Lady's fingers: మామిడి, ములక్కాడ, క్యారెట్‌లతో నాన్‌వెజ్ వండటం మామూలే... మరి బెండకాయలతో వండితే...
ABN, First Publish Date - 2023-07-14T22:56:45+05:30
మామిడికాయ, ములక్కాడ, క్యారెట్‌లతో నాన్‌వెజ్‌ను కలిపి వండటం మామూలే. అయితే బెండకాయలతో కోడిగుడ్డు ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ కర్రీలను సులువుగా వండుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది.
వంటిల్లు
మామిడికాయ, ములక్కాడ, క్యారెట్‌లతో నాన్‌వెజ్‌ను కలిపి వండటం మామూలే. అయితే బెండకాయలతో కోడిగుడ్డు ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ కర్రీలను సులువుగా వండుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది.
నాన్‌వెజ్‌తో దోస్తీ
బెండీ చికెన్ కర్రీ
కావాల్సిన పదార్థాలు
చికెన్- అరకేజీ, లేత బెండకాయలు- పావు కేజీ, నూనె- మూడు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు- 2 (సన్నగా తరగాలి), జీలకర్ర- అరటీస్పూన్, మిరియాలు- పది, దాల్చిన చెక్క ముక్క- 1, లవంగాలు-2, యాలకులు- 2, అల్లం వెల్లుల్లి పేస్ట్- టేబుల్ స్పూన్, పసుపు- చిటికెడు, కారం పొడి- అరటీస్పూన్, ధనియాల పొడి- టేబుల్ స్పూన్, ఉప్పు- తగినంత, గరం మసాలా పౌడర్- టేబుల్ స్పూన్, పెరుగు- 250 గ్రాములు, కొత్తిమీర- టేబుల్ స్పూన్,
తయారీ విధానం
ప్యాన్‌లో నూనె వేసిన తర్వాత కాస్త వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు కలిపాక పసుపు వేసి కలపాలి. ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత గరం మసాలా పౌడర్, పెరుగు వేసి మిక్స్ చేయాలి. మూతపెట్టి పది నిముషాలు మంటను సిమ్‌లో ఉంచాలి. మూత తీసిన తర్వాత గ్లాసు నీళ్లు పోసి మళ్లీ మూత పెట్టి ఇరవై నిముషాల పాటు కుక్ చేయాలి. ఆ తర్వాత బెండకాయలు వేసి కలిపిన తర్వాత ప్యాన్‌పై మూత పెట్టి పది నిముషాలు ఉడికించాలి. చివరలో కొత్తిమీర వేశాక సిమ్‌లో మరో ఐదు నిముషాలు ఉడికించాలి. భెండీ చికెన్ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది.
బెండకాయ మటన్ పులుసు
కావాల్సిన పదార్థాలు
లేత బెండకాయ ముక్కలు- కప్పు, నూనె- అరటేబుల్ స్పూన్, ఉల్లిపాయలు- 2 (సన్నగా తరగాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీస్పూన్, టమోటాలు- కప్పు, ధనియాల పొడి- అరటీస్పూన్, ఉప్పు- తగినంత, గరం మసాలా పొడి- అరటీస్పూన్, కారం- అర టీస్పూన్, దాల్చిన చెక్క- 2, లవంగాలు-3, యాలకులు- 3, ఉడికించిన మటన్- కప్పు
తయారీ విధానం
ప్యాన్‌లో నూనె వేసి అడుగులో పరచుకునేట్లు ప్యాన్‌ను కదపాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. టమోటా ముక్కలు, ఉప్పు వేసిన తర్వాత గరిటెతో కొద్దిసేపు కదిపాక బెండకాయ ముక్కలను వేసి కదిపిన తర్వాత కారం, ధనియాల పొడి వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఉడికించిన మటన్ వేసి కలిపిన తర్వాత గరం మసాలా వేసి కాసేపు గరిటెతో కదిపి గ్లాసు నీళ్లు పోసి ప్యాన్ మూత ఉంచి ఇరవై నిముషాల పాటు ఉడికించాలి. మటన్ మెత్తగా అయి గుజ్జు బాగా పడుతుంది. ఈ బెండకాయ మటన్ పులుసు రుచి.. అదిరిపోతుంది!
బెండకాయ ఎగ్‌ఫ్రై
కావాల్సిన పదార్థాలు
సన్నగా కట్‌చేసిన లేత బెండకాయ ముక్కలు- కప్పు, కోడిగుడ్లు-3, నూనె- 2 టేబుల్ స్పూన్లు. ఉల్లిపాయలు- 2 (సన్నగా తరగాలి), ఆవాలు- టేబుల్ స్పూన్, జీలకర్ర- టేబుల్ స్పూన్, కరివేపాకు- 20 ఆకులు, పచ్చిమిర్చి- 3 (సన్నగా తరగాలి), టమోటాలు- 2 (పేస్ట్ చేసుకోవాలి), ఉప్పు- తగినంత, గరం మసాలా- టీస్పూన్, ధనియాల పొడి- ఒకటిన్నర టీస్పూన్, మిరియాల పొడి- టీస్పూన్
తయారీ విధానం
ప్యాన్‌లో టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలపాటు వాటిని కలియబెడుతూ ఉండాలి. నూనె అంతా బెండకాయలకు పట్టుకుంటుంది. వేగుతాయి. వీటిని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మరో టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసిన తర్వాత గరిటెతో నిముషం పాటు కలిపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కదపాలి. కొద్దిగా ఉప్పు వేశాక.. కదుపుతూ ఉండాలి. కొద్దిసేపటి తర్వాత ఉల్లిపాయల రంగు మారుతుంది. వెంటనే టమోటా పేస్ట్ వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ప్యాన్‌మీద మూత ఉంచి నాలుగు నిముషాల పాటు కుక్ చేయాలి. మూత తీసిన వెంటనే కోడిగుడ్లు సొన కొంచెం కొంచెం వేస్తూ వేగంగా గరిటెతో కలియదిప్పుతూ ఉండాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రైచేసిన బెండకాయ ముక్కల్ని ఇందులో వేయాలి. చివరలో ధనియాలపొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. చివరలో అవసరం అనుకుంటే కాస్త కొబ్బరి తురుము వేసి కలిపిన తర్వాత దించేసుకోవాలి. ఈ బెండకాయ ఎగ్‌ఫ్రై చపాతితో లేదంటే అన్నంతో కూడా తినొచ్చు.
Updated Date - 2023-07-15T12:14:10+05:30 IST