Uttarkashi Tunnel: టన్నెల్ నుంచి బయటకొచ్చిన కార్మికులు.. ఆ తర్వాతేంటి? ఇంటికి ఎప్పుడు చేరుతారు?
ABN, First Publish Date - 2023-11-28T22:32:59+05:30
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికుల్ని బయటకు తీసేందుకు యుద్ధప్రాతిపదికన నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు 17వ రోజు విజయవంతమైంది. రెస్క్యూ అధికారులు సురక్షితంగా ఆ కార్మికులందరినీ..
Uttarkashi Tunnel Rescue: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికుల్ని బయటకు తీసేందుకు యుద్ధప్రాతిపదికన నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు 17వ రోజు విజయవంతమైంది. రెస్క్యూ అధికారులు సురక్షితంగా ఆ కార్మికులందరినీ బయటకు తీసుకొచ్చారు. కార్మికులన్న ప్రాంతం వరకు డ్రిల్లింగ్ చేపట్టి, అందులోకి గొట్టాన్ని పంపించి, దాని ద్వారా కూలీలను ఒక్కొక్కరిగా బయటకు తెచ్చారు. కార్మికులు బయటకు రాగానే.. 17 రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా గడిపిన వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు.. సంఘటనా స్థలంలోనే ఉన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కార్మికుల్ని కలుసుకొని, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
తర్వాత తీసుకోబోయే చర్యలేంటి?
17 రోజుల పాటు టన్నెల్‌లోనే కార్మికులు చిక్కుకున్నారు కాబట్టి.. బయటకొచ్చిన కార్మికులకు తక్షణ వైద్యం అందించడం కోసం టన్నెల్ లోపలే ఎనిమిది పడకలతో తాత్కాలిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో చెకప్ చేసిన తర్వాత కార్మికులను ఆసుపత్రికి తరలిస్తారు. కార్మికులు బయటకు రావడానికి ముందే టన్నెల్ వెలుపల కొన్ని అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్తారు. అక్కడ కార్మికుల కోసం ప్రత్యేకంగా 41 పడకల వార్డు సృష్టింరారు. హెల్త్ సెంటర్‌కు అంబులెన్స్ త్వరగా చేరుకునేందుకు గాను.. రహదారికి మరమ్మత్తులు చేయడం కూడా జరిగింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. రిషికేశ్ ఎయిమ్స్ కార్మికులకు వైద్య సేవల కోసం అలర్ట్ మోడ్‌లో ఉంది. ఇక్కడ ట్రామా సెంటర్‌తో సహా 41 పడకల వార్డు రెడీగా ఉన్నట్లు తెలిసింది. ట్రామా సర్జన్లు, గుండె, మానసిక వ్యాధుల నిపుణులతో సహా వైద్యుల బృందం కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికులను విమానంలో రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించనున్నారు. కార్మికులందరికీ చికిత్స అందించిన తర్వాత.. ఆరోగ్యం పరంగా ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించుకున్న అనంతరం ఇంటికి తరలించనున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ విషయంపై అధికారుల నుంచి ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
నవంబర్ 12న సొరంగంలో ప్రమాదం
ఇదిలావుండగా.. నవంబరు 12న సొరంగం పనులు చేస్తుండగా అనూహ్యంగా ఓ ఘటన చోటు చేసుకుంది. దాంతో.. సొరంగంలోని ఒక భాగం కూలిపోగా, 41 కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. రెండు కీలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ.. తాగునీరు, ఆహారం, ఔషధాలు వంటివన్నీ అందుకునే వెసులుబాటును కల్పించారు. వీరిని బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ఫైనల్‌గా ‘ర్యాట్ హోల్ మైనర్ల’తో మెరుపు వేగంతో తవ్వకాలు చేపట్టి.. కూలీలున్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించి.. అందులో నుంచి వారిని బయటకు తీసుకొచ్చారు.
Updated Date - 2023-11-28T22:33:01+05:30 IST