WHO Chief : కోవిడ్ కన్నా ప్రాణాంతక వ్యాధి రాబోతోంది : ప్రపంచ ఆరోగ్య సంస్థ
ABN, First Publish Date - 2023-05-24T18:07:35+05:30
మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని కబళించబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ కోవిడ్-19 మహమ్మారి పీడ విరగడ కాకముందే హెచ్చరించారు.
జెనీవా : మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని కబళించబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ (Dr Tedros Adhanom Ghebreyesus) కోవిడ్-19 మహమ్మారి పీడ విరగడ కాకముందే హెచ్చరించారు. కోవిడ్-19 (Covid-19) ఇక ఎంతోకాలం ఆరోగ్య అత్యవసర పరిస్థితికి సంబంధించిన వ్యాధి కాదని డబ్ల్యూహెచ్ఓ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
డాక్టర్ టెడ్రోస్ డబ్ల్యూహెచ్ఓ వార్షిక హెల్త్ అసెంబ్లీలో మాట్లాడుతూ, తదుపరి మహమ్మారిని నిరోధించేందుకు చర్చలు జరపవలసిన సమయం ఇది అని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి ఇంకా ముగిసిపోలేదన్నారు. మరొక వేరియంట్ ముప్పు రాబోతోందని హెచ్చరించారు. దీనివల్ల వ్యాధి ప్రబలుతుందని, మరణాలు సంభవిస్తాయని చెప్పారు. మరింత ప్రాణాంతక రోగకారకం ముప్పు ఉందన్నారు. తదుపరి ప్రపంచ వ్యాధి ప్రపంచం తలుపు తట్టబోతోందని హెచ్చరించారు. దీనిని దేశాల ప్రభుత్వాలు మట్టుబెట్టడం, చర్యలను వాయిదా వేయడం సాధ్యం కాదన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిందని, అప్పట్లో ప్రపంచం ఈ వ్యాధిని ఎదుర్కొనడానికి సంసిద్ధంగా లేదని చెప్పారు. శతాబ్దంలో అత్యంత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం ఇదేనని చెప్పారు. గడచిన మూడేళ్లలో దీనివల్ల ప్రపంచం తలక్రిందులైందన్నారు. దాదాపు 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కానీ మరణాల సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంటుందని, కనీసం రెండు కోట్ల మంది మరణించి ఉండవచ్చునని చెప్పారు. తప్పనిసరిగా చేయవలసిన మార్పులను మనం చేయకపోతే, ఎవరు చేస్తారన్నారు. ఆ మార్పులను మనం ఇప్పుడే చేయకపోతే, ఎప్పుడు చేస్తామని ప్రశ్నించారు. తదుపరి మహమ్మారి తలుపు తట్టినపుడు - అది తప్పకుండా వస్తుంది - దానికి సమాధానం చెప్పడానికి మనం నిర్ణయాత్మకంగా, సమష్టిగా, న్యాయంగా, నిష్పాక్షికంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ తరం నిబద్ధతతో వ్యవహరించడం ముఖ్యమని చెప్పారు. ఓ చిన్న వైరస్ ఎంత భయంకరమైనదో ఈ తరం అనుభవపూర్వకంగా తెలుసుకుందన్నారు.
ప్రజారోగ్యానికి అతి పెద్ద ముప్పు కలిగించగలిగే తొమ్మిది ముఖ్యమైన వ్యాధులను డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. ఇవి మహమ్మారిగా మారగలవని, వీటికి చికిత్స లేదని, అందువల్ల ఇవి అత్యంత విపత్కరమైనవని గుర్తించింది.
ఇవి కూడా చదవండి :
New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం
New Parliament Building : ప్రతిపక్షాలకు అమిత్ షా హితవు
Updated Date - 2023-05-24T18:07:35+05:30 IST