రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం ఆధ్వర్యంలో సంక్రాంతి క్రికెట్ పోటీలు
ABN, First Publish Date - 2023-01-08T10:01:37+05:30
సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం’ సంక్రాంతి సంబరాల సన్నహాలు అప్పుడే మొదలయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన రెండు రోజుల సంక్రాంతి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు అద్యంతం కోలాహలంగా..
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం’ సంక్రాంతి సంబరాల సన్నహాలు అప్పుడే మొదలయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన రెండు రోజుల సంక్రాంతి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు అద్యంతం కోలాహలంగా సాగాయి. ఎడారి నాట గల్లు గల్లుమని కురుస్తున్న వర్షంలో బ్యాటింగ్ తడిసిన బుతువులో మంటలను రాజేస్తుండగా ఉరిమే ఉత్సాహంతో ఔత్సిహిక తెలుగు యువ క్రీడాకారులు తమ అభిమాన ఆటను ఆడి ఆదరగొట్టారు. తెలుగు క్రీడాకారుల అద్భుత క్రికెట్ తీరును చూసి అటుగా వెళ్తున్న ఇద్దరు ఆంగ్లేయులు కూడా వచ్చి సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. అంతేకాకుండా సంక్రాంతి ఉత్సవాలకు తాము కూడా హాజరయ్యేందుకు ఆసక్తి చూపారు.
మహేంద్ర వాకాటి నేతృత్వంలోని రియాధ్ సూపర్ కింగ్స్, ఆర్.వి.పి. ప్రసాద్ నాయకత్వంలోని సంక్రాంతి సన్ రైజర్స్, హేమంత్ కెప్టెన్సీలోని తెలుగు టైటాన్ ఫైటర్స్ మరియు ఇబ్రహీం శేఖ్ నాయకత్వంలోని తెలుగు టైటాన్ రైడర్స్ జట్లు శుక్రవారం ఉత్కంఠ భరితంగా తలపడ్డాయి. ఇందులో తెలుగు టైటాన్స్ ఫైటర్స్ , తెలుగు టైటాన్ రైడర్స్ జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఇక శనివారం అనేక మంది ఆంధ్ర కుటుంబాల నడుమ ఆసక్తికరంగా కొనసాగిన హోరహోరీ పోరులో తెలుగు టైటాన్ ఫైటర్స్ అంతిమ విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన జట్టులో హేమంత్, వినోద్ కుమార్, అమర్ ములసని, వెంకట్ గుగ్గిలం, సిద్దీఖ్ శేఖ్, చరణ్ కుమార్, భాస్కర్ గుండవల్లి, సందీప్ మాశెట్టి, శ్రీకాంత్, అనిల్ కుమార్ మర్రి మరియు సురేష్ కుమార్ ముదావత్లు ఉన్నారు. ఈ క్రీడోత్సవానికి సుఖేశ్ గుత్తు, స్వామి, బిందు భాస్కర్, నరేంద్ర పెళ్ళూరు తోడ్పాటందించగా.. క్రీడాకారులకు నాగేంద్ర, ఇబ్రహీం శేఖ్, శేషు బాబు భోజన ఏర్పాట్లు చేశారు.
విజేతలకు జనవరి 13న రియాధ్ నగరంలో ఘనంగా జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం జరుగుతుందని సమ్మేళనం కన్వీనర్ స్వామి సవర్ణ తెలిపారు. రియాధ్ నగరంలో గత అయిదేళ్ళుగా రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం సంస్థ సంక్రాంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా వివిధ క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రియాధ్ నగరంలో నివసించే తెలుగు కుటుంబాలన్నీ కూడా ఇందులో పాల్గొనచ్చనీ, మరిన్ని వివరాల కొరకు 0564994408 నెంబర్ ద్వారా సంప్రదించాలని సూచించారు.
Updated Date - 2023-01-08T10:05:52+05:30 IST