NRI: ఎన్నారై కుటుంబంలో విషాదాన్ని నింపిన విహారయాత్ర.. 4నెలల బాబుతో సహా మహిళ మృతి!
ABN, First Publish Date - 2023-01-20T13:17:12+05:30
విహారయాత్ర ఓ ఎన్నారై కుటుంబంలో విషాదాన్ని నింపింది.
సింగపూర్: విహారయాత్ర ఓ ఎన్నారై కుటుంబంలో విషాదాన్ని నింపింది. సింగపూర్‌లో (Singapore) స్థిరపడ్డ ఓ ఎన్నారై భార్య, మూడేళ్ల కూతురు, నాలుగు నెలల బాబుతో కలిసి జపాన్‌కు (Japan) విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తన భార్యతో పాటు 4నెలల పిల్లోడిని కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కార్తీక్ బాలసుబ్రమణ్యం (44) కొన్నేళ్ల క్రితం భారత్ నుంచి వెళ్లి సింగపూర్‌లో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో అతడికి 2006లో ఆ దేశానికే చెందిన లీ (Lee) అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి 2014లో పెళ్లి బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. మూడేళ్ల కూతురితో పాటు నాలుగు నెలల బాబు. ఈ ఫ్యామిలీ ఈ నెల ప్రారంభంలో జపాన్‌కు విహారయాత్రకు వెళ్లింది.
అయితే, జనవరి 10న కార్తీక్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు ఓ లారీని ఢీకొట్టింది. జపాన్‌లోని హోక్కైడో (Hokkaido)లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో అతడే కారు డ్రైవ్ చేస్తున్నాడు. తీవ్రమైన మంచు కారణంగా సరిగ్గా రోడ్డు కనిపించకపోవడంతో ఎదురుగా వస్తున్న లారీని తాము ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టిందని కార్తీక్ తెలిపాడు. దాంతో కారు ఒక్కసారిగా పల్టీలు కొట్టిందట. ఈ ఘటనలో భార్య లీకి తీవ్ర గాయాలు కాగా, కూతురు ఆహానా, బాబుకు స్వల్ప గాయాలయ్యాయి. తనకు వీపు, నడుము భాగంలో గాయాలైనట్లు చెప్పాడు. అయితే, భార్యకు తలపై గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందన్నాడు. బాబు కూడా ఆస్పత్రిలోనే మృతిచెందినట్టు చెప్పాడు. బాబు, భార్యను కోల్పోవడం తన జీవితంలోనే తీరని విషాదం అని వాపోయాడు.
Updated Date - 2023-01-20T13:17:13+05:30 IST