AP Politics: ఆందోళనలు ఉధృతం చేసిన అంగన్వాడీలు.. అయినా జగన్ పట్టించుకోరా?
ABN, First Publish Date - 2023-07-12T14:15:26+05:30
అంగన్వాడీల ఆందోళనలపై జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం విమర్శలకు తావిస్తోంది. రెండు రోజులుగా తాముు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తున్నా పట్టించుకోకుండా పోలీసులతో అరెస్టులు చేయిస్తుండటంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో అధికారంలోకి వస్తే తమ వేతనాలు పెంచుతామని హామీలు ఇచ్చిన జగన్ ఇప్పుడు ఆందోళనలు చేసినా పిలిచి మాట్లాడే పరిస్థితి లేదని అంగన్వాడీలు ఆవేదన చెందుతున్నారు.
ఏపీ(Andhra Pradesh)లో ప్రజా సమస్యలను అధికార పార్టీ వైసీపీ (YSRCP) గాలికొదిలేసింది. వాళ్ల పార్టీ గుర్తు ఫ్యాన్ (Fan) కాబట్టి బహుశా అలా చేస్తుందనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అంగన్వాడీలు (Anganwadi Workers) తమ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా సీఎం జగన్(Jagan)కు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ముఖ్యంగా అంగన్వాడీల ఆందోళనలపై జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం.. మోనార్క్ తరహాలో జగన్ వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది
రెండు రోజులుగా తాముు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తున్నా పట్టించుకోకుండా పోలీసులతో అరెస్టులు చేయిస్తుండటంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో అధికారంలోకి వస్తే తమ వేతనాలు పెంచుతామని హామీలు ఇచ్చిన జగన్ ఇప్పుడు ఆందోళనలు చేసినా పిలిచి మాట్లాడే పరిస్థితి లేదని అంగన్వాడీలు ఆవేదన చెందుతున్నారు. మహిళల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తామని చెప్పి ఇప్పుడు రోడ్లపై తమను ఈడ్చుకుంటూ వెళ్తున్నారని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
మరోవైపు తమపై ఆదాయ పరిమితి అస్త్రాన్ని ప్రయోగించి సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారని జగన్‌పై అంగన్వాడీలు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు నెలకు రూ.13,650 గౌరవ వేతనం ఇస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.11,500 మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు రూ.6,300 వేతనం పెంచితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.వెయ్యి మాత్రమే పెంచిందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అంగన్వాడీలపై ఆదాయ పరిమితి ఆంక్షలు విధించి అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఒంటరి, వితంతు పెన్షన్‌లను తీసివేశారని గగ్గోలు పెడుతున్నారు. అంగన్వాడీలకు గ్రాట్యూటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా జగన్ ప్రభుత్వం బేఖాతరు చేస్తోందంటున్నారు. పదవీ విరమణ చేసిన వారికి గత ప్రభుత్వంలో రూ.50 వేలు ఇచ్చేవాళ్లు అని.. ఇప్పుడు దానిని రూ.5 లక్షలకు పెంచాలని తాము కోరుతుంటే ఉన్న రూ.50వేలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu : వలంటీర్ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
కాగా తమ సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక ఆందోళన చేపడతామని అంగన్వాడీ కార్యకర్తలు జగన్ సర్కారుకు అల్టీమేటం జారీ చేశారు. తమపై నిర్వహణ ఖర్చుల భారం కూడా భారీగా పెరిగిపోయిందని అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో మధ్యాహ్న భోజనం నిర్వహణ కష్టతరంగా మారిందని.. ప్రస్తుతం గ్యాస్ బండకు ప్రభుత్వం రూ.600 మాత్రమే చెల్లిస్తోందని.. మిగతా రూ.550 తమ జీతం డబ్బులతో కట్టాల్సి వస్తోందని అంగన్వాడీలు మండిపడుతున్నారు. తమపై భారం మోపడం ప్రభుత్వానికి సరికాదని సూచిస్తున్నారు. నాలుగేళ్లుగా తమ వేతనాలు పెంచలేదని.. కానీ నిత్యావసర ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ తీరులో మార్పు రావాలని అంగన్వాడీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. రూ.10వేల ఆదాయ పరిమితిని తొలగించి తమకు కూడా సంక్షేమ పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - 2023-07-12T14:21:09+05:30 IST