NRI: ఈ 10 దేశాల్లోని ఎన్నారైలకు.. ఇకపై నగదు చెల్లింపులు చాలా సులువు
ABN, First Publish Date - 2023-01-12T07:23:42+05:30
ప్రవాస భారతీయులకు శుభవార్త..! ఇకపై పది దేశాల ఎన్నారైలు డిజిటల్ చెల్లింపులకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) సేవలను పొందవచ్చు.
10 దేశాల వారికి యూపీఐ సేవలు
ఎన్‌పీసీఐ సర్క్యులర్ విడుదల
న్యూఢిల్లీ, జనవరి 11: ప్రవాస భారతీయులకు శుభవార్త..! ఇకపై పది దేశాల ఎన్నారైలు డిజిటల్ చెల్లింపులకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) సేవలను పొందవచ్చు. అంటే.. వారు ఉంటున్న దేశం నుంచి.. భారత్‌లోని ఎన్నారై బ్యాంకు ఖాతా ద్వారా నగదు చెల్లింపులు జరపవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, హాంగ్‌కాంగ్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో ఉంటున్న ఎన్నారైలకు తొలి దశలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని భారత జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్‌పీసీఐ) వెల్లడించింది. ఆ మేరకు బ్యాంకర్లు ఏప్రిల్ 30లోగా తమ మెకానిజంలో మార్పులు చేసుకోవాలని సూచిస్తూ మంగళవారం ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. అంటే.. ఎన్నారైలు యూపీఐ చెల్లింపులకు అనుమతించేలా ఈ పది దేశాలకు చెందిన కంట్రీకోడ్ ఉన్న మొబైల్ నంబర్లను బ్యాంకర్లు తమ మెకానిజంలో చేర్చాల్సి ఉంటుంది. ఆ వెంటనే ఎన్నారైలు యూపీఏ సేవలను వినియోగించుకునే అవకాశాలుంటాయి.
Updated Date - 2023-01-12T07:44:56+05:30 IST