ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tributes of movie and political celebrities : సినీ విభునికి కన్నీటి లాలి

ABN, First Publish Date - 2023-02-04T04:51:23+05:30

కళా తపస్వికి కన్నీటి వీడుకోలు ‘‘జాలిగా జాబిలమ్మ.. రేయి రేయంతా.. రెప్పవేయనే లేదు.. ఎందు చేత.. ఎందు చేత..? పదహారు కళలని పదిలంగా ఉంచనీ ఆ కృష్ణ పక్షమే... ఎదలో చిచ్చుపెట్టుట చేత..’’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు అంతిమ వీడ్కోలు

  • ప్రధాని మోదీ, రాహుల్‌, కేసీఆర్‌ సంతాపం

  • సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు

సినీజగత్తులో ఓ శకం ముగిసింది. నాట్యం, సంగీతం వంటి కళలను వెండి తెరతో సగటు మనిషికి చేరువ చేసిన కళాతపస్వి జీవన ప్రయాణం ముగిసింది. దర్శక దిగ్గజం కాశీనాథుని విశ్వనాథ్‌ (92) అంతిమ సంస్కారాలు హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశాన వాటికలో శుక్రవారం ముగిశాయి. సంప్రదాయం ప్రకారం కుటుంబసభ్యులు శాస్త్రోక్తంగా ఖననం చేశారు. విశ్వనాథ్‌ పెద్ద కుమారుడు నరేంద్ర చేతులమీదుగా కార్యక్రమం జరిగింది. ఫిలింనగర్‌ నుంచి శ్మశానవాటిక వరకూ జరిగిన అంతిమ యాత్రలో అభిమానులు దారిపొడవునా విశ్వనాథ్‌కు నివాళులర్పించారు. అంతకుముందు విశ్వనాథ్‌ పార్థివదేహాన్ని ప్రముఖుల సందర్శనార్థం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫిలింనగర్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, సినీ నటులు చంద్రమోహన్‌, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, వెంకటేశ్‌, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు విశ్వనాథ్‌ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

కంచికెళ్లి పోయేవే కథలన్నీ...!

కళా తపస్వికి కన్నీటి వీడుకోలు

‘‘జాలిగా జాబిలమ్మ.. రేయి రేయంతా..

రెప్పవేయనే లేదు.. ఎందు చేత.. ఎందు చేత..?

పదహారు కళలని పదిలంగా ఉంచనీ

ఆ కృష్ణ పక్షమే... ఎదలో చిచ్చుపెట్టుట చేత..’’

- ‘స్వాతి కిరణం’లోని ఓ పాట... ఇప్పుడు తెలుగు సినీ హృదయాల్లో ఆవేదనకు అచ్చంగా అద్దం పడుతోంది. పదహారణాల తెలుగుదనానికి పట్టం కట్టి, వెండి తెరకు కళాత్మక సేవ చేసిన ఘనుడు.. కళాతపస్వి... కె.విశ్వనాథ్‌ శాశ్వత నిద్రలోకి జారుకొన్నప్పటి నుంచీ - హృదయాలు బరువెక్కాయి. నయనాలు కన్నీటి ధారల్ని మోస్తున్నాయి. మనసు ఆ విశ్వనాథుడి జ్ఞాపకాల్లో పయనించి... ఆయన కళాతృష్టని మరోసారి గుర్తు చేసుకొని, కాస్తో కూస్తో ఊరట పొందుతున్నాయి.

ప్రతి ముగింపూ ఓ సరికొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది. విశ్వనాథుడి ప్రయాణమూ అంతే! ఆయన ప్రతి కథా మనల్ని మళ్లీ తట్టి లేపుతుంది. ప్రతీ పాటా.... ఆయన్ని మళ్లీ కొత్తగా పరిచయం చేస్తుంది. ప్రతీ పాత్రా.. మనతోనే ఉండిపోతుంది. కళకే కాదు.. కళాకారుడికీ మరణం ఉండదు. రాదు!

కళాతపస్వి కె. విశ్వనాథ్‌ అంతిమ సంస్కారాలు హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ఆయన అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. అర్ధరాత్రి తరువాత ఆయన పార్థివ దేహాన్ని ఫిలింనగర్‌లోని స్వగృహానికి తరలించారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, రాష్ట్ర సినీమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, వెంకటేష్‌, జీవితా రాజశేఖర్‌ దంపతులు, ఎస్‌.ఎస్‌ రాజమౌళి, ఎంఎం కీరవాణి, బ్రహ్మానందం, త్రివిక్రమ్‌, రాధిక, మురళీమోహన్‌, బోయపాటి శ్రీనివాస్‌, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, సుదర్శన్‌, శివపార్వతి, చంద్రమోహన్‌, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, ఆర్‌ నారాయణమూర్తి, గుణశేఖర్‌, కోట శ్రీనివాసరావు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నటుడు చంద్రమోహన్‌ మరికొంత మంది సీనియర్‌ నటులు విశ్వనాథ్‌ భౌతిక కాయాన్నిచూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఫిలింనగర్‌ నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర మొదలైంది. ఆయన అభిమానుల రోడ్డు కిరువైపులా నిలబడి నివాళులర్పించారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో అంతిమ వీడ్కోలు పలికిన అనంతరం ఖననం చేశారు.

ఆ ‘విశ్వ’విద్యాలయంలో విద్యార్థులెందరో!

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సినీ జగత్తుకు ఎందరెందరో కళామతల్లి ముద్దుబిడ్డలను పరిచయం చేశారు. ఆయన సినిమాల్లో నటించాకే.. ప్రేక్షకులకు పరిచయం అయినవారు కొందరైతే.. అప్పటికే సినీరంగంతో పరిచయం ఉన్నా.. కళాతపస్వితో పనిచేశాక గుర్తింపు పొందినవారు మరికొందరు. కొందరికి.. విశ్వనాథ్‌ చిత్రాల్లో నటించాక.. ఆ సినిమా పేర్లే ఇంటిపేర్లుగా మారాయి. ఈ కోవలో తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకువచ్చే పేరు సీతారామశాస్త్రి. ఆయన తొలి సినిమా ‘సిరివెన్నెల’ను ఇంటిపేరుగా కలిపి చెబితేనే సీతారామశాస్త్రి ఎవరో తెలుస్తుందంటే.. విశ్వనాథ్‌ చిత్రం ఆయన కెరీర్‌పై ఎంతటి ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు. శంకరాభరణం సినిమాతో నటుడు జేవీ సోమయాజులు పరిచయం అయ్యారు. ఆయనకు కూడా శంకరాభరణం శంకరశాస్త్రి అనేది ఇంటిపేరుగా మారిపోయింది. వంశీని సినీజగత్తుకు అందించినది.. ‘సూత్రధారులు’ ద్వారా నటి రమ్యకృష్ణను వెలుగులోకి తీసుకొచ్చింది కూడా విశ్వనాథుడే..! అప్పటికే కొన్ని సినిమాలు చేసిన వేటూరి సుందర రామమూర్తి.. విశ్వనాథ్‌ ‘ఓ సీతకథ’ తర్వాతే ఓ వెలుగు వెలిగారు. నటుడు చంద్రమోహన్‌కు సిరిసిరిమువ్వ చిత్రంతో మంచి పేరు వచ్చింది. ఆ చిత్రంతో జయప్రదలోని నర్తకి కోణాన్ని ఉత్తరాది కూడా కీర్తించింది. కమల్‌హాసన్‌లోని నవరసభరిత నటనాశక్తిని వెలుగులోకి తెచ్చింది ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’ కావడం గమనార్హం..! శుభలేఖ సుధాకర్‌కి కూడా.. విశ్వనాథ్‌ సినిమా పేరే ఇంటిపేరైంది. ఇలా విశ్వనాథుని బడిలో విద్యార్థులెందరో..!

తండ్రితనం చూపేవారు...

విశ్వనాథ్‌ గారితో ‘ఆపద్భాందవుడు’ చేసేటప్పుడు ఆయన్ని సంతృప్తిపరిచాలనేది నా ప్రధాన లక్ష్యం. నా పంథాను వదలి ఆయన అనుకున్న విధంగా చేయడానికి నా పూర్తి శక్తిని వెచ్చించేవాణ్ణి. ఆయన అంత తేలిగ్గా శాటి్‌సఫై కాలేదు. ఆయన ఒక మంచి నటుడు. ‘స్వయంకృషి’లో కోర్టు సీన్‌లో శభాష్‌ అన్నారు. అలాగే చెప్పులు కుట్టే వ్యక్తి పాత్రను సహజంగా చేయడం, ఆపద్భాందవుడులో సైకత శివలింగాన్ని నిందాస్తుతి చేస్తున్నప్పుడు, ఎలక్ట్రిక్‌ షాక్‌తో నత్తిగా మాట్లాడే సన్నివేశంలో ఆయన్ను పూర్తిగా శాటి్‌సఫై చేయగలిగాను. ‘ఏం చేశావయ్యా’ అంటారు ఇప్పటికీ. విజయశాంతి ఏడుస్తోందని తెలిసి కర్చీఫ్‌ తీసి ఇచ్చే సన్నివేశంలో ఎంత కంపోజ్‌డ్‌గా ఉన్నావు. బడబాగ్నిని లోపల పెట్టుకొని, తరచి చూస్తే కనిపించేలా అద్భుతంగా చేశావయ్యా అని అన్నారు. శివుణ్ణి తిట్టినప్పుడు నీలో ఆ ఫీలింగ్‌ లేకపోతే సీన్‌ అంత బాగారాదు అన్నారు. ‘అంతా మీ దగ్గరే నేరుకున్నా గురువు గారు’ అనే వాణ్ణి. కొన్నిసార్లు అన్నం తినకుండా షూటింగ్‌ చేసేవాణ్ణి. ‘అన్నం తినకుండా చేస్తే నాకు మాత్రం ఏం బావుంటుంద’ని ఏడిద నాగేశ్వరరావు అనేవారు. ‘నేను అన్నం కలిపిపెట్టాను అని చెప్పు.. తింటాడ’ని అనేవారు. తింటే తప్ప షాట్‌కు రావొద్దని విశ్వనాథ్‌ గారు అన్నారని చెప్పేవారు. అలా ఆయన తండ్రితనం చూపేవారు. అందుకే ఎప్పుడూ ఆయన దగ్గరకు వెళ్తాను, కూర్చుంటాను, మాట్లాడతాను.

- చిరంజీవి

హైదరాబాద్‌కు మారారిలా..!

సినీరంగంలోకి ప్రవేశించాక కె.విశ్వనాథ్‌ మద్రా్‌స(ప్రస్తుతం చెన్నై)లో ఉండేవారు. ‘ఆత్మగౌరవం’ సినిమాకు డైరెక్టర్‌గా అవకాశం వచ్చాక.. హైదరాబాద్‌ మారాలంటూ నిర్మాత దుక్కిపాటి పట్టుబట్టడంతో కుటుంబ సమేతంగా ఇక్కడకు చేరుకున్నారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలోని గగన్‌మహల్‌లో ఒకట్రెండేళ్లు ఓ చిన్న ఇంట్లో అద్దెకు దిగారు. అలా.. ఆత్మగౌరవం సినిమాను పూర్తిచేశారు. అప్పట్లో ఆలిండియా రేడియో హైదరాబాద్‌ కేంద్రంలో పనిచేసే గొల్లపూడి మారుతీరావు కథారచన చెసిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. అప్పట్లో ఈ చిత్ర బృందం పబ్లిక్‌గార్డెన్స్‌లోని చెట్ల నీడలో, పచ్చికబయళ్లపై కూర్చుని, కథపై చర్చలు, ఆలోచనలు సాగించారు.

తొలిషాట్‌ అద్దం మీద ఎందుకు?

కె. విశ్వనాథ్‌ తొలి చిత్రం ‘ఆత్మగౌరవం’ తొలిషాట్‌ అద్దంపై ఉంటుంది. దీని వెనక కూడా ఓ పెద్ద కథే ఉంది. సంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన విశ్వనాథ్‌ పరమ దైవభక్తుడు. నిర్మాత దుక్కిపాటి పరమ నాస్తికుడు. దేవుడి చిత్రపటంపై మొదటిషాట్‌ తీసి.. సినిమా షూటింగ్‌ను ఆరంభించడం సెంటిమెంట్‌. కానీ, అలా చేస్తే దుక్కిపాటి అంగీకరిస్తారా? అంటూ విశ్వనాథ్‌ సతమతమయ్యారు. హిందువులు అద్దాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. అలా సారథి స్టూడియోలో తొలిషాట్‌ను అద్దంపై తీశారు. అలా జూమ్‌ఔట్‌ చేస్తూ.. ఆ అద్దంలో అక్కినేని నాగేశ్వరరావు ప్రతిబింబం ఫ్రేమ్‌లోకి వచ్చేలా తొలిషాట్‌ను చిత్రీకరించారు. చాకచక్యంగా అప్పటికప్పుడు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇటు విశ్వనాథ్‌.. అటు దుక్కిపాటి సెంటిమెంట్లు నిలబడ్డాయి.

పాటలకు పల్లవులు అందించి..

కళాతపస్వి విశ్వనాథ్‌లో నిగూఢంగా ఓ అద్భుత సినీ గీత రచయిత ఉన్నారు. అయితే.. ఆ రచన పల్లవులకే పరిమితమైంది. గీత రచయితలకు పాటల విషయంలో ఆయన ఇన్‌పుట్స్‌ ఇచ్చేవారు. ‘ఆత్మగౌరవం’లో ‘మా రాజులొచ్చారు..’, ‘అందెను నేడే..’ పాటల పల్లవులు విశ్వనాథ్‌ రాసినవే. ఆ పదాలకు మరింత సొబగులద్దిన రచయితలు మిగతా పాటలను పూర్తిచేశారు. ‘ఆత్మగౌరవం’ మొదలు.. ‘శుభప్రదం’ దాకా ఆయన ఇలా తన చిత్రాల్లో ఎన్నో పాటలకు పల్లవులు అందించారు.

Updated Date - 2023-02-04T06:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising