Aditi Nair: మూగజీవాలకు ఆతిథ్యం
ABN, First Publish Date - 2023-08-15T23:35:16+05:30
జంతు ప్రేమికులు తరచూ తారసపడుతూనే ఉంటారు. కానీ వాటి సంరక్షణ కోసం కెరీర్‌నే త్యాగం చేసినవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.
జంతు ప్రేమికులు తరచూ తారసపడుతూనే ఉంటారు. కానీ వాటి సంరక్షణ కోసం కెరీర్‌నే త్యాగం చేసినవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఆ అరుదైన వారిలో ఒకరు అదితి నాయర్. వీధి కుక్కలను అక్కున చేర్చుకొని... అవి హాయిగా జీవించడానికి తగిన వాతావరణం కల్పిస్తున్నారు. ఇప్పటికి నలభై వేలకు పైగా మూగజీవాలను సంరక్షించి... వాటి కోసమే పని చేస్తున్న అదితి అంతరంగం ఇది...
‘‘దాదాపు పదమూడేళ్ల కిందటి సంగతి... అవి నేను ముంబయిలో ఎంబీయే చదివే రోజులు. మా ప్రొఫెసర్, మెంటార్ డాక్టర్ కౌస్తుభ్ దర్గాల్కర్ ఎప్పుడూ నన్ను అడుగుతుండేవారు... ‘నీకు దేని మీద ఆసక్తి ఎక్కువ’ అని. నచ్చిన రంగంలోనే కెరీర్‌ను వెతుక్కోమని చెప్పేవారు. ఆయన అడిగినప్పుడు నిజంగా నాకు స్పష్టత లేదు. అయితే నాకు జంతువులంటే ఎంతో ఇష్టం. వాటి సంక్షేమం కోసం పని చేయాలని కలలు కనేదాన్ని. కానీ ఏ రూపంలో? దానికి సమాధానం వెతుక్కుంటూ... అదే ఏడాది దేశ పర్యటన మొదలుపెట్టాను. దానివల్ల వివిధ ప్రాంతాల్లోని జంతుజాలం పరిస్థితులు అర్థమవుతాయనీ అవగాహన పెరుగుతుందనీ అనిపించింది.
కేరళతో ఆరంభించి...
కేరళలో మొదలైంది నా ప్రయాణం. వివిధ ప్రాంతాలకు వెళుతూ... అక్కడి జంతు సంక్షేమ సంస్థలతో కలిసి వాలంటీర్‌గా పని చేశాను. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో పర్యటించాను. మరుసటి ఏడాది నాకు ‘టాటా జాగృతి యాత్ర’లో పాల్గొనమని ఆహ్వానం అందింది. పారిశ్రామిక రంగం వైపు రావాలనుకొనే యువతకు సహకారం అందించేందుకు ఉద్దేశించిన రైలు యాత్ర అది. మొత్తం ఎనిమిది వేల కిలోమీటర్లు ఆ రైలు చుట్టివచ్చింది. ఎక్కడికి వెళ్లినా అక్కడి జంతు ప్రేమికులు, కేంద్రాలను సంప్రతించాను. ఆ తరువాతే జంతు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే స్పష్టత వచ్చింది.
ఆ దృశ్యం కలచివేసింది...
మొదటగా వీధి కుక్కల కోసం ఆవాసాలు కల్పించాలని అనుకున్నాను. దానికి ప్రధాన కారణం... కేరళలో నేను చూసిన ఒక హృదయవిదారక దృశ్యం. అక్కడి స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నప్పుడు జరిగిందిది. పదిహేను రోజుల కుక్కపిల్లను ఎవరో మా ఎన్‌జీఓ గోడ అవతలి నుంచి లోపలికి విసిరేశారు. ఆ క్రమంలో దాని తల గోడకు తగిలి చూపు పోయింది. దానికి చికిత్స చేసి ఎన్జీఓలో ఆశ్రయం కల్పించాం. మూడు నెలల నా యాత్ర ముగిసిన తరువాత మళ్లీ ఆ ఎన్‌జీఓకు వెళ్లాను. ఆ కుక్కపిల్ల అక్కడ హాయిగా ఆడుకొంటోంది. అది చూసి ఎంతో సంతోషం కలిగింది. ఆ క్షణమే అనుకున్నాను... వీధుల్లోని కుక్కలకు షెల్టర్ ఏర్పాటు చేయాలని.
ఉద్యోగం వదిలి...
ఎంబీయేలో చేరేవరకు నా లక్ష్యం కూడా అందరిలా మంచి ఉద్యోగంలో స్థిరపడాలనేదే. దానికి ముందు 2007లో ముంబయిలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివాను. అది అవ్వగానే ఇన్ఫోసి్‌సలో ఏడాదిన్నర సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని. మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగం వదిలేసి ఎంబీయేలో చేరాను. ఇక అక్కడి నుంచి రొటీన్ జీవితానికి భిన్నంగా ఆలోచించడం మొదలైంది. ఎప్పుడైతే ఇటువైపు మనసు మళ్లిందో ఇక ఉద్యోగాలు వద్దనుకున్నాను. జంతు సంరక్షణకు సంబంధించి మరింత లోతైన అవగాహన కోసం ‘ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం’లో ‘ఇంటర్నేషనల్ యానిమల్ ఎథిక్స్ అండ్ లా’ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేశాను. ఇక అక్కడి నుంచి నా రూటే మారిపోయింది.
విస్తృత పరిశోధన...
నా దేశ పర్యటన ముగించుకుని తిరిగి ముంబయికి వచ్చాక జంతు సంక్షేమానికి సంబంధించి విస్తృత పరిశోధన చేశాను. అలాగే జంతు ప్రేమికులతో మాట్లాడాను. ఈ క్రమంలో నాకు తెలిసిందేమంటే... వీధుల్లో తిరిగే కుక్కలు, ఆవులు, పిల్లుల విషయంలో ఎవరూ శ్రద్ధ చూపడంలేదు. సరైన తిండి దొరక్క అవి ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. వాహనాలవల్ల తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. చెప్పుకొంటూ పోతే ఇలా ఎన్నో సమస్యలు. ఈ మూగజీవాల కోసం పని చేసే సంస్థలు చాలా అరుదు. ఎందుకంటే దానివల్ల వారికి లాభాలు ఉండవు. అదే నన్ను కలచివేసింది. అందుకే ముందుగా వీధికుక్కలకు నివాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాను.
నాలాంటివారే కొందరు...
ముంబయిలోని థానేలో మా నివాసం. అక్కడ నాలాంటి జంతు ప్రేమికులు అందరినీ ఒక చోటకు చేర్చాను. వారిలో వెటర్నరీ డాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్లందరి సహకారంతో వీధుల్లో తీరిగే జంతువులకు వీలైనన్ని షెల్టర్లు ఏర్పాటు చేశాం. ఆరంభంలో మూడు వేలకు పైగా వీధి కుక్కలకు ఆవాసం కల్పించాం. గాయపడిన వాటికి వైద్యం అందించాం. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ డ్రైవ్స్ కూడా నిర్వహించాం. 2010లో ఆరంభమైంది ఈ మిషన్. అయితే జంతువులను అవి తిరిగే ప్రాంతం నుంచి వేరేచోటకు తీసుకువెళ్లే క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. కొత్త ప్రదేశంలో త్వరగా కుదురుకోలేక ఇబ్బంది పడుతున్నట్టు గమనించాను. అందుకని మొబైల్ మెడికల్ యూనిట్స్ తీసుకువచ్చాను. ఇప్పుడు అవి ఉన్న ప్రాంతానికే వెళ్లి వైద్యం అందిస్తున్నాం.
ఒక వేదిక ఉండాలని...
నేను చేసే ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో 2014లో ‘మై పా క్లబ్’ నెలకొల్పాను. ఇది స్వచ్ఛంద సంస్థ. ఆసక్తి గల స్థానికులను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేస్తున్నాం. ప్రథమ చికిత్స, డైట్‌కు సంబంధించిన అంశాల్లో వారికి శిక్షణనిస్తున్నాం. మా సంస్థ ద్వారా నెలకు కనీసం వెయ్యి జంతువులకు ఆవాసం, వైద్యం తదితర సదుపాయాలు అందిస్తున్నాం. వీధి కుక్కలు, ఆవులు, పిల్లులు, పక్షులు, గాడిదలు కలిపి ఇప్పటికి నలభై వేలకు పైగా జంతువుల సంక్షేమానికి కృషి చేశాం. నా ఈ ప్రయాణంలో వ్యయప్రయాసలు, సవాళ్లు ఎన్నో. కానీ ఆ మూగజీవాలు చూపే ప్రేమ ముందు అవన్నీ నాకు చిన్నవే.’’
Updated Date - 2023-08-15T23:35:16+05:30 IST