Ayodhya : రామ భక్తులకు యోగి ఆదిత్యనాథ్ తీపి కబురు
ABN, First Publish Date - 2023-02-07T11:24:24+05:30
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలోని రామాలయానికి వెళ్లే మార్గాలను
లక్నో : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలోని రామాలయానికి వెళ్లే మార్గాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. రామజన్మ భూమిలోని రామాలయానికి వెళ్లే మూడు దారుల్లోని నివాస, వాణిజ్య భవనాలు ఏకరీతిగా ఉండేలా తీర్చిదిద్దబోతోంది. దీని కోసం 2023లో సుమారు రూ.32 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.
రామ్ పథ్, రామజన్మభూమి పథ్, భక్తిపథ్ మార్గాల్లోని ఇతర దేవాలయాలను, శ్రీరాముడి దేవాలయాన్ని సందర్శించే భక్తులు, ఇతరులు సరికొత్త అనుభూతిని పొందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్గాల్లోని వీథులన్నీ ఆకర్షణీయంగా కనిపించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అన్ని నివాస, వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాల భవనాలను రంగులు, మెటీరియల్స్, ఇతర విధాలుగా ఏకరీతిగా ఉండేలా తీర్చిదిద్దడం కోసం 2023లో సుమారు రూ.32 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.
అయోధ్య పట్టణంలో వీథుల స్వభావాన్ని తెలియజేసేవిధంగా వీథి దీపాలను ఏర్పాటు చేయాలని, ప్రకాశవంతమైన నామఫలకాలు (Vibrant Signage), దుకాణాల ముందు భాగాలు, ప్రహరీ గోడలు, కిటికీలు, స్తంభాలు, సింహద్వారాలు వంటివాటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది.
రామజన్మభూమి పథ్, భక్తి పథ్‌ల ప్రారంభాన్ని కలిపే మార్గం రామ్ పథ్. 13 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో ఇరువైపులా అనేక నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయి.
భక్తి పథ్‌లో తినుబండారాలు, మెమెంటోలు, పుస్తకాలు, పూజా సామాగ్రి దుకాణాలు ఉంటాయి. రామాలయం భక్తులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున భక్తుల తాకిడి ఉంటుంది. కాబట్టి ఈ మార్గాన్ని మరింత విస్తరిస్తున్నారు.
భక్తులు రామజన్మభూమి పథ్‌లో నడుస్తూ రామాలయానికి వెళ్తారు. ఈ మార్గంలోని అన్ని వీథులు కలిసే చోటు ఇదే. దీనిని కూడా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విస్తరిస్తున్నారు.
ఈ మూడు మార్గాల్లోని అన్ని భవనాల ముందు భాగాలు అయోధ్య ఇతివృత్తానికి అనుగుణంగా ఉండేలా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు లక్ష్యమని ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది.
Updated Date - 2023-02-07T11:24:28+05:30 IST