బద్ధకానికి బై చెప్పండిలా...
ABN, First Publish Date - 2023-11-19T11:36:36+05:30
బద్ధకం... ఎప్పుడో ఒకప్పుడు దీని బారిన పడనివారు బహుశా ఉండరేమో. బద్ధకాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని చాలామంది అనుకుంటారు....
బద్ధకం... ఎప్పుడో ఒకప్పుడు దీని బారిన పడనివారు బహుశా ఉండరేమో. బద్ధకాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ బద్ధకం వల్ల ఆ పని చేయలేకపోతారు. దాన్ని వదిలించుకునేందుకు జపనీయులు ఎంతో పరిశోధించి, విజయవంతంగా ఆరు టెక్నిక్‌లను కనిపెట్టారు. వాళ్ల తాత్విక సంస్కృతిలో పెద్ద పీట వేశారు. వాటిని పాటిస్తే బద్ధకం భయపడి పారిపోతుందంటున్నారు. అవేమిటంటే...
ఇకిగయి
ప్రతి జీవికి ఓ జీవన ప్రయోజనం ఉంటుందని జపనీయులు నమ్ముతారు. దీన్నే వాళ్లు ‘ఇకిగయి’గా పేర్కొంటారు. నీ లక్ష్యం ఏమిటి? ఏమి సాధించాలని అనుకుంటున్నావు? ఏ పని నీలో చైతన్యాన్ని రగిలిస్తుంది? ఏమి చేస్తే సంతృప్తిగా ఉంటుంది?... ఈ సత్యాలను అన్వేషిస్తే జీవిత రూపురేఖలే మారతాయి.
కైజన్
ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా మెరుగుపరచుకుంటూ పనులు చేస్తే విజయాన్ని సాధించవచ్చని చెప్పే సిద్ధాంతమే కైజన్. రోజూ కొంచెం, కొంచెం కాబట్టి పెద్దగా భారమని కూడా అనిపించదు. క్రమంగా సామర్థ్యమూ పెరుగుతుంది.
పోమోదోరో టెక్నిక్
ఏ పనినైనా ఒకేసారి కాకుండా కాస్త విరామం ఇస్తూ చేయడమే ఈ సిద్ధాంతం. ప్రతి 25 నిమిషాల పనికి ఓ అయిదు నిమిషాలు బ్రేక్ తీసుకోమని చెబుతారు. దీని వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. తీవ్ర తలనొప్పులూ ఉండవు.
హర హాచి బూ
మైండ్‌ఫుల్ ఈటింగ్‌కు చక్కని ఉదాహరణ. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... ఏదైనా సరే పొట్ట 80 శాతం నిండగానే ఆపేయడం ఈ టెక్నిక్ ముఖ్యోద్దేశం. భుక్తాయాసంతో బాధపడకుండా కాస్త తక్కువ తిని రోజంతా ఉత్సాహంగా ఉండమని చెబుతుంది.
షోషిన్
స్థాయి, హోదా, ఉద్యోగం ఏదైనా సరే... ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు ఓ విద్యార్థిలా మొదలుపెట్టాలి. దీనివల్ల తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఉత్సాహం మీలో తెలియని చురుకుదనాన్ని తీసుకువస్తుంది.
వాబి సాబి
వందశాతం సంపూర్ణత అసాధ్యం. ఇది సత్యం అని నమ్మితే పని చేసేప్పుడు భయం, ఆందోళన, ఒత్తిడి దూరమవుతాయి. తప్పు అయినా పర్వాలేదు చేద్దాం అనుకోవాలి. దీని వల్ల ఫలితం ఏమవుతుందనే ఆందోళన లేని, ఆరోగ్యకరమైన మానసికస్థితి ఏర్పడుతుంది.
Updated Date - 2023-11-19T11:36:37+05:30 IST