Padma Awards 2023: ఇద్దరు ప్రవాస భారతీయులకు పద్మ అవార్డ్స్!
ABN, First Publish Date - 2023-01-27T12:52:22+05:30
2023 ఏడాదికి గాను కేంద్ర హోంశాఖ ఈ సారి 106 మందికి పద్మ అవార్డులు (Padma Awards) ప్రకటించింది.
ఎన్నారై డెస్క్: 2023 ఏడాదికి గాను కేంద్ర హోంశాఖ ఈ సారి 106 మందికి పద్మ అవార్డులు (Padma Awards) ప్రకటించింది. వీటిలో ఆరు పద్మవిభూషణ్, తొమ్మిది పద్మభూషణ్, 91 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. కాగా, ఈ ఏడాది ఇద్దరు ప్రవాస భారతీయులకు పద్మ అవార్డులు దక్కాయి. ప్రఖ్యాత భారతీయ అమెరికన్ గణిత శాస్త్రవేత్త (Indian American Mathematician) శ్రీనివాస వరదన్‌ను (Srinivasa Varadhan) దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించింది. అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో చేసిన విశేషమైన సేవలకు గాను కెనడాకు చెందిన సుజాత రామ్‌దొరైకు (Sujatha Ramdorai) పద్మశ్రీ దక్కింది. శ్రీనివాస వరదన్ 1940 జనవరి 2న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించారు. గణితంలోని సంభావ్యత సిద్ధాంతంపై (Probability Theory) ఎన్నో ప్రయోగాలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
అలాగే గణిత శాస్త్రంలో చేసిన సేవలకు గాను నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ నుండి 2007 ఏడాదికి గాను ‘అబెల్ ప్రైజ్’ను అందుకున్నారు. ఆయనకు 1994లో బిర్‌కాఫ్ ప్రైజ్, 1995లో న్యూయార్క్ యూనివర్శిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుంచి మార్గరెట్ అండ్ హెర్మన్ సోకోల్ అవార్డు, 1996లో లెరోయ్ స్టీల్ ప్రైజ్ లభించాయి. ఇంతకుముందు 2008లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. మద్రాస్ యూనివర్సిటీ నుంచి 1960లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత 1963లో కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డాక్టరేట్ పొందారు. అదే ఏడాది భారత్ నుంచి న్యూయార్క్‌లోని కొరెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా వచ్చారు. ప్రస్తుతం శ్రీనివాస వరదన్ ఫ్రాంక్ జే గౌల్ట్ కౌరెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్‌లో గణిత శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Updated Date - 2023-01-27T12:52:24+05:30 IST