Uttarakhand: ఉత్తరాఖండ్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్, ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN, First Publish Date - 2023-05-25T12:07:01+05:30
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ను దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న తొలి సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీగురువారం జెండా ఊపిప్రారంభించారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని డెహ్రాడూన్(Dehradun)ను దేశ రాజధాని న్యూఢిల్లీ(New Delhi)తో కలుపుతున్న తొలి సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(Vande Bharat Express Train)ను ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) గురువారం జెండా ఊపి(Flagged Off) ప్రారంభించారు. వివిధ మార్గాల నుంచి ఢిల్లీని కలుపుతున్న ఆరవ వందే భారత్ రైలు ఇది. ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీకి అజ్మీర్, వారణాసి, కత్రా, భోపాల్, అంబ్ అందౌరాల ప్రాంతాలను కలుపుతూ వందేభారత్ రైళ్లతో అనుసంధానించారు. కాగా ఉత్తరాఖండ్ మొదటి వందే భారత్ సెమీహైస్పీడ్ రైలు భారతదేశంలో 18వది.
ఉత్తరాఖండ్ తొలి వందేభారత్ రైలు డెహ్రాడూన్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ వరకు మొదటి పరుగును ప్రారంభించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు స్వదేశీయంగా తయారు చేయబడింది. ఇందులో ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఉత్తరాఖండ్‌కు ప్రయాణించే పర్యాటకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాల కొత్త శకాన్ని తెలియజేస్తాయి. కవాచ్ టెక్నాలజీతో సహా అధునాతన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది.
ఢిల్లీ-డెహ్రాడూన్ 4 గంటల 45 నిమిషాల్లోనే ప్రయాణం
ఈనెల 29 నుంచి ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు సాధారణ కార్యకలాపాలు ప్రారంభ మవుతాయి. కేవలం 4 గంటల 45 నిమిషాల ప్రయాణ సమయంతో 302 కి.మీ. ప్రయాణించవచ్చు. బుధవారం మినహా వారంలోని అన్ని రోజులలో నడుస్తుంది. ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టిక్కెట్ ధర ఏసీ చైర్ కార్: రూ.1,065, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్: ₹ 1,890.
గత వారం ఒడిశా నుంచి తొలి వందే భారత్ ప్రారంభమైంది. పూరీ-హౌరా మధ్య నడుస్తుంది. హౌరా-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మే 18న ప్రధాని నరేంద్ర మోదీ పూరీ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. మే 20న వాణిజ్య సేవలను ప్రారంభించారు.
Updated Date - 2023-05-25T12:08:12+05:30 IST