KCR: మహారాష్ట్రకు గోదారి.. ఏపీకి కృష్ణా.. గిదేం తొండాట కేసీఆర్ ?
ABN, First Publish Date - 2023-02-06T17:56:56+05:30
గలగలా గోదారి పరుగులెడుతుంటే... బిర బిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే పాటను ఉద్యమంలో కేసీఆర్ ఎంత వెటకారంగా విమర్శించారో ప్రజలెవరూ మర్చిపోలేదు. గోదారి పక్కనున్న...
గలగలా గోదారి పరుగులెడుతుంటే... బిర బిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే పాటను ఉద్యమంలో కేసీఆర్ (KCR) ఎంత వెటకారంగా విమర్శించారో ప్రజలెవరూ మర్చిపోలేదు. గోదారి పక్కనున్న బీడు భూములు దాహం దాహం అంటున్నాయని, కృష్ణమ్మను ఆంధ్రాకు (Andhra) ఎత్తుకుపోతున్నారని ఇదే కేసీఆర్ వేల సార్లు తిట్టిపోశారు. తెలంగాణ వచ్చాక ఏమైందో అందరికీ తెలుసు.
టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ (BRS) అయ్యింది. ఇన్నాళ్లు తిట్టిపోసిన కేసీఆర్ ఇప్పుడు పక్క రాష్ట్రాల గురించి ఆలోచిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీరాం సాగర్‌ను (Sri Ram Sagar Project) ఎండబెట్టేందుకు మహారాష్ట్ర బాబ్లీ కడుతుంటే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సుప్రీంకోర్టు జోక్యంతో తెలంగాణకు కాస్త ఉపశమనం దొరికింది.
కానీ, కేసీఆర్... మహారాష్ట్ర వాళ్లను ‘శ్రీరాం సాగర్ నీళ్లను ఎత్తిపోసుకోండి’ అని ప్రకటించేశారు. శ్రీరాం సాగర్ నుంచి నిజాం సాగర్, మంజీరా, మిడ్ మానేరు, లోయర్ మానేరు వరకు గ్రావిటీ నీళ్లు వస్తాయి. కానీ, శ్రీరాం సాగర్‌కు నీరే రావట్లేదు.. మహారాష్ట్ర పైన ప్రాజెక్టులు కట్టేసింది అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు వచ్చిన నీటిని శ్రీరాం సాగర్ స్థిరీకరణకు రూ.1000 కోట్లు ఖర్చుపెట్టి మరీ కాలువలు, లిఫ్టులు పెట్టించారు. ‘నదులకు కొత్త నడక నేర్పింది మా కేసీఆర్’ అంటూ అప్పట్లో టీఆర్ఎస్ నేతలు పాలిభిషేకాలు చేశారు. కానీ ఇప్పుడు అదే శ్రీరాం సాగర్‌కు వచ్చే కొన్ని నీళ్లను కూడా ‘ఎత్తిపోసుకోండి’ అంటూ కేసీఆర్ ప్రకటించేశారు. అది కూడా కేవలం బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం.
నాందేడ్ బీఆర్‌ఎస్ మీటింగ్‌లో (Nanded BRS Meeting) మహారాష్ట్రకు తెలంగాణకు రావాల్సిన గోదావరి నీటిని ఇచ్చేశాడు. రేపు ఏపీలో మీటింగ్ పెడితే... గతంలో నీళ్లదొంగలు, పోతిరెడ్డిపాడుతో పొక్క కొట్టారు, బాంబులు పెట్టి తూములు పేల్చి నీటిని ఎత్తుకెళ్లారు అని తిట్టిన కేసీఆరే... కృష్ణమ్మను బిరబిరా తీసుకపోండి అంటారేమో. పైగా గోదారిలో నీటి లభ్యత ఎక్కువుంతి... కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామని గతంలో చేసిన ప్రకటనను నిజం చేస్తా అంటారేమో.
రాజకీయాల కోసం హామీలిస్తున్న కేసీఆర్.. తెలంగాణ రైతులకు కొత్తగా ఎంత నీళ్లిచ్చారు? బేసిన్ లు మారిస్తే పై రాష్ట్రాల వాటా పెరుగుతుందన్న సంగతి కేసీఆర్ కు తెలియదా..? ఎండిపోతున్న పాలమూరు, నీళ్లులేక అల్లాడే నిజామాబాద్, మెదక్ కేసీఆర్ కు కనపడటం లేదా అంటూ ఇప్పుడు తెలంగాణ వాదులే కేసీఆర్ పై మండిపడే రోజులొచ్చాయి. ఉద్యమ నాయకుడని చెప్పుకునే కేసీఆర్.. ఉద్యమ ఆకాంక్షలు చంపేస్తారా? అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి.
Updated Date - 2023-02-06T17:57:25+05:30 IST