Raghav Chadha Bungalow row: బంగ్లా విషయంలో రాఘవ్ చద్దాకు ఎదురుదెబ్బ.. లీగల్ చర్యలకు సిద్ధమన్న ఎంపీ
ABN, First Publish Date - 2023-10-07T15:40:47+05:30
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను రద్దు చేసినందున ఆయనకు అందులో కొనసాగే హక్కు లేదని కోర్టు తీర్పునిచ్చింది. చద్దాకు ఇంతకు ముందు ఇచ్చిన తాత్కాలిక స్టేను కోర్టు ఎత్తివేసింది.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha)కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను రద్దు చేసినందున ఆయనకు అందులో కొనసాగే హక్కు లేదని కోర్టు తీర్పునిచ్చింది. చద్దాకు ఇంతకు ముందు ఇచ్చిన తాత్కాలిక స్టేను కోర్టు ఎత్తివేసింది. దీంతో చద్దాను బంగ్లా ఖాళీ చేయాల్సిందిగా రాజ్యసభ సెక్రటేరియట్ ఏ సమయంలోనైనా ఆయనను అడిగే అవకాశం ఉంది.
ఏకపక్షం, నిర్హేతుకం: రాఘవ్ చద్దా
కాగా, తనకు కేటాయించిన బంగ్లాను రద్దు చేయడం ఏకపక్షమని, నిర్హేతుకమని కోర్టు ఆదేశాల అనంతరం చద్దా వ్యాఖ్యానించారు. రాజకీయ ఉద్దేశాలు, స్వార్ధ ప్రయోజనాల కోసం బీజేపీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఇదంతా జరిగిందని ఆయన ఆరోపించారు. మొదటిసారి ఎంపీలుగా ఎన్నికైన పలువురు ఇప్పటికీ టైప్-7 అకాడమినేషన్‌లోనే ఉంటున్నారని, ఈ విషయంలో తాను లీగల్ చర్యలకు వెళ్లాలనుకుంటున్నారని చెప్పారు.
వివాదం ఏమిటి?
రాఘవ్ చద్దాకు గత ఏడాది టైప్-6 బంగ్లా కేటాయించారు. అయితే, దానికంటే పెద్ద బంగ్లా ఇవ్వాలని రాజ్యసభ చైర్మన్‌కు ఆయన విజ్ఞప్తి చేసుకోవడంతో టైప్-7 బంగ్లాను ఆయనకు గత ఏడాది సెప్టెంబర్‌లో కేటాయించారు. అయితే, గత మార్చిలో లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనకు కేటాయించిన బంగ్లాను రద్దు చేసింది. తొలిసారి ఎంపీలైన వారు ఆ తరహా గ్రేడ్ వసతికి అర్హులు కాదనే వాదన ముందుకు తీసుకువచ్చింది. సెంట్రల్ ఢిల్లీలోని పండారా రోడ్డులో ఉన్న బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఏప్రిల్ 18న ఆయనకు కోర్టు తాత్కాలిక స్టే మంజూరు చేసింది. అయితే, గత శుక్రవారంనాడు కోర్టు ఆ స్టేను ఎత్తివేస్తూ , బంగ్లాను ఆక్యూపై చేసుకుంటాననే హక్కు చద్దాకు లేదని తీర్పుచెప్పింది. రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం మొత్తం అదే బంగ్లాలో ఉంటానంటూ చెప్పడం, అదికూడా కేటాయింపు రద్దు చేసిన తర్వాత కూడా కొనసాగుతాననడం సరికాదని, ఆ హక్కు ఆయనకు లేదని స్పష్టం చేసింది. చద్దా చేసిన వాదనను తిరస్కరిస్తున్నట్టు తెలిపింది.
రాజ్యసభ హౌస్ కమిటీ గత జూన్‌లో తమ వాదన వినిపిస్తూ, తొలిసారి ఎంపిగా ఎన్నికైన వారి కంటే ఎక్కువ స్థాయి వారికే టైప్-7 బంగ్లా గ్రేడ్ కేటాయింపు ఉంటుందని, సహజంగా కేంద్ర మాజీ మంత్రులు, మాజీ గవర్నర్లు, మాజీ ముఖ్యమంత్రులకే ఈ గ్రేడ్ బంగ్లా కేటాయింపులు వర్తిస్తాయని తెలిపింది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ సైతం టైప్-7 బంగ్లా నుంచి టైప్-5 బంగ్లాకు వెళ్లారని ఉదహరించింది.
నోటీసులేవీ..?
అయితే, రాజకీయంగా విమర్శించే తనవంటి వ్యక్తులను బీజేపీ టార్గెట్ చేసుకుందని చద్దా తాజా పరిణామంపై విశ్లేషించారు. తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అధికారికంగా కేటాయించిన బంగ్లాను రద్దు చేశారని చెప్పారు. రాజ్యసభ 70 ఏళ్ల చరిత్రలో ఇదొక అసాధారణమైన ఘటన అని అన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ ఆదేశాల్లో నిబంధనల ఉల్లంఘన ఉందన్నారు. తన పొరుగున ఉన్న అనేక మంది తనకు కేటాయించిన అకామిడేషన్లలోనే కొనసాగుతున్నారని, బీజేపీకి చెదిన సువేంద్ర త్రివేది, బీఎస్‌పీ నేత డేనిష్ అలీ, రాకేష్ సిన్హా, మాజీ ఎంపీ రూపా గంగూలీ తదితరులు గతంలో తనకు కేటాయించిన తరహా బంగ్లాల్లోనే ఉన్నారని గుర్తు చేశారు. 240 మంది రాజ్యసభ ఎంపీల్లో అలాంటి వారు 119 మంది ఉన్నారని, అయితే అందరినీ కాకుండా ఇటు పార్లమెంటు లోపల, బయట తమను విమర్శిస్తున్న వారినే బీజేపీ టార్గెట్ చేసుకుందని చెప్పారు. విచారణ కోర్టు తొలుత తన విజ్ఞప్తిని పరిశీలించిన మీదటే తాత్కాలిక ఉపశమనం కల్పించిందని అన్నారు. ఇప్పుడు ఈ కేసును లీగల్ టెక్నికాలిటీ పేరుతో తోసిపుచ్చిందని, దీనిపై సరైన సమయంలో తాను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. ఏదిఏమైనా పంజాబ్ ప్రజలు, దేశ ప్రజల వాణిని తాను వినిపిస్తూనే ఉంటానని చెప్పారు.
Updated Date - 2023-10-07T15:41:17+05:30 IST