ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

LokSabha: అవిశ్వాసానికి ఓకే

ABN, First Publish Date - 2023-07-27T02:19:51+05:30

మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని 26 పార్టీల కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించారు. దీంతో.. త్వరలోనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు రంగం సిద్ధం కానుంది.

‘ఇండియా’ కూటమి తరఫున కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ నోటీసు

తీర్మానాన్ని అనుమతించిన స్పీకర్‌ ఓం బిర్లా

అవిశ్వాసంపై 10 రోజుల్లో చర్చకు చాన్స్‌

బీఆర్‌ఎస్‌ అవిశ్వాసం తిరస్కరణ

ఇండియా అవిశ్వాసానికి గులాబీ మద్దతు

మోదీ సర్కారుకు ఢోకా లేనట్లే..!

లోక్‌సభలో ఎన్‌డీయే బలం 331

బీజేపీకి సొంతంగా 301 మంది సభ్యులు

అవిశ్వాసాన్ని ఓడించేందుకు 272 చాలు

విపక్షాలకు ఉన్న బలం 142 మాత్రమే

తటస్థంగా బీజేడీ, బీఎస్పీ, టీడీపీ, మజ్లిస్‌

అవిశ్వాసంపై 2019లోనే మోదీ జోస్యం

ప్రస్తుతం ఆ వీడియో క్లిప్‌ వైరల్‌

ఐటీపీవో కాంప్లెక్స్‌లో మోదీ పూజలు

న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని 26 పార్టీల కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌(LokSabha Speaker ) ఆమోదించారు. దీంతో.. త్వరలోనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు రంగం సిద్ధం కానుంది. నిజానికి మోదీ సర్కారు(Modi Govt) పై అవిశ్వాసంలో గెలిచే బలం విపక్షాలకు లేకున్నా.. కేవలం మణిపూర్‌(Manipur) అంశంపై పార్లమెంట్‌ వేదికగా చర్చ జరిపేందుకు ‘ఇండియా’ కూటమి అవిశ్వాస అస్త్రాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. రాజ్యాంగంలోని 75వ అధికరణ, లోక్‌సభ నిబంధనల్లోని 198(1), 198(5) రూల్స్‌ కింద కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ఆ పార్టీ ఉప నేత గౌరవ్‌ గొగోయ్‌ బుధవారం ఉదయం 9.20 గంటలకు స్పీకర్‌ ఓం బిర్లాకు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులను అందజేశారు. దీనిపై ఇండియా కూటమికి చెందిన 50 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అదే సమయంలో.. బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా లోక్‌సభ నిబంధనల్లోని 198(బీ) కింద నోటీసు ఇచ్చారు.

రాజ్యాంగంలోని 75 అధికరణ ప్రకారం.. అవిశ్వాస నోటీసులపై 50 మందికి తగ్గకుండా లోక్‌సభ సభ్యుల సంతకాలుండాలి. బీఆర్‌ఎస్‌ నోటీసుపై కేవలం ఆరుగురు ఎంపీల సంతకాలు ఉండడంతో.. ఆ అవిశ్వాసాన్ని స్పీకర్‌ తిరస్కరించారు. మరోవైపు లోక్‌సభలో ఉదయం 10 గంటల్లోపు అవిశ్వాస నోటీసులు ఇస్తే.. స్పీకర్‌ కచ్చితంగా అదే రోజున నిర్ణయాన్ని ప్రకటించాలి. అంటే.. తీర్మానం ఆమోదించడం లేదా తిరస్కరించడం జరిగిపోవాలి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవ్వగానే.. మణిపూర్‌ ఘటనపై ప్రధాని ప్రకటన చేయాలంటూ విపక్షాల సభ్యులు పట్టుబట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. జీరో అవర్‌లో గౌరవ్‌ గొగోయ్‌ ఇచ్చిన నోటీసును స్పీకర్‌ చదివి, వినిపించారు. ‘‘మంత్రి మండలిపై ఈ సభ అవిశ్వాసం ప్రకటిస్తోంది. గౌరవ్‌ గొగోయ్‌ అందుకు నోటీసు ఇచ్చి, అనుమతి కోరారు’’ అని వివరించారు. అవిశ్వాస తీర్మానాన్ని సమర్థిస్తున్న సభ్యులు లేచి నిలబడాలని కోరారు. దీంతో.. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, డీఎంకే నేత బాలు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా సహా.. 100 మందికి పైగా ఎంపీలు నిలబడ్డారు. సంఖ్యాబలం ఉన్నందున తాను అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నట్లు ఓంబిర్లా ప్రకటించారు. ‘‘అన్ని పార్టీల నేతలతో చర్చించి, నిబంధనల ప్రకారం తీర్మానంపై ఎప్పుడు చర్చించాలో నిర్ణయిస్తాం. చర్చ తేదీ, సమయాన్ని ప్రకటిస్తాం’’ అని ఆయన వివరించారు. ఆ తర్వాత సభలో గందరగోళం కొనసాగుతుండగానే.. మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యులు మణిపూర్‌పై చర్చకు డిమాండ్‌ చేస్తూ.. వెల్‌లోకి దూసుకురావడంతో సభను గురువారానికి వాయిదా వేశారు.


10 రోజుల్లోగా చర్చ..! ఎవరి బలాలెంత..?

పది రోజుల్లోగానే అవిశ్వాసంపై చర్చకు తేదీ ఖరారయ్యే అవకాశాలున్నాయి. కాగా.. లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543 కాగా.. ప్రస్తుతం 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 537 మంది సభ్యుల్లో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే విపక్ష కూటమికి 272 మంది సభ్యుల బలం అవసరం ఉంటుంది. కానీ, ఎన్డీయే కూటమి(331 మంది సభ్యులు)కి అంతకు మించిన బలం ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక్క బీజేపీకే సొంతంగా 301 మంది సభ్యులున్నారు. ఇక విపక్ష కూటమి-- 26 పార్టీల ‘ఇండియా’కు 142 మంది సభ్యుల బలం ఉండగా.. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌(9 మంది సభ్యులు) కూడా మద్దతిస్తున్నారు.


మైక్‌ కట్‌.. అవమానమే: ఖర్గే

మణిపూర్‌ హింసపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలంటూ రాజ్యసభలో తాను మాట్లాడుతున్నప్పుడు మైక్‌ను కట్‌ చేయడంపై విపక్ష నేత, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మైక్‌ కట్‌ చేయడం నాకు అవమానమే. నా ఆత్మాభిమానాన్ని సవాలు చేయడమే. రాజ్యసభ చైర్మన్‌ అనుమతితో మాట్లాడుతున్నప్పటికీ.. మైక్‌ కట్‌ చేయడం ఏమిటి? ఇది నా హక్కులకు భంగం కలిగించడమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. విపక్ష సభ్యులు ఆయనకు మద్దతుగా నిలిచి, నినాదాలిచ్చారు. కాగా.. విపక్షాల విశ్వాసాన్ని చూరగొనాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఖర్గే లేఖ రాశారు. పార్లమెంట్‌లో మణిపూర్‌ హింసపై చర్చ జరిగేలా చూడాలని కోరారు. అటు ఇదే డిమాండ్‌తో విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేయడం గమనార్హం. మణిపూర్‌లో హింసకు నిరసనగా గురువారం నల్లరంగు దుస్తులతో పార్లమెంట్‌కు హాజరవ్వాలని విపక్ష సభ్యులు నిర్ణయించారు. మరోవైపు, మణిపూర్‌పై మోదీ మౌనం వీడాలని బిహార్‌ సీఎం నీతీశ్‌ అన్నారు.

2019లోనే మోదీ జోస్యం

విపక్షాలు 2023లో తనపై అవిశ్వాసానికి సిద్ధమవుతాయని, ఆ పక్షాలకు తన శుభాకాంక్షలంటూ ప్రధాని నరేంద్ర మోదీ నాలుగేళ్ల క్రితమే లోక్‌సభ వేదికగా జోస్యం చెప్పారు. 2019 ఫిబ్రవరి 7న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా మోదీ 2023లో విపక్షాలు తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘2018 మాదిరిగానే మా ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఓడిస్తుంది. సమర్పణ భావం(సేవాభావం)తో మేము ఇద్దరు ఎంపీల నుంచి ఈ స్థాయికి(301 మంది) వచ్చాం. అహంకార భావం ఉన్న వారి సంఖ్య 400 నుంచి 40కి పడిపోయింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. 2018లో మోదీ సర్కారుపై టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మోదీ సర్కారు అవిశ్వాస పరీక్షలో నెగ్గింది. తాజాగా అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో.. 2019లో మోదీ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-07-27T02:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising