Viveka Murder Case : వివేకా హత్య కేసులో రెండోసారి 5 గంటలపాటు అవినాష్‌రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం.. బయటికొచ్చాక ఎంపీ ఏమన్నారంటే..
ABN, First Publish Date - 2023-02-24T17:57:00+05:30
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ (CBI) ఎదుట రెండోసారి హాజరయ్యారు. ఇప్పటికే ఆరున్నరగంటల పాటు ప్రశ్నించిన సీబీఐ..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ (CBI) ఎదుట రెండోసారి హాజరయ్యారు. ఇప్పటికే ఆరున్నరగంటల పాటు ప్రశ్నించిన సీబీఐ.. తాజాగా సుమారు 5 గంటలపాటు అధికారులు ఎంపీని ప్రశ్నించారు. ఈ విచారణలో అధికారులు గ్యాప్ లేకుండా అడిగిన ప్రశ్నలకు అవినాష్ ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది. సుదీర్ఘ విచారణ తర్వాత సీబీఐ ఆఫీసు నుంచి బయటికొచ్చిన అవినాష్ సంచలన కామెంట్సే చేశారు.
ఇంతకీ ఆయన ఏమన్నారు..?
‘ సీబీఐ అధికారులు (CBI Officers) అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని కోరాను.. కానీ రికార్డ్ చేయలేదు. మీడియా బాధ్యతగా వ్యవహరించాలి. విచారణలో ఉండగానే వార్తలను ప్రచారం చేస్తున్నారు. దోషులు, నిర్దోషులను మీరే నిర్ణయిస్తున్నారు. వాస్తవాలు బయటకు రావాలంటే సంయమనం పాటించాలి. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. అది గూగుల్ టేకౌటా?.. టీడీపీ టేకౌటా?. పర్సన్ టార్గెట్గా విచారణ కొనసాగుతోంది.. ఇది కరెక్ట్ కాదు. సీబీఐ కేసు ఐవో, సీబీఐ డైరెక్టర్‌కు ఒక వినతి పత్రం ఇచ్చాను. మీడియాలో వస్తున్న కథనాలతో సీబీఐ విచారణపై ప్రభావం పడుతుంది. ఒక నిజాన్ని 100 నుంచి సున్నాకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి 100కు పెంచే ప్రయత్నం జరుగుతోంది. విచారణ వాస్తవాల ఆధారంగా జరగడం లేదు.. ఏకపక్షంగా సీబీఐ విచారణ జరుగుతోంది. హత్య జరిగిన రోజు నేను ఏం మాట్లాడానో.. ఈరోజు అదే మాట్లాడుతున్నా.. నాకు తెలిసిందదే. మళ్లీ విచారణకు రావాలని సీబీఐ ఏం చెప్పలేదు’ అని మీడియాకు అవినాష్ రెడ్డి వెల్లడించారు.
కాగా.. వివేకా హత్యకేసులో అవినాష్ పాత్ర కీలకంగా ఉందని సీబీఐ భావిస్తోంది. ఆయనతోపాటు తండ్రి భాస్కర్‌రెడ్డి (Bhaskar Reddy) ప్రమేయానికి సంబంధించి ఓ అంచనాకు వచ్చింది. విచారణ ముగిసిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.
ఈ కేసులో అవినాస్ రెడ్డిని తొలిసారి గతనెల 28వ తేదీన ప్రశ్నించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో సుదీర్ఘంగా ఈ విచారణ జరిగింది. అవినాశ్ రెడ్డి ‘కాల్ డేటా’ ఆధారంగా అప్పట్లో కీలక ప్రశ్నలు సంధించింది. వివేకా హత్య జరగడానికి ముందు, తర్వాత ఆయన రెండు నంబర్లతో మాట్లాడినట్లు గుర్తించారు. అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఈ నెల 23న, అవినాశ్‌రెడ్డిని 24న విచారణకు రావాలంటూ సీబీఐ ఈ నెల 18న నోటీసులు ఇచ్చింది. అయితే... 23న హాజరు కాలేనని భాస్కర్‌రెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారు.
Updated Date - 2023-02-24T18:37:21+05:30 IST