Same-sex marriage : స్వలింగ వివాహాలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-03-14T17:46:52+05:30
స్వలింగ వివాహాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Union law minister Kiren Rijiju)
న్యూఢిల్లీ : స్వలింగ వివాహాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Union law minister Kiren Rijiju) సమర్థించారు. వివాహ వ్యవస్థ మన దేశ ఆచార, సంప్రదాయాలు, సంస్కృతి, కట్టుబాట్లలో గాఢంగా ఉందని చెప్పారు. లోక్‌మత్ పార్లమెంటరీ అవార్డ్స్ (Lokmat Parliamentary Awards) కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడారు.
స్వలింగ వివాహాల (Same-sex marriage)కు చట్టపరమైన చెల్లుబాటు కల్పించాలని కోరుతూ కొందరు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరుపుతోంది. రాబోయే కాలంలో ముఖ్యమైన ప్రభావం చూపే అంశమని చెప్తూ, దీనిపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతుందని సోమవారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో, స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించాలనడాన్ని వ్యతిరేకించింది. స్వలింగ పెళ్లిళ్ల వల్ల విధ్వంసం, అరాచకం ఏర్పడతాయని తెలిపింది. వ్యక్తిగత చట్టాలు, ఆమోదిత సామాజిక విలువల మధ్య సున్నితమైన సమతుల్యత ఉండాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ, స్త్రీ, పురుషులు తమకు నచ్చిన విధంగా జీవించవచ్చునని తెలిపారు. అయితే పెళ్లి విషయానికి వచ్చినపుడు, అదొక వ్యవస్థ అని చెప్పారు. దీనికి వివిధ నిబంధనలు, చట్టాలు మార్గదర్శనం చేస్తాయన్నారు. వివాహ వ్యవస్థ మన దేశ ఆచార, సంప్రదాయాలు, సంస్కృతి, కట్టుబాట్లలో గాఢంగా ఉందని చెప్పారు.
ఎన్నికల కమిషనర్ల నియామకంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ గురించి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, పరిపాలన, న్యాయ వ్యవస్థల సమస్యలను గుర్తించి, వర్గీకరించవలసిన అవసరం ఉందన్నారు.
సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై ఇచ్చిన రూలింగ్‌లో, ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి కలిసి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయాలని చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పార్లమెంటు చట్టం వచ్చే వరకు ఈ విధానాన్ని పాటించాలని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : రాహుల్ గాంధీపై అధికార పక్షం ఆగ్రహం
Same-sex marriage : స్వలింగ వివాహాలపై బయటపడిన ఆరెస్సెస్ వైఖరి
Updated Date - 2023-03-14T17:46:52+05:30 IST