TDP MP Kesineni Nani: కాకరేపుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా వ్యాఖ్యలు.. బెజవాడ టీడీపీలో ఏం జరుగుతోంది..?
ABN, First Publish Date - 2023-05-31T17:33:25+05:30
విజయవాడ లోక్‌సభ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్‌ఫారాలు ఉన్నాయని, ఒకటి చంద్రబాబు, రెండోది జగన్ రెడ్డి అని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించడం కొసమెరుపు. విరోధాలు ఆ ఇద్దరి మధ్యే గానీ తమ మధ్య లేవని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో స్కూల్ ప్రహారీ గోడ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని (TDP MP Kesineni Nani) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో (YCP MLA Vasantha Krishna Prasad) కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని నాని మాట్లాడుతూ.. విజయవాడ లోక్‌సభ టికెట్ (Vijayawada MP Ticket) ఏ పిట్టల దొరకు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్‌ఫారాలు ఉన్నాయని, ఒకటి చంద్రబాబు (Chandra Babu), రెండోది జగన్ రెడ్డి (Jagan Reddy) అని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించడం కొసమెరుపు. విరోధాలు ఆ ఇద్దరి మధ్యే గానీ తమ మధ్య లేవని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. విజయవాడ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలుస్తానని, 2019లో టీడీపీ ఒక్కటే కాదు అన్ని పార్టీల సానుభూతిపరులు ఓటు వేసి గెలిపించారని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు బెజవాడ టీడీపీలో కాకరేపుతున్నాయి.
విజయవాడ అభివృద్ధికి ఢిల్లీ స్థాయిలో పనిచేయించే సత్తా తనకు ఉందని, పార్టీ కోసం కొట్టుకోమని కేడర్‌కు ఏ నాయకుడూ చెప్పడని కేశినేని నాని వ్యాఖ్యానించారు. పార్టీల కోసం వ్యక్తిగత ద్వేషాలతో బంధుత్వాలను దూరం చేసుకోవద్దని, ఢిల్లీ స్థాయిలో ఎవరు వచ్చినా పనిచేస్తానని చెప్పారు. అభివృద్ధి విషయంలో కేశినేని నానిది, తనదీ ఒకే బాటని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా వ్యాఖ్యానించడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు అవకాశం ఇచ్చింది. నిధుల కోసం సుజనా చౌదరిని కలిశానని, ఎంపీ కేశినేనిని అడిగితే కొండపల్లి, నాగులూరుకు నిధులు మంజూరు చేశారని పరోక్షంగా కేశినేని నానిని ఈ మైలవరం వైసీపీ ఎమ్మెల్యే కొనియాడారు. ఎంపీ, ఎమ్మెల్యేల అభివృద్ధి మాటలతో మైలవరంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇద్దరు కలిసి పార్టీలను పక్కన పెట్టి వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల్లో రకరకాల ఊహాగానాలు చర్చకొస్తుండటం గమనార్హం.
ఇటీవల నందిగామలోనూ ఇలానే..
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అందుకు భిన్నంగా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు బహిరంగ వేదికపై పరస్పరం పొగడ్తలకు దిగడం కూడా ఇటీవల చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వీరి చర్య రాజకీయంగా పెను చర్చకు తెరతీసింది. చందర్లపాడు మండలం తోటరావులపాడులో ఎంపీ నిధులు రూ.47 లక్షలతో నిర్మించిన 60 వేల లీటర్ల సామర్థ్యంగల వాటర్ ట్యాంక్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఆదివారం (మే 28, 2023) ప్రారంభించారు.
ఎంపీ కేశినేని మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యే జగన్మోహనరావు అభివృద్ధి కాముకుడు. నాలుగేళ్లుగా ఆయన పనితీరును గమనిస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. రాజకీయాలకు అతీతంగా ప్రజాహితం కోరుకొనే మనిషి. సమస్యలపై స్పందించే నేత’’ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అదే సమయంలో అసలు కార్యక్రమానికే హాజరు కానీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ను కూడా ఎంపీ కొనియాడారు. ఎమ్మెల్యే జగన్మోహనరావు మాట్లాడుతూ.. ‘‘టాటా ట్రస్టు సేవలందిస్తుందని దేశంలో ఎవరికీ తెలియదు. కేశినేని నాని మాత్రమే ఆ సేవలను ప్రజలకు అందించారు. సమకాలీన రాజకీయాల్లో ప్రజాసేవ చేసే వారికి గుర్తింపు ఉంటుంది. అందుకు కేశినేని నాని నిదర్శనం. నేను అడిగిప్పుడల్లా నిధులిచ్చారు. ఇలాగే మంచి వాతావరణంలో మేం పనిచేస్తాం’’ అని తెలిపారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమని, దీనిలో రాజకీయాలకు తావు లేదని నేతలిద్దరూ స్పష్టం చేశారు. తాజాగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే కూడా కేశినేని నానిని ప్రశంసించడంతో ఈ బెజవాడ టీడీపీ ఎంపీ చుట్టూ రాజకీయంగా ఊహాగానాలు జోరందుకున్నాయి.
Updated Date - 2023-05-31T18:00:06+05:30 IST