NRI: లండన్‌లో గతేడాది భారత సంతతి యువతి హత్య.. చంపింది తానేనని తాజాగా అంగీకరించిన బాయ్‌ఫ్రెండ్
ABN, First Publish Date - 2023-07-02T21:23:34+05:30
లండన్‌లో గతేడాది జరిగిన భారత సంతతి యువతి హత్య కేసులో దోషిని తానేనని ఆమె బాయ్‌ఫ్రెండ్ తాజాగా అంగీకరించాడు.
ఎన్నారై డెస్క్: లండన్‌లో(London) గతేడాది జరిగిన భారత సంతతి యువతి హత్య కేసులో(Indian Origin teen murder) దోషి తానేనని ఆమె బాయ్‌ఫ్రెండ్ తాజాగా అంగీకరించాడు. నగరంలోని ఓల్డ్ బెయిలో కోర్టులో శుక్రవారం విచారణ జరగ్గా నిందితుడిని తానేనని మహెర్ మారూఫ్(23) అంగీకరించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గతేడాది మార్చి 19న భారత సంతతికి చెందిన సబితా తన్వానీ(19) దారుణ హత్యకు గురైంది. సబిత ఉంటున్న హాస్టల్ గదిలోనే ఆమె మృతదేహాన్ని గుర్తించారు. యువతి గొంతుకపై పదునైన వస్తువుతో చేసిన గాయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ గాయం కారణంగానే ఆమె మరణించినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తెలిసింది.
అంతకుమునుపు.. ఆమె తన గదిలో ఎవరితోనూ గొడవపడుతున్నట్టు పక్క గదిలోని వ్యక్తికి వినిపించడంతో పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో వారు హాస్టల్ గదికి రాగా, యువతి విగతజీవిగా కనిపించింది. పోలీసులు అక్కడికి చేరుకునే క్రమంలో నిందితుడు వారికి ఎదురుపడ్డాడు. ఆ సమయంలో అతడు ముఖం కనిపించకుండా ముసుగు ధరించాడు. ఆ తరువాత నిందితుడి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టి రోజుల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈ వారం కోర్టు విచారణకు నిందితుడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యాడు. గర్ల్‌ఫ్రెండ్‌ను తానే హత్య చేసినట్టు న్యాయమూర్తి ముందు అంగీకరించాడు. కాగా, సబిత మరణంతో ఆమె కుటుంబం తీవ్ర విచారంలో కూరుకుపోయింది. ఆమె ఓ దేవకన్య అని, ముఖంపై గొప్ప చిరునవ్వు, మరింత గొప్ప మనసు ఆమె సొంతమని కోర్టు తీర్పు సందర్భంగా సబిత కుటుంబసభ్యుులు మీడియాతో వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-07-02T21:29:16+05:30 IST