ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amritpal Singh: ఈ ‘భింద్రాన్‌వాలే’ ఎలా రూపొందాడు?

ABN, First Publish Date - 2023-03-22T07:45:20+05:30

దుబాయి రాక ముందు అమృత పాల్ ఒక సాధారణ భారతీయుడు మాత్రమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దుబాయి రాక ముందు అమృత పాల్ ఒక సాధారణ భారతీయుడు మాత్రమే. స్వీయ మతాచారాలను కనీసంగా కూడా పాటించని వ్యక్తి. అయినా కరుడుగట్టిన మతోన్మాదిగా మారిపోయాడు! పెరిగిపోతున్న సామాజిక మాధ్యమాల వినియోగం దేశాల హద్దులను చెరిపివేస్తూ మనుషులను సన్నిహితులను చేస్తోంది. అంతకంటే వేగంగా విద్వేషం, మతచాంధసవాదాన్ని కూడ అవి పెంచి పోషిస్తున్నాయి. ఈ విషయంలో ఇంటా బయట అంటూ ఏమీ వ్యత్యాసం లేదు. ఒక రకంగా చెప్పాలంటే విదేశీ గడ్డపై ఉంటున్న భారతీయులలోనే ఈ జాడ్యం కొంచెం ఎక్కువ అని చెప్పవచ్చు.

ఉపాధి కొరకు గల్ప్‌కు వచ్చిన ఒక సాదాసీదా గ్రామీణ యువకుడు సామాజిక మాధ్యమాల పుణ్యమా అంటూ ఏ విధంగా దేశభద్రతకు సవాల్ విసురుతున్నాడో పంజాబీ ప్రవాసుడు అమృతపాల్ సింగ్ ఉదంతాన్ని గమనిస్తే అవగతమవుతుంది. అమృతపాల్‌ను పట్టుకునే ప్రయత్నాలలో భాగంగా పోలీసులు ప్రధానంగా ఇంటర్నెట్ సేవలను సైతం స్తంభింపచేశారంటే అతడి అరెస్ట్‌పై ఎంతగా దృష్టి పెట్టారో అర్థమవుతుంది.

ఉద్యోగం కొరకు విదేశాలకు వెళ్ళడానికి అవసరమైన కనిష్ఠ వయస్సును దాటిన వెంటనే అమృతపాల్ దుబాయికి వచ్చాడు. ఒక దశాబ్ద కాలం పాటు పనిచేసి స్వదేశానికి తిరిగి వెళ్ళిన అమృతపాల్ వెనువెంటనే పంజాబీ మతచాంధసవాదులకు ఆరాధ్యుడయ్యాడు. పంజాబ్‌లో పెరిగిపోయిన మాదకద్రవ్యాలకు అలవాటుపడిన యువతలో మార్పును తీసుకువచ్చే లక్ష్యంతో గాయకుడు దీప్ సిధూ నెలకొల్పిన ‘వారిస్ పంజాబ్ దే’ (పంజాబ్ వారసులం) అనే ఒక సంస్థలో దుబాయిలో ఉంటున్న అమృతపాల్ సింగ్ ఒక ప్రముఖుడిగా ఎదిగాడు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు అనుమానాస్పద స్థితిలో మరణించిన అనంతరం దాని సారథ్యాన్ని చేపట్టాడు.

దుబాయిలో ఉంటున్న ఒక ప్రవాసుడికి మాతృభూమిలోని యువతలో అంతగా అభిమానులు ఉండడం విశేషమే. సున్నిత ధార్మికాంశాలపై అమృతపాల్ ప్రసంగాలు ఎందరినో భావోద్వేగ పూరితులను చేశాయి. ఇంటర్నెట్ కారణాన అమృతసర్ లేదా దుబాయి అనే సరిహద్దు పూర్తిగా చెరిగిపోయింది. దేశ దేశాలలోని పంజాబీలకు అనతికాలంలో అమృతపాల్ అభిమానుడయ్యాడు. ఖలిస్తాన్ వేర్పాటువాది, కరుడుగట్టిన ఉగ్రవాది, పంజాబ్‌లో రక్తపాతం సృష్టించిన జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలే సమీప బంధువు లఖ్బీర్ సింగ్ రోడ్ ఇప్పటికీ ఒక ఉగ్రవాద సంస్థను నడుపుతూ పాకిస్థాన్‌లో ఉంటున్నాడు. అతనితో అమృత‌పాల్‌కు సంబంధాలు ఏర్పడ్డాయి. దరిమిలా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐయస్ఐకు అమృతపాల్ దగ్గరయ్యాడని భారతీయ అధికారుల సమాచారం.

భింద్రాన్‌వాలే ఖలిస్తాన్ శకం పూర్తిగా ముగిసిందని భావిస్తున్న తరుణంలో దుబాయి నుండి తిరిగి వచ్చిన అమృతపాల్ అనూహ్యంగా భింద్రాన్‌వాలే–2గా అవతారమెత్తడంతో యావత్తు పంజాబ్ అవాక్కయింది. పాస్‌పోర్టు అనేది కేవలం ఒక ప్రయాణ పత్రమే తప్ప జాతీయుత కాదని, ఖలిస్తాన్ ఏర్పాటే సిక్కుల అంతిమ ధ్యేయం కావాలని అమృతపాల్ అన్నాడు. ఇలా వివాదస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా పంజాబ్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి తన అనుచరులను విడిపించుకోవడం ద్వార అమృతపాల్ స్పష్టంగా ఒక సవాల్ విసిరాడు.

అమృతపాల్ కనీసం పట్టభద్రుడు కూడా కాడు. 19 ఏళ్ళ వయసులో డ్రైవింగ్ ఉద్యోగం కొరకు దుబాయికి వచ్చి ఒక ట్రాన్స్‌పోర్ట్ సంస్థలో మేనేజర్‌గా ఉద్యోగపరంగా ఎదిగినా అంతకు వంద రెట్లు విద్వేష వ్యాప్తితో ఎదిగి, పూర్తిగా భింద్రాన్ వాలే స్ఫూర్తితో స్వదేశానికి తిరిగి వెళ్లాడు. అలా వచ్చిన అమృతపాల్‌కు పంజాబ్ యువతలో ఆదరణ లభించడం గమనార్హం. అమృతపాల్ సింగ్ కొరకు పోలీసుల అన్వేషణ మొదలయిన వెన్వెంటనే బ్రిటన్, అమెరికాలలోని భారతీయ దౌత్య కార్యాలయాలలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు చొరబడి భారతీయ త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచారు. ఇది గర్హనీయం. ధార్మికాంశాల ఆధారంగా విదేశీ గడ్డపై కొందరు పంజాబీ ప్రవాసులు పాల్పడుతున్న చర్యలు ముమ్మాటికీ తప్పు. స్వంత గడ్డపై లేని చాంధసవాదం, వేర్పాటువాదాన్ని విదేశీ గడ్డపై ఉంటున్న పిడికెడు మంది పెంచి పోషిస్తుండడంతో ఖలిస్తాన్ వాదానికి ఎక్కడో ఒక్క చోట సానుభూతి లభ్యమవుతుంది.

పరిస్ధితి చేయి దాటడడంతో అమృతపాల్ ఉదంతం తెలిసి వచ్చింది కానీ ఈ విష సంస్కృతి ఒక్క పంజాబ్‌కు లేదా అమృత పాల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే సామాజిక మాధ్యమాల ద్వారా విష సంస్కృతిని వ్యాపింప చేయడమనేది భారత్‌లో బీజేపీతోనే ప్రారంభమయింది. దాన్ని ఇప్పుడు అందరూ తమకు వీలయిన విధంగా అనుసరిస్తున్నారు.

గల్ఫ్ దేశాలలో కులాలు, మతాల ఆధారంగా నిరంతరం సామాజిక మాధ్యమాలలో విషం కక్కే భారతీయులలో దురదృష్టవశాత్తు కొందరు తెలుగువారు కూడా ఉన్నారు. సిబిఐతో సహా వివిధ సంస్థలు, పోలీసులు కొందరిపై కేసులు నమోదు చేసినా, అప్పుడప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఆ విద్వేష ప్రచారాన్ని నియంత్రించలేకపోతున్నారు. వాట్సాప్ గ్రూపులు, డిస్కషన్ రూంలు, ఫేస్ బుక్ పేజీలు మనుషులు, సంస్కృతుల మధ్య వారధిగా పని చేయడానికి బదులుగా వారిని విడదీస్తూ విభజిస్తున్నాయి! అమృతపాల్ సింగ్ ఉదంతం ఆ వినాశనకర పరిణామంపై ఒక హెచ్చరిక మాత్రమే.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-03-22T07:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising