ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad BRS: హైదరాబాద్‌పై కేసీఆర్, కేటీఆర్ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో.. కానీ రియాల్టీ ఏంటంటే..

ABN, First Publish Date - 2023-04-11T09:50:00+05:30

పార్టీలోని నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, సఖ్యత కోసం అధికార బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తోన్న సమ్మేళనాల్లో ఆత్మీయత కనిపించడం లేదు. అసమ్మతితో రగులుతోన్న వారిని ఏకం చేసేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆత్మీయతా.. అదెక్కడ..?

బీఆర్‌ఎస్‌ సమ్మేళనాల్లో అసమ్మతి

గతంలోని వైరాలూ వెలుగులోకి

పార్టీ శ్రేణుల మధ్య కనిపించని సఖ్యత

నాయకుల మధ్య పెరుగుతోన్న అంతరం

పలుచోట్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు దూరం

సీనియర్‌ నేతలూ గైర్హాజరు

అధిష్ఠానం ఉద్దేశం ఒకటి.. జరుగుతోంది మరోటి

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): పార్టీలోని నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, సఖ్యత కోసం అధికార బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తోన్న సమ్మేళనాల్లో (BRS Athmeeya Sammelanam) ఆత్మీయత కనిపించడం లేదు. అసమ్మతితో రగులుతోన్న వారిని ఏకం చేసేందుకు ఉద్దేశించిన మీటింగ్‌లు వారి మధ్య అంతరాన్ని మరింత పెంచుతున్నాయి. గతంలోని వైషమ్యాలు తవ్వుకునేందుకు వేదికలుగా మారుతున్నాయి. అగ్రనేతల సూచనలూ ఖాతరు చేయకుండా.. క్షేత్రస్థాయిలో కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు. దీంతో సమ్మేళనాల పేరిట పార్టీలోని అంతర్గత విభేదాలను మనమే బహిర్గతం చేసుకుంటున్నామా..? అని కొందరు సీనియర్‌ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఆరు నెలల్లో ఎన్నికలుండే అవకాశముండడంతో పలు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాల వల్ల జరుగుతోన్న పరిణామాలు ఆశనిపాతంలా మారుతున్నాయి. కొన్నిచోట్ల నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు సమ్మేళన సమావేశాలు వేదికగా బయటపడుతున్నాయి. కొందరు మీటింగ్‌కు హాజరు కాకుండా అసమ్మతి రాగం వినిపిస్తుంటే.. ఇంకొందరు సమావేశంలో పాల్గొని స్థానిక శాసనసభ్యులతో సఖ్యత లేదని తమ ప్రసంగాల ద్వారా సంకేతాలనిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో (Hyderabad District) అన్నీ తానే అన్నట్టు వ్యవహరించే మంత్రి తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాల ఇన్‌చార్జ్‌గా ఉన్న నాయకుడూ.. వివాదాల జోలికి వెళ్లకుండా మీటింగ్‌లు జరిగితే చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

వారంతా గైర్హాజరు..

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఆరు డివిజన్లుండగా.. నాలుగు చోట్ల సమ్మేళనాలు జరిగాయి. ఎమ్మెల్యేతో సఖ్యత లేని కొందరు మీటింగ్‌లకు గైర్హాజరవుతున్నారు. ముషీరాబాద్‌ మాజీ కార్పొరేటర్‌ ఎడ్ల భాగ్యలక్ష్మి తన డివిజన్‌లో జరిగిన సమావేశానికి వెళ్లలేదు. బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌ సునీతా ప్రకాష్ గౌడ్‌ కూడా అంతే. పార్టీ కార్యక్రమాలకూ ఆమె దూరంగా ఉంటున్నారు. మరో సీనియర్‌ నేత ఎమ్మెన్‌ శ్రీనివాసరావు ఒక్క సమావేశంలోనూ పాల్గొనలేదు. ఉద్యమం నాటి నుంచి పార్టీలో ఉన్న పలువురూ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు.

మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి సంబంధించి వినాయక్‌నగర్‌ డివిజన్‌ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ కార్పొరేటర్‌ బద్దం పుష్పలతారెడ్డి పాల్గొనలేదు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మాజీ కార్పొరేటర్‌ మధ్య విభేదాలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. తమకు సమాచారం కూడా లేదని మాజీ కార్పొరేటర్‌ పుష్పలతారెడ్డి భర్త పరశురాంరెడ్డి సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు సమాచారం.

అంబర్‌పేటలో రోజురోజుకూ..

అంబర్‌పేట నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఐదు డివిజన్లకుగాను మూడు చోట్ల సమావేశాలు జరిగాయి. కాచిగూడ డివిజన్‌ సమావేశంలో పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని ఓ నాయకుడు ప్రశ్నించగా.. వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. గోల్నాక డివిజన్‌ మీటింగ్‌కు ప్రస్తుత కార్పొరేటర్‌ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్‌ గైర్హాజరయ్యారు. రెండు రోజుల ముందు మీటింగ్‌ ఉందన్న సమాచారమిచ్చారని, కార్పొరేటర్‌గా ఎన్నికైన నాటి నుంచి మహిళ అని కూడా చూడకుండా తనను అవమానిస్తున్నారని, మీటింగ్‌కు ఎలా వెళ్తానని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు మాత్రం.. ‘ఇతర కార్పొరేటర్లలానే ఆమెనూ గౌరవిస్తున్నాం.. పార్టీ మీటింగ్‌కు రాకపోవడం సబబు కాదు’ అంటున్నారు. నల్లకుంట, బాగ్‌ అంబర్‌పేట డివిజన్ల సమావేశాలు ఎలా జరుగుతాయన్నది చూడాలి.

ఎల్‌బీనగర్‌లోని అన్ని డివిజన్లలో సమావేశాలు ముగిశాయి. బీఎన్‌రెడ్డి నగర్‌, చంపాపేట మాజీ కార్పొరేటర్లు లక్ష్మిప్రసన్న, సామ రమణారెడ్డిలు మీటింగ్‌ల్లో పాల్గొనలేదు. స్థానిక ఎమ్మెల్యేతో వైరం వల్లే వారు గైర్హాజరైనట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

గోషామహల్‌ నియోజకవర్గంలోనూ అసమ్మతి మొదలైంది. ఇన్‌చార్జ్‌గా నందు వ్యాస్‌ బిలాల్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఇంతకుముందు ఇన్‌చార్జ్‌గా ఉన్న ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ కినుక వహించినట్టు తెలిసింది. గతంలో జరిగిన బేగంబజార్‌ డివిజన్‌ సమావేశంలో పాల్గొన్న ప్రేమ్‌సింగ్‌.. ఇన్‌చార్జ్‌ ప్రకటన అనంతరం సోమవారం నిర్వహించిన మీటింగ్‌కు గైర్హాజరయ్యారు.

జిల్లా అధ్యక్షుడి ఇలాకాలోనూ..

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్‌ ప్రాతినిధ్యం వహిస్తోన్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోనూ అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. బోరబండ కార్పొరేటర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, ఎమ్మెల్యే మధ్య విభేదాలు ఇప్పటికే పలుమార్లు బహిర్గతమయ్యాయి. బోరబండ డివిజన్‌లో ఇప్పటికీ సమావేశం నిర్వహించ లేదు. వారిరువురి మధ్య వార్‌ నేపథ్యంలో ఇక్కడ సమావేశం జరగలేదని సమాచారం.

కుత్బుల్లాపూర్‌లో కోల్డ్‌వార్‌

కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది నేనే అని ఇద్దరూ ప్రచారం చేసుకుంటూ, పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. మేడ్చల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌గా ఉన్న పల్లా రాజరేశ్వర్‌రెడ్డి.. సమావేశాల్లో పాల్గొనేలా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని ఒప్పించారు. వివేకానంద, శంభీపూర్‌ ఒకే వేదికను పంచుకుంటున్నా.. ఒకరినొకరు పలకరించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది.

అక్కడ మరీ ఘోరం..

ఉప్పల్‌ నియోజకవర్గంలో పరిస్థితి మరీ ఘోరం. ఇప్పటి వరకు పలు డివిజన్ల సమావేశాలు నిర్వహించగా.. మూడు చోట్ల మాజీ కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, మేకల అనలారెడ్డి, గంధం జ్యోత్స్న పాల్గొనలేదు. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉంటోన్న సీనియర్‌ నేతలూ గైర్హాజరవుతున్నారు. మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తోన్న చర్లపల్లి డివిజన్‌తోపాటు నాచారం, మల్లాపూర్‌, ఏఎస్‌రావు నగర్‌లో సమావేశాలు జరగాల్సి ఉంది.

మల్లాపూర్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌చార్జ్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందే అసమ్మతి గళం వినిపించారు. అందుకే ఆయన డివిజన్‌ స్థాయి సమావేశాల్లో పాల్గొనడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో కొందరు సిట్టింగ్‌ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్‌ నేతల మధ్య విభేదాల నేపథ్యంలో సమావేశాలకు వారు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-04-11T09:50:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising