Nitish U-turn: ఎన్డీయే గూటికి చేరుతారంటూ జోరుగా ఊహాగానాలు..
ABN, First Publish Date - 2023-07-30T15:20:08+05:30
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరనున్నారా? అవుననే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఎన్డీయేలోకి నితీష్ రానున్నారంటూ కేంద్రం మంత్రి రామ్‌దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలను తాజాగా జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ బలపరిచారు.
రాంచీ: ప్రతిపక్ష కూటమి ఇండియా (INDIA) ఏర్పాటులో కీలక భూమిక పోషించిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ (JDU) నేత నితీష్ కుమార్ (Nitish Kumar) యూ-టర్న్ తీసుకోనున్నారా? తిరిగి ఎన్డీయే (NDA) గూటికి చేరనున్నారా? అవుననే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా నితీష్ తిరిగి ఎన్డీయేలో చేరవచ్చంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే (Ramdas Athawale) శనివారం సంచలన వ్యాఖ్యలు చేయగా, దానిని జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ (Raghubar Das) ఆదివారంనాడు బలపరిచారు.
''నితిష్ కుమార్ మొదట్నించీ ఎన్డీయే భాగస్వామిగా ఉన్నారు. ఆయన రామ్‌దాస్ అథవాలేతో మాట్లాడి ఉండవచ్చు. ఏదో విషయం చెప్పి ఉండవచ్చు'' అని రఘుబర్ దాస్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
అథవాలే ఏమన్నారు?
కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే పాట్నా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, నితీష్ ఏ క్షణంలోనైనా ఎన్డీయే (NDA)లో చేరుతారని, నితీష్ తమ వాడని అన్నారు. బీహార్‌లో నితీష్ చేసిన అభివృద్ధి పనులపైనా ప్రశంసలు కురిపించారు. ఎన్డీయేలో చేరడానికి నితీష్ ఇష్టపడతారా అని మంత్రిని మీడియా ప్రశ్నించగా, గతంలో ఆయన తమతోనే (బీజేపీ) ఉన్నారని, ఎప్పుడైనా ఆయన తమతో చేతులు కలపవచ్చని జవాబిచ్చారు. ముంబైలో జరుగనున్న విపక్ష కూటమి ఇండియా సమావేశానికి దూరంగా ఉండమని తాను నితీష్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. విపక్ష కూటమిలో చాలా మంది కన్వీనర్లు, ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారని, నితీష్‌కు అక్కడ తగిన చోటు ఉండదన్నారు. బెంగళూరు సమావేశంలో కూటమికి 'ఇండియా' పేరు ప్రకటించడంపై నితీష్ అసంతృప్తితో ఉన్నారంటూ మీడియాలో వచ్చిన ఊహాగానాలపై మాట్లాడుతూ, నితీష్ క్యాంప్ సంతోషంగా ఉన్నట్టు కనిపించడం లేదని అన్నారు. కాగా, పేరు విషయంలో ఎలాంటి అసంతృప్తులు లేవని, ఏకగ్రీవంగానే 'ఇండియా' పేరు నిర్ణయించారని మీడియా ఊహాగానాలను నితీష్ కుమార్ కొట్టివేశారు.
Updated Date - 2023-07-30T15:52:50+05:30 IST