TarakaRatna Death : ఛీ.. ఛీ.. తారకరత్న మృతిపై ఇంత నీచంగా రాజకీయాలా.. అదే నిజమైతే విజయసాయిరెడ్డి ఊరుకునేవారా..!?
ABN, First Publish Date - 2023-02-19T18:42:13+05:30
ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అయ్యో పాపం ఇలా జరిగిందేంటి..? అని అందరూ జాలి పడుతుంటారు. ఇంకొందరైతే.. చావు అనేది ఎంత పగవాడికైనా సరే రాకూడదని కోరుకుంటారు. కానీ చావును రాజకీయం చేయడం...
ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అయ్యో పాపం ఇలా జరిగిందేంటి..? అని అందరూ జాలి పడుతుంటారు. ఇంకొందరైతే.. చావు అనేది ఎంత పగవాడికైనా సరే రాకూడదని కోరుకుంటారు. కానీ చావును రాజకీయం చేయడం, పంచాయితీలు పెట్టడం చాలా అరుదుగా చూస్తుంటాం. టాలీవుడ్ సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) కన్నుమూశారని ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తారకరత్న మరణం సినీ, రాజకీయ వర్గాలను విషాదంలోకి నెట్టిందని చెప్పుకోవచ్చు. ఎంతో భవిష్యత్ ఉన్న తారకరత్న ఇంత చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో అటు సోషల్ మీడియాలో (Social Media) వైసీపీకి (YSRCP) చెందిన కార్యకర్తలు కొందరు తారకరత్న మృతిపై చిల్లర మల్లరగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. మీడియాలో కనిపించాలని అనుకున్నారో లేకుంటే ఎప్పటిలాగే నందమూరి, నారా కుటుంబ సభ్యులపై విమర్శించాలని అన్నారో కానీ వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతి.. (Lakshmi Parvathi) తారకరత్న మృతిపై సంచలన ఆరోపణలు చేశారు.
ఇంతకీ ఆమె ఏమన్నారు..!?
తారకరత్న మృతి చాలా బాధాకరమైన విషయం అని అంటూనే ఇక తన నోటికి పని చెప్పారు లక్ష్మీ పార్వతి. ‘తారకరత్న ఎప్పుడో చనిపోయాడు. కేవలం నారా లోకేష్ కోసం, స్వార్థం కోసం ఎక్కడ తన (నారా చంద్రబాబు) కుమారుడికి చెడ్డపేరు వస్తుందో అని ఇన్ని రోజులు దాచిపెట్టారు. తారకరత్న ప్రాణం ఎప్పుడో పోయినా సరే ఇన్ని రోజులు అలాగే ఉంచారు. ఏమిటీ దుర్మార్గం.. ఈ రాజకీయాలకు అంతం లేదా అని నాకు అనిపిస్తోంది. ఆ అబ్బాయి చనిపోయాడని అప్పుడే డాక్టర్లు చెప్పారు. గుండె ఆగిపోయిందని చెప్పినప్పుడే అందరికీ అర్థమైపోయింది. వారి స్వార్థం కోసం ఈ విషయాన్ని దాచిపెట్టారు. ప్రజలంతా ఎక్కడ అపశకునంగా భావిస్తారో అని బయటపెట్టలేదు. రెండు రోజులు పాదయాత్ర (Padayatra) వాయిదా వేసినప్పడే మరణ వార్త అప్పుడే ప్రకటించి ఉండాల్సింది. నారా చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ అపశకునమే. ఎవరు చెప్పినా చెప్పకపోయినా.. దాచిపెట్టినా ప్రజలందరికీ అసలు విషయం అర్థమైపోయింది. గుండెను పిండేస్తోంది.. ఆ బాధ ఏంటో తారకరత్న కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. ఆయన భార్య, పిల్లలు ఎంత అల్లాడిపోయి ఉంటారో తలచుకుంటేనే బాధేస్తోంది. ఇలాంటి విషయాన్ని కూడా తన రాజకీయ పబ్బానికి వాడుకునే దుర్మార్గం చంద్రబాబు (Chandrababu), లోకేష్‌కే (Nara Lokesh) తెలుసు. ఈ నీచ రాజకీయాలకు ఎప్పుడు స్వస్తి పలుకుతుందో అప్పుడే మా నందమూరి కుటుంబం బాగుపడుతుంది’ అని లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈమె కామెంట్స్ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా లక్ష్మీపార్వతి కామెంట్సే వైరల్ (Viral) అవుతున్నాయి.
ఇంత నీచంగా ఎలా..?
ఒకవేళ నిజంగానే నారా లోకేష్ పాదయాత్ర (Nara Lokesh Padayatra) ప్రారంభం రోజే తారకరత్న చనిపోయి ఉంటే ఇన్ని రోజులుగా దాచిపెట్టాల్సిన అవసరం ఎవరికుంది..? ఒకవేళ దాచితే నందమూరి, నారా కుటుంబాలకు (Nara, Nandamuri Family) ఏం ప్రయోజనం ఉంటుంది..? అనే విషయాలు ఎందుకు ఆలోచించట్లేదని లక్ష్మీపార్వతిపై టీడీపీ కార్యకర్తలు (TDP Activists) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఒక వ్యక్తి చనిపోయారని ఆ కుటుంబం బాధలో ఉంటే అసలు ఇలాంటి కామెంట్స్ చేయడానికి ఆమెకు మనసు ఎలా వచ్చిందో.. శవాలపై రాజకీయం చేయడమేంటి..? అని సొంత పార్టీ కార్యకర్తలే లక్ష్మీపార్వతిపై దుమ్మెత్తిపోస్తున్నారు. తమ కుమారుడు ఇకలేరని తల్లిదండ్రులు పుట్టెడు దు:ఖంలో ఉంటే.. అసలు ఇంత నీచంగా ఎలా మాట్లాడుతారు..? అని నందమూరి వీరాభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఛీ.. ఛీ.. ఎప్పుడు చూసినా నందమూరి, నారా కుటుంబాలపై ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లో నిలవాలనే యావ తప్పితే వేరే పనేమీ ఉండదా..? అని లక్ష్మీపార్వతిపై నెటిజన్లు కన్నెర్రజేస్తున్నారు.
విజయసాయి ఊరుకుంటారా..!?
ఇవన్నీ పక్కనెడితే.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డే (MP Vijayasai Reddy) స్వయంగా బెంగళూరుకు (Bangalore) వెళ్లి ఐసీయూలో ఉన్న తారకరత్నను చూసొచ్చారు. తారకరత్న ఆరోగ్యంపై మీడియాతో కూడా మాట్లాడారు. నందమూరి బాలకృష్ణే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు.. నిజంగా ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సిందే అన్నట్లుగా మీడియా ముందు విజయసాయిరెడ్డి కామెంట్స్ చేశారు. ఒకవేళ నిజంగా అప్పటికే చనిపోయి ఉంటే విజయసాయిరెడ్డి ఊరుకునేవారా..?.. అటు నందమూరి ఫ్యామిలీని.. ఇటు నారా ఫ్యామిలీని కచ్చితంగా నిలదీసేవారు కదా..? ఒకవేళ అదే నిజం అయ్యి ఉంటే ఎంత రాద్ధాంతం జరిగి ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డి.. విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కుమార్తె. అంటే విజయసాయికి తారకరత్న అల్లుడు వరుస అవుతారు. అలాంటిది సొంత కుటుంబంలో ఇలా జరిగి ఉంటే.. అది కూడా విజయసాయికి తెలిస్తే పరిస్థితులు మామూలుగా ఉండేవి కాదు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అక్షరాలా నిజమేనని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయట.
వాస్తవానికి నందమూరి, నారా ఫ్యామిలీ అంటే లక్ష్మీపార్వతికి ఇసుమంత కూడా పడదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే తారకరత్న మరణాన్ని ఇలా రాజకీయంగా వాడుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. విషాద ఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలే తప్పితే.. ఇలా చిల్లరగా మాట్లాడి రాజకీయాలకు అంటగడితే ఏ మాత్రం ప్రయోజనం ఉండదన్న విషయం లక్ష్మీపార్వతి ఇకనైనా తెలుసుకుంటే మంచిదని నందమూరి ఫ్యాన్స్ హితవు పలుకుతున్నారు. సో.. మీడియా ముందుకు వచ్చేటప్పుడు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదేమో.
Updated Date - 2023-02-19T20:24:23+05:30 IST