G-20 Summit: జీ20 అధినేతల రాక నేడే
ABN, First Publish Date - 2023-09-08T02:39:13+05:30
భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న జి-20 సదస్సుకు శుక్రవారం వివిధ దేశాల అధినేతలు తరలిరానున్నారు. తొలుత బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్, జపాన్ ప్రధాని కిషిదా, సాయంత్రానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఢిల్లీ చేరుకుంటారు.
తొలుత సునాక్, కిషిదా, సాయంత్రానికి బైడెన్
సమావేశాలపై ఉత్సాహంగా బైడెన్
ఢిల్లీ రాగానే ప్రధాని మోదీతో చర్చలు
సదస్సులో పుతిన్‌కు సందేశమూ లేదు
సమావేశాలకు రాజధాని సర్వం సిద్ధం
డిన్నర్‌కు అదానీ, అంబానీకి ఆహ్వానం
మీ పలుకుబడి పెంచుకోండి
ఇండియా పట్ల ఉన్న
సానుకూలతను వాడుకోండి
పేరు మార్పుపై రాద్ధాంతమా?: చైనా
‘భారత్’ అభ్యర్థన వస్తే చూస్తాం: ఐరాస
న్యూఢిల్లీ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న జి-20 సదస్సుకు శుక్రవారం వివిధ దేశాల అధినేతలు తరలిరానున్నారు. తొలుత బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్, జపాన్ ప్రధాని కిషిదా, సాయంత్రానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఢిల్లీ చేరుకుంటారు. సదస్సులో ముఖ్యమైన కార్యక్రమాల పట్ల బైడెన్ ఉత్సుకతతో ఉన్నారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. సతీమణి జిల్ బైడెన్ కొవిడ్‌కు గురైన నేపథ్యంలో.. బైడెన్‌కు వరుసగా పరీక్షలు చేశారు. వాటిలో నెగెటివ్‌గా తేలిందని.. భారత పర్యటనకు అధ్యక్షుడు పూర్తిగా సిద్ధమయ్యారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ పియర్రి వివరించారు. గురువారం సాయంత్రం మరోసారి పరీక్ష ఉంటుందనితెలిపారు. కాగా, శుక్రవారం సాయంత్రం భారత్‌కు చేరుకునే బైడెన్.. ఆ వెంటనే ప్రధాని మోదీ(PM Modi)తో సమావేశంలో పాల్గొననున్నారు.
వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కో ఆర్డినేటర్ జాన్ కిర్బీ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవకాశాలు కల్పించడం, వాతావరణం నుంచి సాంకేతికత వరకు అమెరికన్ల కీలక ప్రాధాన్యతలపై పురోగతి, జి-20 కూటమి పట్ల అమెరికా నిబద్ధతను చాటేలా బైడెన్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. జి-20 సదస్సు(G-20 Summit)కు మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. జి-20 సమావేశాలకు ఢిల్లీ సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఆయా దేశాల అధినేతలు, ప్రతినిధులు చేరుకోనున్నారు. సదస్సుకు గైర్హాజరవుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. వీడియో సందేశాన్నీ విడుదల చేయబోవడం లేదు. విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారు. జి-20 సదస్సుకు బైడెన్ సహా పలు పశ్చిమ దేశాల అధినేతలు హాజరవుతున్నందున.. పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులోనూ లవ్రోవ్ రష్యా ప్రతినిధిగా పాల్గొన్నారు. చివర్లో పుతిన్ వీడియో సందేశం ఇచ్చారు. ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాల తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
జి20 సదస్సులో మాత్రం ఆయన ప్రమేయం ఉండడం లేదు. కాగా, సదస్సుకు హాజరవుతున్న విదేశీ నేతల్లో ముందుగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్‌కు చేరుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.40గంటలకు ఆయన రానున్నారు. 2.15కు జపాన్ ప్రధాని కిషిదా ఢిల్లీలో దిగుతారు. కాగా, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినిబు మంగళవారమే రాగా.. మారిషస్ అధ్యక్షుడు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు గురువారం చేరుకున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సాయంత్రం 7గంటలకు, చైనా ప్రధాని లీ కియాంగ్ రాత్రి 7.45గంటలకు దిగుతారు. అర్జెంటీనా, ఇటలీ, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జపాన్, సౌదీ అరేబియా, కొరియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, యూఏఈ, నెదర్లాండ్స్, బ్రెజిల్, ఇండోనేసియా, తుర్కియే, స్పెయిన్, సింగపూర్ దేశాధినేతలు, ఆఫ్రికన్ యూనియన్ ప్రతినిధులు శుక్రవారమే వస్తా రు. జర్మనీ చాన్స్‌లర్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ శనివారం హాజరవుతారు. వీరికి విమానాశ్రయంలో కేంద్ర సహాయ మంత్రులు స్వాగతం పలుకుతారు.
బైడెన్‌కు పటిష్ఠ భద్రత
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సాయంత్రం 6.55గంటలకు పాలెం విమానాశ్రయానికి రానున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ స్వాగతం పలుకుతారు. బైడెన్, అమెరికా ప్రతినిధి బృందం ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేయనుంది. అమెరికా అధ్యక్షుడితో సదస్సు సందర్భంగా.. శుద్ధ ఇంధనం, వాతావరణ మార్పులపై భారత ప్రధాని మోదీ చర్చించనున్నారు. బైడెన్ గురువారమే భారత్ బయల్దేరారు. ఆయనకు ఢిల్లీలో మూడంచెలతో కూడిన భద్రత కల్పించనున్నారు. అమెరికా అధ్యక్షుడి వాహనమైన కాడిలాక్ కారు ‘బీస్ట్’ను బోయింగ్ సి-17 గ్లోబ్ మాస్టర్3లో తీసుకురానున్నారు. కాగా, భార్య జిల్‌కు కొవిడ్ పాజిటివ్ రావడంతో బైడెన్ పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. రెండుసార్లు చేసిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో బైడెన్ ప్రయాణానికి మార్గం సుగమమైంది.
రేపటి డిన్నర్‌కు గౌతమ్ అదానీ!
జి20 దేశాధినేతల గౌరవార్థం శనివారం రాత్రి మోదీ ఇచ్చే విందుకు 500 మంది పారిశ్రామికవేత్తలకు భారత్ ఆహ్వానాలు పంపింది. వీరిలో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇం డస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సహా పలువురు పాల్గొననున్నారు.
సదస్సుకు ఒడిసా గిరిజన మహిళ
సాలూరు రూరల్, సెప్టెంబరు 7: జీ-20 దేశాల సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం ఒడిసా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో మారుమూల గ్రామం నౌగుడకి చెందిన గిరిజన మహిళా రైతు రైమతి ఘుయురియా (36)కు దక్కింది. ఇందుకోసం ఆమె గురువారం ఢిల్లీ చేరుకున్నారు. భారత్‌లో సాగవుతున్న చిరుధాన్యాలపై ఈనెల 9న ఆమె ప్రదర్శన ఇవ్వనున్నారు. సేంద్రియ పద్ధతుల్లో చిరుధాన్యాల సాగుపై వివరించనున్నారు. 72 రకాలకు పైగా సంప్రదాయ దేశీ విత్తనాలను రైమతి ఘుయురియా సంరక్షిస్తున్నారు. వాటిలో మినుము, రాగి, పెసలుతోపాటు చిరుధాన్యాల విత్తనాలు ఉన్నాయి. ఆమె కుటుంబంలో ముందు తరం సంరక్షించిన సంప్రదాయ విత్తనాలను ఆధునిక పద్ధతులు జోడించి జాగ్రత్త చేస్తున్నారు. గిరిజన రైతుల గ్రూపు ఏర్పాటు చేసి 2,500 మంది రైతులకు సేంద్రియ సాగు, దేశీయ వరి విత్తనాల తయారీ, వరుసల విధానంలో వరి, చిరుధాన్యాల సాగుపై ఆమె అవగాహన కల్పిస్తున్నారు.
Updated Date - 2023-09-08T05:29:00+05:30 IST