Amritpal Singh: 36 రోజుల వేట, ఎట్టకేలకు అరెస్టు...ఇంతకూ ఎవరీ అమృత్‌పాల్..?
ABN, First Publish Date - 2023-04-23T11:52:12+05:30
ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, 'వారిస్ పంజాద్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ను మోగా జిల్లాలో..
చండీగఢ్: ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, 'వారిస్ పంజాద్ దే' (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)ను మోగా జిల్లాలో పంజాబ్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. ఖలిస్థాన్ వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే సగ్రామమైన మోగాలో అరెస్టయిన అతన్ని బఠిండా వాయిసేన కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి అసోంలోని డిబ్రూగర్‌కు ప్రత్యేక విమానంలో తరలించనున్నారు. డిబ్రూగర్ జైలులోనే అతని అనుచరులు కూడా ఉన్నారు. మార్చి 18 నుంచి పోలీసులను తప్పించుకుని వివిధ మారువేషాల్లో తిరుగుతూ వచ్చిన అమృత్‌పాల్ సింగ్ ఆదివారంనాడు మోగా జిల్లాలోనిన రోడె గ్రామంలోని ఓ గురుద్వారాలో ప్రార్థనల చేసిన అనంతరం ఉదయం 7 గంటల సమయంలో లొంగిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ ఐజీ నేతృత్వంలోని పోలీసులు గురుద్వారా చేరుకుని అరెస్టు చేసి తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు. 36 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న అమృత్‌పాల్ పట్టుబడటంతో పంజాబ్‌లో ఎలాంటి ఉద్రిక్తతలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అమృత్‌సర్ సర్ణదేవాలయం, అమృత్‌పాల్ స్వగ్రామమైన జల్లపూర్ ఖేడాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి తప్పుడు సమాచారాన్ని షేర్ చేయవద్దని పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో కోరారు.
ఎవరీ అమృత్‌పాల్..?
-అమృత్‌పాల్ 1993 జనవరి 17న పంజాబ్‌లోని బాబా బకల టౌన్‌లో జనవరి 17న జన్మించాడు. చిన్నప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు సామాజిక ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకునే వాడు.
-దుబాయ్‌లో తన కుటుంబానికి చెందిన ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారంలో కొంతకాల పనిచేసి ఖలిస్థాన్ ఆర్గనేజేషన్ పగ్గాలు చేపట్టేందుకు ఇండియా వచ్చాడు.
-పంజాబ్ కేంద్రంగా ఉన్న 'వారిస్ పంజాబ్ దే'లో చీఫ్ దీప్ సిధు 2022 ఫిబ్రవరిలో మరణించడంతో ఆ సంస్థ రెండవ కీలక నేతగా ఎదిగాడు. అమృత్‌పాల్‌ను తమ సంస్థ నేతగా (చీఫ్) వారిస్ పంజాబ్ ప్రకటించింది.
-దుబాయ్‌లో పదేళ్లు గడిపి పంజాబ్ తిరిగిరాగానే 2022 సెప్టెంబర్ 29న అఫీషియల్ సెర్మనీ నిర్వహించారు.
-ఖలిస్థాన్ ఉద్యమాన్ని నడిపి ఆపరేషన్ బ్లూస్టార్‌లో ఆర్మీ చేతిలో హతమైన సిక్కు ఉగ్రవాద భింద్రన్‌వాలే పోలికల్లో ఉండేలా అమృత్‌పాల్ చూసుకునే వాడు. ఆయన సిద్ధాంతాలను అనుసరించే వాడు. దీంతో ఆయన 'బింద్రన్ వాలే 2.0' తరహాలో కనిపించే వాడు. రాజస్థాన్‌లోని గాంధీనగర్‌లో ఆయన తొలి అమృత్ ప్రీచర్ క్యాంపైన్ నిర్వహించారు. ఆయన చేపట్టిన 'ఘర్ వాప్సి' ప్రచారంతో 927 మంది సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు అమృత్ ఉత్సవంలో పాల్గొని ఖల్సా సిక్కులుగా మారారు.
-హర్యానా గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆయనకు సపోర్ట్‌గా నిలిచినట్టు చెబుతారు. అమృత్‌సర్‌లో అతిపెద్ద అమృత్ ప్రచార్‌ను ఆయన చేపట్టినప్పుడు ఖల్సా సిక్కులుగా మారేందుకు దేశవ్యాప్తంగా 1,027 మందికి పైగా సిక్కులు, హిందువులు ఇందులో పాల్గొన్నారు.
-దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి పట్టిన గతే హోం మంత్రి అమిత్‌షాకు పడుతుందని అమృత్‌సింగ్ గతంలో హెచ్చరించి వివాదంలో చిక్కారు.
-ఖలిస్థాన్ అనుకూల ప్రచారంతో ప్రజలను రెచ్చగొడుతున్నారనే కారణంగా ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పంజాబ్ పోలీసులు మార్చి 18న ప్రయత్నించగా, పోలీసుల కళ్లుగప్పి, తన అనుచరుల సాయంతో పరారయ్యాడు. దీంతో పంజాబ్‌తో పాటు అనుమానాస్పద ప్రదేశాల్లో అమృత్ పాల్, అతని అనుచరుల కోసం పోలీసు టీమ్‌లు కోసం జల్లెడ పట్టాయి. అమృత్‌పాల్ అనుచరులు పలువురుని అరెస్టు చేశారు.
-అమృత్ పాల్ ఆచూకీ కోసేం ఆయన వివిధ రూపాల్లో ఉన్న అతని ఫోటోలను పంజాబ్ పోలీసులు ఇటీవల విడుదల చేశారు. అందులో పొడవాడి గడ్డం, మరోచోట క్లీన్ షేవ్‌తో ఉన్న పోటో, పొట్టి జుట్టుతో ఉన్న ఫోటో, తలపాగా ధరించిన ఫోటో వంటివి ఉన్నాయి.
-అమృత్‌పాల్‌పై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ మోపారు.
Updated Date - 2023-04-23T11:52:12+05:30 IST