Hooch tragedy: బీహార్‌లో కల్తీ మద్యానికి ఇద్దరు బలి, కంటిచూపు కోల్పోయిన పలువురు
ABN, First Publish Date - 2023-09-24T17:36:56+05:30
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో మరోసారి మద్య కలకలం రేగింది. కల్తీ మద్యానికి ఇద్దరు బలికాగా, పలువురు కంటిచూపు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. ముజఫర్‌పూర్ జిల్లా కాజీ మొహమ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బీహార్: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్ (Bihar)లో మరోసారి కల్తీ మద్యం (spurious liquor) కలకలం రేగింది. కల్తీ మద్యానికి ఇద్దరు బలికాగా, పలువురు కంటిచూపు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. ముజఫర్‌పూర్ జిల్లా కాజీ మొహమ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పరారీలో ఉన్న కల్తీ మద్యం సరఫరాదారు భార్య, కుమార్తెను కస్టడీలోకి తీసుకున్నట్టు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవధేష్ దీక్షిత్ తెలిపారు.
కల్తీ మద్యం మృతుల ఘటనపై ఏఎస్‌పీ మాట్లాడుతూ, పొఖారియా పీర్ మెహల్లా, ఉమేష్ షా (55), పప్పురామ్ కల్తీ మద్యం తాగి మరణించినట్టు తమకు సమాచారం అందిందని చెప్పారు. వీరు మూడు రోజుల క్రితం క్రితం ఇంటికి తప్పతాగి వచ్చారని, వెంటనే జబ్బుపడటంతో వారిని ఆసుపత్రిలో చేర్చినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని కుటుంట సభ్యులు చెప్పినట్టు దీక్షిత్ వివరించారు. ఇదే ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర రామ్, రాజు రామ్ అనే ఇద్దరు వ్యక్తులు చూపుకోల్పోయినట్టు తెలిపారు. కల్తీ మద్యం అక్రమ వ్యాపారంలో ప్రమేయమున్న శివచంద్ర పాశ్వాన్ నుంచి మద్యం కొనుగోలు చేసినట్టు బాధితుడు ధర్మేంద్ర రామ్ చెప్పడంతో గాలింపు చర్యలు చేపట్టామని, పాశ్వాన్ భార్య, కుమార్తెను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు. బీహార్‌లో మద్యం అమ్మకాలు, వినియోగంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం 2016లో నిషేధం విధించింది.
Updated Date - 2023-09-24T17:36:56+05:30 IST