానే సోమవారం ఉదయం సాంకేతిక కారణాలను ప్రస్తావిస్తూ వేలాన్ని బ్యాంకు ఉపసంహరించుకుంది. ఈ సాంకేతిక కారణాలను సృష్టించిందెవరు?'' అని జైరాం రమేష్ ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు.
వివాదం ఏమిటి?
నటుడు, బీజేపీ ఎంపీ (గురుదాస్‌పూర్) సన్నీడియోల్ రూ.56 కోట్ల రూపాయల మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడాకు బకాయి పడ్డాయి. అది చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను అటాచ్ చేసి ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు ఆగస్టు 25న జూహూ బంగ్లా వేలం వేస్తున్నట్టు బ్యాంకు ప్రకటించింది. టోనీ జుహూ ఏరియాలోని గాంధీగ్రామ్ రోడ్డులో ఉన్న సన్నీ విల్లా వేలానికి రిజర్వ్ ప్రైజ్‌ను రూ.51.43 కోట్లు ఫిక్స్ చేసింది. డిపాజిట్ మనీ రూ.5.41 కోట్లుగా నిర్ణయించింది.
బ్యాంకు రుణం కోసం డియోల్స్‌కు చెందిన సన్నీ విల్లాతో పాటు 599.44 చదరపుమీటర్ల సన్నీ సౌండ్స్ హౌసెస్ ఉన్న ప్రాపర్టీని గ్యారంటీగా చూపించగా, ఈ రుణానికి సన్నీ తండ్రి ధర్మేంద్ర గ్యారెంటర్‌గా ఉన్నట్టు వేలం నోటీసులు బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. వడ్డీ, జరిమానా సొమ్ముతో సహా రూ.55.99 కోట్లు బాకీ పడినట్టు తెలిపింది. 2002 SARFAESI చట్టం కింద వేలం జరక్కుండా చూసేందుకు బకాయిలు చెల్లించే అవకాశం ఇప్పటికీ డియోల్స్‌కు ఉందని కూడా బ్యాంకు ఆ టెండర్ నోటీసులో తెలిపింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ ఎంపీగా ఉన్న సన్నీ దోవోల్ తాజాగా 'గదర్-2' చిత్రం బాక్సీఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించింది. గత వారంలో విడుదలైన ఈ చిత్రం రూ.300 కోట్ల వరకూ గ్రాస్ రాబట్టింది.
Updated Date - 2023-08-21T12:37:42+05:30 IST