New Zealand: పట్టపగలే భారతీయుడి దుకాణంలో దొంగల బీభత్సం.. ఆందోళనలో భారతీయ సమాజం..!
ABN, First Publish Date - 2023-03-01T09:39:42+05:30
న్యూజిలాండ్‌లోని (New Zealand) కౌరీలాండ్స్‌లో ఓ భారతీయ వ్యక్తి (Indian Man) నిర్వహిస్తున్న డెయిరీ షాపులో (Dairy Shop) దొంగలు బీభత్సం సృష్టించారు.
ఎన్నారై డెస్క్: న్యూజిలాండ్‌లోని (New Zealand) కౌరీలాండ్స్‌లో ఓ భారతీయ వ్యక్తి (Indian Man) నిర్వహిస్తున్న డెయిరీ షాపులో (Dairy Shop) దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై భారతీయ సమాజం (Indian Community) ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉరేష్ పటేల్ అనే భారతీయుడు స్థానికంగా ఓ డెయిరీ దుకాణం నడుపుతున్నాడు. సోమవారం కొందరు దుండగులు బలవంతంగా దుకాణంలోకి చొరబడ్డారు. అనంతరం మారణ ఆయుధాలతో షాపులో ఉన్న ఉరేష్ పటేల్ భార్య, పిల్లలను బెదిరించి కౌంటర్‌లో ఉన్న క్యాష్‌తో పాటు ఇతర విలువైన వస్తువులను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. కాగా, ఈ దోపిడీ జరిగిన సమయంలో తాను షాపు వెనుకవైపు ఉండే ఇంట్లోనే ఉన్నట్లు ఉరేష్ పటేల్ తెలిపాడు.
తన భార్య, ముగ్గురు పిల్లల అరుపులు విన్న తాను వెంటనే షాపునకు పరిగెత్తుకు వచ్చానని, అప్పటికే దుండగులు చేతిలో నగదుతో అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించానని తెలిపాడు. కానీ, వారు తనపై దాడి చేసి అక్కడి నుంచి వాహనంపై ఊడాయించారని పటేల్ చెప్పాడు. అలా అక్కడి నుంచి చోరీ చేసి పారిపోయిన దుండగుల్లో ఇద్దరిని గ్లెన్ ఈడెన్‌లో పట్టుకోగా, మరోకరిని మరో చోట దుకాణంలో జనం పట్టుకుని తమకు అప్పగించారని పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే.. గతేడాది డిసెంబర్‌లో భారత సంతతికి చెందిన జనక్ పటేల్‌ను తాను పనిచేసే చోటనే దొంగలు హతమార్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అక్కడ పరిస్థితులు ఏమీ మారలేదని తాజా ఘటనతో మరోసారి నిరూపితమైందని భారతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: భారతీయుడిని అందరూ చూస్తుండగానే కాల్చి చంపిన ఆస్ట్రేలియా పోలీసులు.. ఇంతకీ అతడు చేసిన నేరమేంటంటే..
Updated Date - 2023-03-01T09:39:42+05:30 IST