AP Politics: ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అసలు రంగు ఇదే.. వైరల్ అవుతున్న వీడియో
ABN, First Publish Date - 2023-09-15T17:00:45+05:30
తనకు జన్మనిచ్చింది తన తండ్రి అయినా పునర్జన్మ ఇచ్చింది మాత్రం జగన్ అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. తనకు పునర్జన్మ ఇచ్చిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని.. ఆయన శ్వాసలోనే ఉంటానని చెప్పుకొచ్చారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో ఎక్కడ చూసినా ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేరు మార్మోగిపోతోంది. అయితే ఆయన ఏకపక్షంగా వాదనలు వినిపించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన జగన్‌కు వీరాభిమాని. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పొన్నవోలు చెప్పిన వ్యాఖ్యలు వింటే దిమ్మతిరగడం ఖాయం. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి నిస్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యక్తి ఇలా ఒకరికి ఊడిగం చేస్తానని చెప్పడం వీడియోలో హైలెట్‌గా నిలుస్తోంది. దీంతో ఏపీలో పలు కేసులను సీఐడీ ఏ విధంగా విచారణ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చని నెటిజన్‌లు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇంతకీ ఈ వీడియోలో పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఏం చెప్తున్నారంటే.. తనకు జన్మనిచ్చింది తన తండ్రి అయినా పునర్జన్మ ఇచ్చింది మాత్రం జగన్ అని కుండబద్దలు కొట్టారు. తాను ట్రయల్ కోర్టు అడ్వకేట్ అయినా తనకు పిలిచి అడ్వకేట్ జనరల్ పోస్టు ఇచ్చారని జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు మన అడ్వకేట్ జనరల్ పొన్నవోలు. పదేళ్లుగా జగన్‌తో ఉన్న అనుబంధం గురించి కూడా ఈ వీడియోలో ఆయన వివరించారు. తమ బంధం గురించి తలుచుకుంటే ఒళ్లు గగుర్పాటు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. తనకు వేరే మాస్క్ ఏం లేదని.. జగన్ ఏం చెప్తే అదే చేస్తానని స్పష్టం చేశారు. తాను అడ్వకేట్ జనరల్ అయినా పార్టీతో సంబంధం, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకునే దౌర్భాగ్యుడిని కాదని వివరిస్తూ జగన్‌కు ఊడిగం చేస్తానని క్లియర్‌గా చెప్పేశారు. తనకు పునర్జన్మ ఇచ్చిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని.. ఆయన శ్వాసలోనే ఉంటానని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Vangalapudi Anita: చంద్రబాబు భద్రతపై మాట్లాడటానికి మంత్రులు ఎవరు?
కాగా ఏఏజీ స్థాయి వ్యక్తిని విమర్శించడం కాదు కానీ.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒకరికి కొమ్ము కాయడం సరికాదని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. అంతగా ఊడిగం చేయాలనుకుంటే తన లాయర్ పదవికి రాజీనామా చేసి సజ్జల రామకృష్ణారెడ్డి తరహాలో సలహాదారుడిగా చేరి జగన్ చెప్పినట్లు పనిచేయవచ్చు కదా అని పలువురు సలహా ఇస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టలేదంటే ఎవరు నమ్ముతారని టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి తప్పుడు సాక్ష్యాలతో కోర్టులను ఇలాంటి వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారని విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా గంగా నది ఎక్కడ పుట్టిందో కూడా తెలియని అజ్ఞాని మన అడ్వకేట్ జనరల్ గారు అంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం మీద జగన్‌పై తన అభిమానం చూపిస్తూ భావోద్వేగానికి గురైన పొన్నవోలు వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Updated Date - 2023-09-15T17:00:45+05:30 IST